
మహబూబ్నగర్, ఆగస్టు 9 : శ్రావణమాసం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు చేశారు. శ్రావణమాసంలో తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందస్తుగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మన్యంకొండలో..
మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రావణమాస విశేషోత్సవాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలి సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం, నూతన వస్త్ర, స్వర్ణాలంకరణ, శాంతిహోమం, హనుమద్దాసులవారి చరిత్ర పారాయణం, భజన కీర్తనలు నిర్వహిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో లక్ష్మీవేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య ప్రతి సోమవారం, శనివారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్, కార్య నిర్వహణాధికారి తెలిపారు.
బాలానగర్ మండలంలో..
మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో శ్రావణమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్పస్వామి, భవానీమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా అర్చనలు, అభిషేకాలు చేశారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు ప్రకాశ్, కృష్ణవేణి, నవ్యశ్రీ, సువర్ణ, మాధవి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.