ఇప్పటి ప్రపంచంలో ఆ మాట వినపడకపోవచ్చు లేదా దాన్ని పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు. కానీ 40-50 ఏళ్ల క్రితం దూర ప్రయాణాలకు, రైలు మాత్రమే సాధనంగా ఉన్న రోజుల్లో ప్రయాణాలకు; మరీ ముఖ్యంగా కాలేజీ హాస్టళ్లకు బయలుదేరే యువకులకు తప్పనిసరిగా అవసరమైంది ‘హోల్డాల్’ (Holdall). అందులో పరుపుగా ఉపయోగపడే వాటితో పాటు దుస్తులు, పుస్తకాలు ఇలా అవసరమైనవన్నీ ఉంచి చుట్టేసి రైలు పైబెర్త్లో పెట్టే వీలు ఉండేది. మరోరకంగా చెప్పాలంటే ఎవరికి అవసరమైనవి వారు అందులో వేసుకుని హాయిగా మూట కట్టుకోవచ్చు.
సాహిత్య ప్రక్రియల్లో ‘ట్రావెలోగ్’ లేదా ‘యాత్రాకథనం’ గురించి ఆలోచించినప్పుడు నాకు ‘అన్ని సర్దుకో’ అని అర్థం వచ్చే ‘హోల్డాల్’ తప్పక గుర్తుకు వస్తుంది. బహుశా రచయితలు తెలుగులో చాలా తక్కువ దృష్టి పెట్టిన ప్రక్రియ ‘ట్రావెలోగ్’ కావచ్చు. 1830 మే -1831 సెప్టెంబర్ మధ్యకాలంలో 15 నెలల 15 రోజుల పాటు ప్రయాణం చేసి ‘నా కాశీ యాత్ర’ పేరున ఏనుగుల వీరాస్వామయ్య దక్షిణాది భాషల్లో తొలి ట్రావెలోగ్ తెలుగులో రచించారు. తొలుత 1838లో వెలువడిన ఈ పుస్తకం, 1869లో పునర్ముద్రణ పొంది, తర్వాత దాదాపు కనుమరుగైంది. చరిత్ర పరిశోధకులు దిగవల్లి వెంకటశివరావు 1941లో ముద్రించడంతో మళ్లీ అందుబాటులోకి వచ్చింది.
1873-74లో ఇంగ్లండ్ వెళ్లివచ్చిన పోతం జానకమ్మ తన యాత్రానుభవాలను ‘ఆంధ్ర భాషా సంజీవని’లో ప్రచురించారు. అది తెలుగు రచనే అయినా, అనువాదమై తొలుత ఆంగ్లంలో 1876లో పుస్తకంగా రావడం విశేషం. ఏనుగుల వీరస్వామయ్య, పోతం జానకమ్మ మధ్యకాలంలో శివశంకర పిైళ్లె తన ఇంగ్లండ్ యాత్ర గురించి ‘శ్రీ సాధన
పత్రిక’లో లేఖలుగా రాశారు.
డాక్టర్ నాయని కృష్ణకుమారి కశ్మీర్ పర్యటనను ఆధారంగా చేసిన రచనను చాలామంది పేర్కొంటూ ఉంటారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి రష్యా పర్యటన అనుభవాలను 1980లో ‘ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక’లో ధారావాహికంగా రాశారు. 1990 తర్వాత చాలామంది తమ యాత్రానుభవాలను కవితలుగా, వ్యాసాలుగా రాస్తూనే ఉన్నారు.
ఇటీవల ఎం.ఆదినారాయణ ‘భ్రమణకాంక్ష’, ‘స్త్రీయాత్రికులు’ వంటి రచనలు, ‘తెలుగువారి ప్రయాణాలు’ సంకలనం వెలువరించగా; స్వర్ణ కిలారి వందమంది మహిళలు రాసిన యాత్రాకథనాలను ‘ఇంతియానం’ పేరిట రెండు సంకలనాలుగా ప్రచురించారు. ‘ఇంతియానం’ రెండో సంకలనం ఆవిష్కరణ సమయంలో పర్యటనలు, యాత్రలకు మధ్య తేడా ఏమిటి? ఏవి యాత్రారచనలు ? అనే చర్చ జరిగింది. ప్రణాళిక వేసుకుని, పూర్వ అధ్యయనం చేసుకుని, నింపాదిగా వెళ్లి, వీలైనంత సమగ్రంగా కథనం రాస్తే దాన్ని ‘యాత్రాకథనం’గా పరిగణించాలని భావించినట్టు నాకు అర్థమైంది.
అవసరార్థం ఏదో పనిమీద వెళ్లి వచ్చిన వాటి గురించి రాయడం సబబు కాదేమోనని ధ్వనించింది. తెలుగులో నిలదొక్కుకొని యాత్రారచనల గురించి ఇదంతా ఎందుకనిపించింది. ఏ రచన అయినా ప్రయోజనకరంగా, చదివించే రీతిలో ఉంటే అది నాలుగు కాలాలపాటు ఉంటుంది. ఆ సభలోనే ఒక రచయిత్రి మిద్దె మీదికి వెళ్లి, నిండు చంద్రుని కాసేపు చూసి, మళ్లీ నెమరు వేసుకోగలిగితే అది కూడా ఇటువంటి రచన అని చక్కగా తేల్చేశారు. ఏ సాహిత్య ప్రక్రియలో లేనంత సౌలభ్యం యాత్రా కథనంలో ఉంటుంది. మీ ఆసక్తికి తగిన ఏ ప్రాంతమైనా దానికి సంబంధించిన చరిత్ర, సంస్కృతి, సౌందర్యం.. ఇలా ఏ విషయాన్నైనా సమాచార, అనుభూతి ప్రధానంగానో, కళాత్మకంగానో, హాస్యస్ఫోరకంగానో రాయవచ్చు. కనుకనే యాత్రా కథనాలను ‘హోల్డాల్’తో పోలుస్తూ నేను చర్చించాను. అందులో ఏ వస్తువైనా ఒదిగిపోతుంది. మీరు ఆకర్షణీయంగా అమర్చితే పాఠకులు తప్పకుండా ఆదరించి అక్కున చేర్చుకుంటారు.
– డా నాగసూరి వేణుగోపాల్ 9440732392