శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mahabubabad - Oct 18, 2020 , 04:46:26

సార్‌ నమస్తే... నేను ఎమ్మెల్యేను

సార్‌ నమస్తే... నేను ఎమ్మెల్యేను

  • 563 నేషనల్‌ హైవే అధ్వాన్నంగా ఉన్నది
  • కేంద్రంతో మాట్లాడి రోడ్డును బాగు చేయించరూ.!
  • ఎన్‌హెచ్‌ఏ ఈఎన్‌సీ గణపతిరెడ్డితో 
  • ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌

మరిపెడ, అక్టోబర్‌ 17 : ‘హలో.. నేను డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మాట్లాడుతున్నాను. ఎన్‌హెచ్‌ఏ ఈఎన్‌సీ గణపతిరెడ్డేనా. సర్‌ మరిపెడ నుంచి తొర్రూరు వరకు 563 నేషనల్‌ హైవే అధ్వాన్నంగా ఉన్నది. జర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బాగుచేసేలా చూడండి’. అని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ జాతీయ రహదారుల కేంద్ర ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ఈఎన్‌సీ గణపతిరెడ్డికి శనివారం ఫోనులో విజ్ఞప్తి చేశారు. మరిపెడ మున్సిపాలిటీకి చెందిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను కలవడానికి ఉగ్గంపల్లికి వెళ్లారు. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏ వరంగల్‌ రోడ్డు దుస్థితిని వారు రెడ్యాకు వివరించారు. వెంటనే స్పందించిన ఆయన నేషనల్‌ హైవే ఈఎన్‌సీ గణపతిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మరిపెడ-తొర్రూరు వరకు హైవే దుస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించారు. ఒకానొక దశలో ‘సర్‌ ఐ కైండ్లీ రిక్వెస్ట్‌ ప్లీజ్‌ కమ్‌ అండ్‌ విజిట్‌ ఎన్‌హెచ్‌ఏ 563’ అని విన్నవించారు. మరిపెడ కాకతీయ కళాతోరణం నుంచి తొర్రూరు వరకు ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రజలు వణికిపోతున్నారన్నా రు. కనీసం ఆటో కూడా సరిగా నడపలేని దుస్థితి ఏర్పడిందని వివరించారు. నిత్యం రెండు మూడోందల గ్రానైట్‌ లారీలు ఇదే రోడ్డు గుండా వెళ్తుంటాయి. దీంతో ఈ రోడ్డుపై బాటసారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ సీడీఎఫ్‌ నిధులు ఉన్నా ఇచ్చే వాళ్లమని, కానీ, నిధులు లేక ఇబ్బందిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పనులు చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ఈఎన్‌సీ సమాధానమిస్తూ 15 రోజుల్లో రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో ప్యాచ్‌ వర్క్‌ చేయిస్తామని స్ట్రెన్త్‌ వర్క్‌ సమ్మర్‌ వరకు పూర్తి చేయనున్నట్లు ఆయన ఎమ్మెల్యే రెడ్యాకు ఫోన్లో వివరించారు.