అమ్రాబాద్, ఆగస్టు 16: కౌమార దశలో 10నుంచి 19ఏండ్ల బాలబాలికలు 14 సూత్రాలను తప్పనిసరిగా పాటిస్టే భవిష్యత్తు సాఫీగా సాగుతుందని మన్ననూర్ ఆరోగ్యకేంద్రం వైద్యురాలు అరుణ పేర్కొన్నారు. అమ్రాబాద్, మన్ననూర్ పీహెచ్‌సీల్లో వేరువేరుగా సోమవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల్లో ఆమె మాట్లాడారు. మండలంలో కౌమార దశ బాలబాలికపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. 10నుంచి 19ఏండ్ల మధ్య వయస్కులకు 14రోజులపాటు 14 అంశాలు తెలిపేలా 77మందికి శిక్షణ ఇచ్చామన్నారు. దీంతో విద్యార్థినులకు ఆరోగ్యం, సమాజపరంగా వివిధ దశల్లో ఎదురయ్యే సమస్యలపై వివరించారు. అదేవిధంగా చిన్న వయస్సులో సమస్యలపై ఏవిధంగా పోరాడాలన్న దానిపై ఈ 14 అంశాలు ఉంటాయని అన్నారు. గ్రామాల్లో శిక్షణ పొందిన వారు విస్తృతంగా తమ మిత్రులకు తమ వయస్సు వారికి తెలపాలని కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు భారతి, పార్వతి, బిక్కులాల్, సుకుమారి, ఆశలు పాల్గొన్నారు.
సమ వయస్కులకు శిక్షణ
ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమ వయస్కులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వెల్టూర్, సదగోడు సబ్‌సెంటర్ పరిధిలోని 10నుంచి 19ఏండ్ల బాలబాలికలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తారాసింగ్ మాట్లాడుతూ కౌమార బాల,బాలికలకు పౌష్టికాహార ఆవశ్యకత, పోషణతోపాటు ప్రభావితం చేసే అంశాలు, జీవనశైలికి సంబంధించిన విధానాలు, ఆరోగ్యవంతమైన మనస్సు, వ్రవర్తన, కౌమారుల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం, లింగత్వాన్ని అర్థం చేసుకోవడం, హింస తదితరాలను వివరించారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ జోన్స్, సూపర్వైజర్లు శంకరమ్మ, ప్రభావతి, పార్మసిస్ట్ శ్రీనివాసులు, ఏఎన్ఎంలు ఉమాదేవి, రాధాభాయి, మల్లేశ్వరి, మంజుల, లక్ష్మి, నిర్మల, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.