
మరికల్, ఆగస్టు 6: కోయిల్‌సాగర్ కింద వ్యవసాయ పొలాలు మరో కోనసీమను తలపిస్తున్నాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రైతు కన్నీరు పెట్టిన ప్రాంతంలో నేడు రైతులు తమ పంటలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మండలంలోని పూసల్పాడ్లో శుక్రవారం మంత్రి రైతువేదిక, చెక్‌డ్యాంను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు కష్టాలతో కన్నీళ్లు పెట్టుకున్నారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతులు నూతన వ్యవసాయం వైపు దృష్టిసారించాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే నారాయణపేట జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మన్నెవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలతో భూగర్భజలాలు పెరిగి రైతులకు పుష్కలంగా నీరు వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, పేట, దేవరకద్ర ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళారాజవర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సంపత్‌కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తాం
తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్‌సార్ జయంతిని శుక్రవారం దేవరకద్రలో ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పశువైద్యశాల నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి భూమిపూజ చేశారు. రూ.25లక్షల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని మంత్రి పశువైద్యాధికారులను కోరారు. అనంతరం గూరకొండలో రూ.5.47కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను ప్రారంభించారు. ఈ చెక్‌డ్యాంతో 30వేల ఎకరాలకు సాగునీరు, మరో 20వేల ఎకరాలకు భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. తెలంగాణ ఏర్పడకపోతే ఈ పనులు ఎప్పటికీ పూర్తయ్యేవి కావని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా దళితబంధు పథకాన్ని దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్, జెడ్పీటీసీ అన్నపూర్ణ, ఎంపీడీవో శ్రీనివాసులు, తాసిల్దార్ జ్యోతి, పార్టీ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, పశువైద్యాధికారి జీషాన్‌అలీ, సర్పంచులు కొండావిజయలక్ష్మి, పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.
చదువుతోనే బంగారు భవిష్యత్
చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీఎస్పీ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్, డీఐఈవో వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ భగంతచారి, అధ్యాపకులు నర్సింహారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన్నెవాగులో మంత్రి చేపల వేట
మరికల్ మండలం పూసల్‌పాడ్ సమీపంలోని మన్నెవాగులో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సరదాగా చేపలు పట్టారు. టవల్‌తో నీటిలో చేపల కోసం గాలించారు. మంత్రితో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నా చేపలు దొరకలే అనగానే అక్కడే ఉన్న ఎంపీ మన్నె, ఎమ్మెల్యే ఆల నవ్వుతూ ఇక్కడ దొరకవు.. చెక్‌డ్యాం లోపల పట్టండంటూ నవ్వుకున్నారు.