యాదగిరీశునికి సంకీర్తనల హారం
- మన వాగ్గేయకారుడు ఈగ బుచ్చిదాసు
యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వైభవోపేతంగా ఆవిష్కృతమైన తరుణంలో స్వామి సన్నిధిలో కాలం వెల్లబుచ్చిన ఇద్దరు మహానుభావులను గురించి తెలుసుకోవాల్సిన సమయం ఇది. తన సంకీర్తనలతో యాదగిరీశునికి మేల్కొల్పులు పాడి నిద్ర లేపి భక్త హృదయాలను రంజింపచేసిన పదకర్త ఈగ బుచ్చిదాసు ఒకరైతే, కందార్థాలను సాహిత్యరంగంలో పేరొందేట్లు చేసిన మహనీయుడు భాగవతుల కృష్ణప్రభువు.ఒకరు యాదగిరిపైనే నివాసం ఉండి జీవన పర్యంతం స్వామికి అక్షరార్చన చేస్తే, మరొకరు కొలనుపాకలో తన జీవితం ప్రారంభించిన మహనీయుడు. భాగవతుల కృష్ణ ప్రభువు అచల సిద్ధాంతం భుజంపై మోస్తే, బుచ్చిదాసు అమలిన కీర్తనలను స్వామికి నైవేద్యంగా సమర్పించాడు.
వరంగల్‌కు చెందిన ఈగ బుచ్చిదాసు 1907లో జన్మించారు. వారి తల్లిదండ్రులు, ఇతర వివరాలు తెలియవు. కానీ అతడు పద్మశాలి కులస్థుడనీ, యాదగిరిగుట్టకు రాకముందు బట్టల షాపులో గుమాస్తాగా పనిచేసినట్లు తెలుస్తున్నది. అతనికి భార్య, ఓ కుమారుడున్నట్లు శతకంలో చెప్పుకొన్నాడు. 1937-38 ప్రాంతంలో వారికి అనారోగ్యంగా ఉండటం వల్ల స్వామిని సేవించడం కోసం యాదగిరిగుట్టకు వచ్చారట!
ఆ సమయంలో యాదగిరిగుట్టలో విద్యుత్ సౌకర్యం గానీ, ఇతర సదుపాయాలేమీ లేకుండేవి. బుచ్చిదాసు ప్రస్తుతం కొండపైనున్న గుండం దగ్గర చిన్నకుటీరం వేసుకొని నిత్యం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని సేవిస్తుండేవారు. ముఖ్యంగా ఆయన తన ఆరోగ్యం బాగుపడాలని నరసింహ దీక్షను స్వీకరించి స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. అతని ఆరోగ్యం బాగుపడగానే అక్కడే మరింత నిష్ఠతో నరసింహారాధన చేశాడు. ఈలోపు ఉత్పల చెన్నయ్య (చెన్నదాసు) అనే గురువు దగ్గర కారణం (ఉపదేశం) పొందాడు.
ఆ తర్వాత వారు తన కుటీరంలోనే ‘కానిగి బడి’ నడిపా రు. ఆ పాఠశాలలో ‘ప్రహ్లాద చరిత్ర’, ‘గజేంద్రమోక్షం’ వంటి భాగవత ఘట్టాలు, పెద్ద బాలశిక్ష, నీతి శతకాలు చెప్పేవారు. బుచ్చిదాసు కులభేద రహితంగా అందరికీ విద్యను బోధించేవాడు. బుచ్చిదాసులో భక్తి, జ్ఞానాలతోపాటు తత్వదృష్టి కూడా ఉంది. గురువు చెన్నదాసు ఇందుకు కారణమై ఉండవచ్చు. బుచ్చిదాసు సంకీర్తన రచనలతోపాటు భక్తి, వేదాంతాలను ప్రబోధం చేశాడు. ఈ క్రమంలో రాంరెడ్డి అనే పెద్దమనిషి తన కూతుళ్ళు బుచ్చమ్మ, దశరథలను చదువుకోవడానికి బుచ్చిదాసుకు అప్పగించాడు. అప్పటికే 5వ తరగతి చదివిన బుచ్చమ్మ ఆయన ప్రియశిష్యురాలై ఆయన వెంట నడిచింది. అనంతర కాలంలో ఆమె నరహరి అనే భక్తుడిని దత్తపుత్రుడిగా స్వీకరించగా ఆయన కూడా దాసుగారికి శిష్యుడైనాడు. ఈ బుచ్చమ్మనే అనంతరం సాధు బుచ్చిమాంబగా మారింది.
ఈ రోజు బుచ్చిదాసు కీర్తనలు లభించాయంటే ఈ సాధు బుచ్చిమాంబనే కారణం. ఆమె వాటిని రాసిపెట్టి బుచ్చిదాసు సాహిత్యానికి సజీవత్వం కలిగించింది. కొన్ని సంకీర్తనలు దాసుగారి కాలంలో ముద్రింపబడగా మరికొన్ని భాగాలు బుచ్చిమాంబ ముద్రించారు. ప్రతిరోజూ బుచ్చిదాసు తన శిష్యులను వెంటబెట్టుకొని బ్రాహ్మీ ముహూర్తంలోనే నగర సంకీర్తనతో వెళ్లి స్వామివారి కోవెల ముందు మేలుకొలుపు కీర్తనలు ఆలపించేవారు. ఆ తర్వాతనే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి తలుపులు తెరిచేవారు. దాసు కీర్తనలు అలవోకగా చెప్తుంటే.. బుచ్చిమాంబ, ఇతర శిష్యులు రాసిపెట్టేవారు.
ఆ కాలంలో ఎందరో వాగ్గేయకారులు తెలంగాణ ప్రాంతంలో దాస సంప్రదాయంలో జీవించారు. భద్రాచల రామదాసు, రాకమచర్ల వేంకటదాసు, వేపూరు హనుమద్దాసు, మల్కిదాసు, వెలివర్తి రామదాసు, మన్నెంకొండ హనుమద్దాసు మొదలైన సంకీర్తన కవులంతా తమ పేరు చివర ‘దాసు’ను చేర్చుకొని, తాము ఆరాధించే భగవంతునికి, భక్తజనులకు దాసులుగా ఉండేవారు.
బుచ్చిదాసు గురుపరంపరను సాధుబుచ్చిమాంబ తన శిష్యులకు చెప్పుకొన్నది. వారిది ప్రసిద్ధమైన కబీరుదాసు పంథాగా ఆమె జీవిత విశేషాలు తెలిపిన గొల్లపూడి కామాక్ష మ్మ భాగవతార్ రాశారు. తెలంగాణలో అగ్రశ్రేణిలో నిల్చిన వాగ్గేయకారుడు రామదాసుది కూడా కబీరుదాసు పరంపరనే అని చెప్తారు. ఈ పరంపరలో కబీరుదాసు, మంథిని వెంకటాచార్యులు, ఎడ్ల రామదాసు, చెన్నకేశవులు (చెన్నదాసు), బుచ్చిదాసు, మాతా బుచ్చిమాంబగా గురు పరంపరను కామాక్షమ్మ పేర్కొన్నారు.
బుచ్చమ్మనే బుచ్చిదాసు ముఖ్య శిష్యురాలై ఆమె గురువు నుంచి యోగ విద్యను పొందింది. భక్త కబీరు, అన్నమయ్య, చైతన్య ప్రభువు, మీరాబాయిలా నగర సంకీర్తనం, నామరూప సంకీర్తన చేస్తూ గురువు వెంట నడిచేది. దాదాపు ఆమెకు 47 ఏండ్లు వచ్చేవరకు అంటే సుమారు 20 ఏండ్లు కొండపైన దేవస్థానం వారిచ్చిన ఆశ్రమంలోనే గురు, శిష్యులుగా ఉండేవారు. బుచ్చిదాసు గారి శిష్యరికంలో ఆమె పన్నెండేండ్లు తపస్సు చేసింది.
కారణగురువు అయిన బుచ్చిదాసు భక్తిభావంతో సంకీర్తనలు రచించారు. ఆయన సంకీర్తనలు స్వామి వారి ముందు ఆలపిస్తూ షోడశోపచార పూజల్లో గీతాలను వినిపించేవారు. బుచ్చిదాసు కీర్తనలను 1962లో ముద్రించారు. ఇవి నాలు గు భాగాలుగా ఉన్నాయి. ఇందులో మొత్తం 127 కీర్తనలు ఉండగా అందులో చివర 14 మేలుకొలుపులు, మంగళహారతులున్నాయి. కీర్తనలతో పాటు తత్వాలు కూడా ఉన్నాయి. ప్రతి కీర్తనకు రాగం, తాళం నిర్దేశం చేయబడింది. సాధారణంగా భజన కీర్తనలకు రాగ ప్రాధాన్యం కన్నా తాళ ప్రాధా న్యం ఎక్కువ. కానీ బుచ్చిదాసు చక్కని సంగీత పరిజ్ఞానం తెలిసిన వాడిలా అనేక రాగాలు వాడుకొన్నాడు.
బిళహరి, కాంభోజ, ఫీలురాగం, యెదుకుల కాంభోజి, కేదారి గౌడ, నాదనామక్రియ వంటి రాగాలను ఉపయోగించి కీర్తనలు రచించాడు. ప్రతి కీర్తన 5 నుంచి 15 పాదాలలోపుగా ఉంటూ చక్కని విభాగంతో రచింపబడింది. కీర్తనలన్నీ, ప్రాస నియమంలో నడిచాయి. దానివల్ల కీర్తనలకు సాహిత్యపరంగా బలం చేకూరింది. అవసరమైనప్పుడు సంస్కృత శబ్దాలను ప్రయోగించి కీర్తన కుంటుపడకుండా నడిపించాడు. సదయ హృదయ, మందరధర, సుందర రూపా, పుంగవాశ్రితరతీ, దైత్యశాసనాను కూల, నిత్యసూరి సేవితాంఘి, కరిగిరీంద్రరత్ననిలయ వంటి వాటిని ఉదాహరణకు చెప్పవచ్చు.
తెలంగాణ ప్రాంతంలో సంస్కృతేతర సంకీర్తన కవులు ఎలాగైతే దేశిపదాలను తత్వాల్లో వాడినట్లే, బుచ్చిదాసు కూడా ఇక్కడి పలుకుబడులను, జాతీయాలను విరివిగా వాడినాడు. జాతీయాలు, నుడికారాలను అవసరమైనచోట ప్రయోగించి సంకీర్తనలకు కావలసిన ఉపమానాలను అందించారు బుచ్చిదాసు.
బుచ్చిదాసు కీర్తనల్లో పదాలను దీర్ఘాలను హ్రస్వాలుగా, హ్రస్వాలను దీర్ఘాలుగా మార్చుకోవడం చూస్తాం. ఇది భజనకవులంతా చేసే పనే. తాళానికి పదం ఒదగన ప్పుడు సంకీర్తన కవులు ఇలాంటి ప్రయోగా లు చేస్తారు. సామాన్యులు పాడటానికి అనుగుణంగా భాష, శబ్దప్రయోగం, ఉపమానాలు, నడక ఈ కీర్తనల్లో కన్పిస్తుంది.
బుచ్చిదాసు శివ, కేశవ భేదం పాటించలేదు. నరసింహస్వామికి తూర్పుభాగంలో శివాలయం ఉంటుంది. ఆ శివుణ్ణి కూడా అంతే స్థాయిలో స్తుతించాడు. ఊర్ధ్వపుండ్రాలు ధరించి వైష్ణవ భక్తుడిలా కన్పించినా, శివపారమ్యంతో భజన కీర్తనలు రాసి హరిహరాద్వైతం ప్రదర్శించాడు. బుచ్చిదాసు సంప్రదాయం తెలిసిన కవి. సంకీర్తనల అనంతరం మంగళహారతులు పాడటం భక్తి సంప్రదాయం. ఇందు లో భగవంతునికి మంగళం చెప్పడం ప్రధానం. దాసు తన కీర్తనల్లో ప్రతీ రచన చివర కొన్ని మంగళహారతులు, మేలుకొలుపులు, పవళింపు గీతాలు రచించినా ప్రత్యేకంగా ‘మంగళహారతులు’ రచించారు. 1957 జూన్ 19న ఉ.11 గంటలకు బుచ్చిదాసు దేహత్యాగం చేశాడు. వారి సమాధిని గుట్టకు కిందభాగంలో నిర్మించింది బుచ్చిమాంబ. సంకీర్తన మార్గం లో జీవితాన్ని సార్థకం చేసుకున్న అచ్చ తెలంగాణ కవి, భక్తు డు బుచ్చిదాసు.
– డాక్టర్ పి.భాస్కరయోగి
91778 23010
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

