వనపర్తి రూరల్, ఆగస్టు 8: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కులవృత్తులకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణ శివారులోని నర్సింగాయిపల్లికాలనీలో ఆదివారం పశువైద్యశాఖ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన జీవాలకు నట్టల నివారణకు మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పౌల్ట్రీ ఫాం మాదిరిగానే గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినదన్నారు. కొంతకాలంగా జీవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదన్నారు. మొదటి విడుతలో రూ.5వేల కోట్లతో యాదవులకు గొర్రెల యూనిట్లు అందించామని, రెండో విడుతలో రూ.10వేల కోట్లతో ఒక్కో యూనిట్‌కు రూ.1.75లక్షలతో 20 గొర్రె లు, పొట్టేలు పిల్లను అందిస్తున్నట్లు తెలిపారు. గొల్ల, కురుమలు మంచి లాభం పొందవచ్చన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మాంస ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. జీవాల పెంపుతో వ్యవసాయ సాగు భూములకు బహుళ ప్రయోజనాలున్నాయన్నా రు. త్వరలో జిల్లాలో 14వేల యూనిట్ల గొర్రెల పంపిణీ చేసుకుందామన్నారు. గొర్రెలు, మేకలున్న వారు ప్రభుత్వం పంపిణీ చేసిన నట్టల నివారణ మందులను జీవాలకు తాపించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం కన్వీనర్ కురుమూర్తియాదవ్, వైస్ చైర్మన్ చంద్రయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, మండల అధికారి ఆంజనేయులు, గొర్రెల కాపరుల సంఘం డైరెక్టర్లు పరశురాం, తిరుమల్, నాగేంద్రం, దేవేంద్రం, బీచుపల్లి, భాగన్న, గోపాల్పేట జెడ్పీటీసీ భార్గవి, రైతుబంధు సమితి గోపాల్పేట మండల కోఆర్డినేటర్ తిరుపతయ్య, మున్ననూర్ సర్పంచ్ శేఖర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణు, కౌన్సిలర్ కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి
పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అనారోగ్యం బారిన పడిన బాధితులకు సీఎం సహాయనిధి అండగా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాం పు కార్యాలయంలో వనపర్తి మండలానికి చెందిన 210మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, నియోజకవర్గానికి చెందిన 32మందికి రూ.8.43లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం సహాయనిధి పంపిణీలో రెండో స్థానంలో, అభివృద్ధిలో మూడోస్థానంలో వనపర్తి నియోజకవర్గం ఉన్నదన్నారు. అంతకుముందు కల్యాణలక్ష్మి లబ్ధిదారులతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు విభూతి నారాయణ, మహేశ్, మాజీ కౌన్సిలర్ రమేశ్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.