నాగర్‌కర్నూల్, ఆగస్టు 25 : ఓ ఫర్టిలైజర్ యజమాని నకిలీ ఎరువులను అంటగట్టి మోసం చేశాడని, తాము గుర్తించి ప్రశ్నించినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు నకిలీ ఎరువుల బస్తాలతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. తెలకపల్లి మం డలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు నాగర్‌కర్నూల్ పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలోని నాగార్జున ఫర్టిలైజర్ దుకాణంలో రాజేందర్ అనే యజమాని వద్ద రెండు రోజుల కి ందట రూ. 1800 చెల్లించి 28-28-28 డీఏపీ ఎరువును కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పొలం వద్దకు తీసుకెళ్లి ఎరువు బస్తాను విప్పి చూడగా నకిలీ ఎరువు కనిపించింది.
28-28 బస్తాల్లోనూ 1350 రూపాయల 20-20 తక్కువ ధర ఎరువును ఉంచి విక్రయించాడని గుర్తించారు. ఇదేమని రైతులు సదరు దుకాణం యజమానిని ప్రశ్నించగా పట్టించుకోకుండా మాట దాటవేశాడు. ఈ ఎరువును వాడితే తమ పంట నాశనమవుతుందని ఆగ్రహించి నకిలీ ఎరువుల బస్తాలతో నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. తమతో నాణ్యత కలిగిన ఎరువు ధర తీసుకొని నకిలీ ఎరువులు ఇచ్చాడని, ప్రశ్నిస్తే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేక్రమంలో వారు తీసుకెళ్లిన నకిలీ ఎరువు బస్తాను, నాణ్యత కలిగిన మరో బస్తాను తీసుకెళ్లి రెండింటికి తేడాను గుర్తింపజేయడంతో సదురు నాగార్జున ఫర్టిలైజర్ యజమాని కాళ్లబేరానికి వచ్చాడు.
పొరపాటు జరిగిందని, నాణ్యమైనవే ఇస్తానంటూ, నష్టపరిహారం కింద రూ.2 లక్షలు కట్టిస్తానంటూ కలెక్టరేట్ ముందే కాళ్లబేరానికి వచ్చాడు. దీంతో ససేమిరా అని రైతులు ఒప్పుకోకుండా సదరు యజమాని రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దుకాణ పర్మిషన్ను రద్దు చేయాలని పట్టుబట్టారు. ఎంతకాలం రైతులను మోసం చేస్తారని, మీకు తెలిసే నకిలీ ఎరువులను విక్రయించారని మండిపడ్డారు.
రైతులు పండించిన పంటలకు తాలు అని, తరుగు అని పరిశీలించి కొర్రీలు పెట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారని, మాకెందుకు నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్ముతుంటే ఫర్టిలైజర్ దుకాణాదారులపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ దళారీ వ్యవస్థను ఎందుకు అడ్డుకోవడం లేదని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించారు. నకిలీ విత్తనాలు కానీ, నకిలీ ఎరువులను కానీ విక్రయించే ఫర్టిలైజర్ దుకాణాలను సీజ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ప్రతి ఎమ్మెల్యే తాము రైతు కుటుంబం నుంచి వచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇస్టానుసారంగా బ్లాక్‌లో యూరియా దొరుకుతుంది కానీ ప్రభుత్వం ద్వారా సరఫరా ఎందుకు చేయడం లేదని, రూ.250 ఉన్న యూరియా సంచిని బ్లాక్‌లో రూ.400 విక్రయిస్తున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చామని చెబుతున్న మం త్రులు, ఎమ్మెల్యేలు బ్లాక్‌ను అరికట్టలేరా అని మండిపడ్డారు.
తాము గమనించడంతోనే నకిలీ ఎరువులను గుర్తించామని, అంతకుముందు ఎంత మందికి విక్రయించి ఎంత మంది రైతులను మోసం చేశారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా మూడ్రోజుల కిందట సైతం సదరు నాగార్జున ఫర్టిలైజర్ యజమాని పాతస్టాక్ యూరియాను కొందరు రైతులకు అంటగట్టారు. అధిక ధరలకు విక్రయించాడని, వీటికి సంబం ధించిన ఫిర్యాదు అందుకున్న వ్యవసాయాధికారులు షోకాజ్ నోటీసులు అందించా రు. ఈ మోసాలకు సంబంధించిన వి వరణ ఇవ్వకపోగా రెండ్రోజుల వ్యవధిలోనే నకిలీ ఎరువు లు విక్రయించడం గమనార్హం.