
మహబూబ్‌నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలకు ప్రతీతి. ఉమ్మడి జిల్లాలో దాదాపు కనుమరుగైన ఆ పార్టీలో నేతల గ్రూపు రాజకీయాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. దేవరకద్రకు చెందిన సీనియర్ బీసీ నాయకుడు, పార్టీ నియోజకవర్గ స్థాయి నేత కాటం ప్రదీప్ కుమార్‌గౌడ్‌పై ఆ పార్టీకే చెందిన మరో నియోజకవర్గస్థాయి నేత జి.మధుసూదన్‌రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. ప్రదీప్‌గౌడ్ ను పరుష పదజాలంతో దూషించారు. ఓ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడుతూ మధుసూదన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశం అయ్యాయి. జీఎంఆర్ ఫోన్లో మాట్లాడిన కాల్‌రికార్డింగ్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలకు సరైన గుర్తింపు లేదని చెప్పేందుకు మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని ఆ పార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ సీనియర్ బీసీ నేతపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తోందని, నిన్న మొన్న వచ్చిన వారికి పార్టీలో పెత్తనం ఏమిటని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓ సీనియర్ నేతపై బూతులు తిట్టడం పార్టీ సహిస్తుందా? అని బీసీ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ వెంటనే జీఎంఆర్ ను సస్పెండ్ చేయాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత పార్టీలో ఓ వర్గం నేతల హంగామా పెరిగిందని, ఆది నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లపై వీరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా మారి కుమ్ములాటలు ప్రారంభించింది. ఇలాంటి ఘటనలతో పార్టీ సర్వనాశనం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేవరకద్రలో ఇప్పటికే కనీసం అందుబాటులో లేకుండా ఉన్న బీజేపీ నేతలకు తోడు కాంగ్రెస్ నేతలు సైతం తమ నైజం చాటుకోవడంతో ప్రతిపక్షాల ఉనికే లేకుండా పోయింది. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మిగతా పార్టీలకు అందనంత దూరంలో ఉన్నారు. ప్రజాసమస్యలపై తమ గళం వినిపించాల్సిన ప్రతిపక్షాలకు కనీసం నియోజకవర్గంలో అవకాశమే లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.