ఇప్పుడు ఏ దిక్కు చూసినా అందరికీ ఇంగ్లిషే దిక్కయి పోయింది. అమ్మ భాషను అమృత భాషగా నిలపాలి కానీ, రోజురోజుకూ అంతమయ్యే దశకు చేరుకుంటున్నదనే ఆవేదన మాత్రం మిగులుతోంది. ‘మరి మన భాషను కాపాడేదెలా?’ అనే ప్రశ్న మాత్రమే పుడుతుంది కానీ సమాధానం మాత్రం దొరకడం లేదు. ప్రభుత్వమే ముందుకొచ్చి అవసరమనుకున్న చోట తెలుగును తప్పనిసరి చెయ్యాలి. లేదంటే మన భాష మనకే కనబడకుండా పోతుంది. చివరికి స్పోకెన్ ఇంగ్లీష్ మాదిరిగా రాబోయే తరానికి స్పోకెన్ తెలుగు తరగతులు మొదలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. మన తెలుగును మనమే కాపాడుకుందాం. దానితో పాటే తెలుగు కవిత్వాన్ని కూడా కాపాడుకుందాం.
ఆ మధ్య ఒక పాఠశాల స్థాయి విద్యార్థి ఒక తెలుగు కవిత చదివి అందులో ఉన్న ఇంగ్లీషు వాక్యం చూసి ఇది తెలుగు కవితనా, ఇంగ్లీష్ కవితనా సార్? అని అడిగాడు. దీనికి సమాధానం చెప్పడానికి ఒకసారి ఆలోచించాను. పరాయి పాలనా ప్రభావంతో ఇంగ్లీష్ పదాలు, ఉర్దూ పదాలు మన తెలుగు భాషలో వచ్చి చేరాయి. వాటిని మనం వాడుకలో ఎంతగానో ఉపయోగిస్తున్నాం. కానీ, పుస్తకాల రూపంలో శాశ్వతంగా నిలిచిపోయే సాహిత్యంలో కూడా ఇంగ్లీష్ భాషా పదాలు వాడటం ఎంతవరకు సమంజసం. కవితకే కాదు, ఆఖరికి పుస్తకానికి పేరు కూడా ఇంగ్లీష్‌లో పెట్టే వరకు వెళ్లింది.
తెలుగులో పదాలు దొరకట్లేదా లేక ఇంగ్లీష్‌పై మోజు ఎక్కువై తెలుగు అంటే లోకువైందా, ఎంతో గొప్ప ప్రాచీన సాహిత్యాన్ని అందించిన మన ప్రాచీన తెలుగు కవులు అప్పుడు ఇంగ్లీషు లేకపోవడంతో ఇప్పుడు చిన్నబోయారా, నిజానికి మన తెలుగును తక్కువ చేసేది మన తెలుగు వాళ్లమే అనేది స్పష్టం. మనం కాకపోతే సీపీ బ్రౌన్ వంటి ఆంగ్లేయులు మళ్లీ పుట్టాలేమో.
నవల, కథ లాంటి ప్రక్రియలో సంభాషణల ప్రభావంతో వాడొచ్చేమో కానీ కవిత్వంలో అవసరం లేదనిపిస్తుంది. అనువాదానికి వీలుకాని పదాలు వాడొచ్చునేమో కానీ అవసరం లేనిచోట అందమైన తెలుగు పదాలు వాడే అవకాశం ఉన్నచోట కూడా ఇంగ్లీష్ పదాలు వాడటం అనేది తెలుగును అవమానించడమే. ఇప్పుడు వస్తున్న కవిత్వంలో ఇంగ్లీష్ పదాలకు బదులుగా తెలుగు పదాలను ఎలా వాడగలమో ఉదాహరణలతో సహా చెప్పొచ్చు. కానీ, ఆ విమర్శను సద్విమర్శగా తీసుకునేవారు లేరు. ఉదాహరణకు ఒక పత్రికలో వచ్చిన సుంకర గోపాలయ్య కవితలో ‘హాస్టల్’, ‘టీ’ అనేవి అవసరం మేరకు వాడిన రెండు పదాలు, మానస చామర్తి కవితలో ‘ఫోన్’ అనే ఒక పదం మాత్రమే వాడి ఇరువురూ మంచి కవిత్వాన్ని అందించారు. అలాగే మిగతా కొన్ని పత్రికల్లో చూస్తే, ఆయా కవులు వాడిన పదాలు ‘టీవీ సీరియల్’, ‘వాట్సాప్’, ‘ఏసీ’, ‘డిగ్రీ’, ‘సర్టిఫికెట్స్’, ‘మేనిఫెస్టో’, ‘హాస్టల్’, ‘ఆన్లైన్’, ‘ఇంజనీరింగ్’, ‘గ్రూప్’లు, ‘వెంటిలేటర్’, ‘వార్రీల్’, ‘సెల్ టవర్’, ‘రేడియషన్’, ‘సెర్చ్‌లైట్స్’, ‘రోడ్’, ‘ట్రాఫిక్’ వీటిల్లో మూడు, నాలుగు పదాలు తప్ప మిగతావి అనువాదానికి వీల్లేనివే. ఇలాంటి కవిత్వంతో ఇబ్బంది లేదు. భాషావేత్తలు ప్రజలు వాడటానికి వీలయ్యే విధంగా సరళమైన అనువాద పదాలు అందిస్తే బాగుంటుంది. వాటిని వాడుకలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా తెలుగు వారందరిపైనా ఉన్నది.
తెలుగు కవిత్వాన్నే కాదు, తెలుగు భాషను కూడా కాపాడే బాధ్యత కవులకే కాదు పత్రికలకు కూడా ఉన్నది. ఆ దిశగా ప్రయత్నం చెయ్యాలి. ఇప్పటికీ ఎందరో కవులు తెలుగు కవిత్వపు కమ్మదనాన్ని పంచుతున్నారు. కొందరు మాత్రమే ఎందుకో పక్కకు వెళ్లి అలంకరణ, ఆర్భాటం అనుకొని ఇంగ్లీష్‌ను ఆశ్రయిస్తున్నారు.
బహుశా పద్యానికి ఈ దుస్థితి రాకపోవచ్చు. కొండొకచో రాయనూవచ్చు. కానీ, వచన కవిత్వం మాత్రం ఇంగ్లీష్‌ను కన్ను గీటి ప్రేమగా ఆహ్వానిస్తున్నది. ఒక ఇంగ్లీష్ కవిత రాసి అందులో ఒక తెలుగు వాక్యాన్ని గానీ, కనీసం ఒక తెలుగు పదాన్నైనా రాయగలమా, అంత సాహసం చెయ్యగలమా! ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్‌లో రాయండి కానీ తెలుగు కవిత్వంలో ఇతర భాషా పదాలు వాడకపోతే ఇంకా బాగుంటుంది. అది వంద శాతం సాధ్యం కాదు కానీ, తొంబై తొమ్మిది శాతం సాధ్యమవుతుంది. ఆదాన ప్రదానాల ప్రభావం చేత కన్నడ, మరాఠి, ఉర్దూ పదాలు తెలుగులోకి వచ్చి చేరి తెలుగు పదాలే అన్నంతగా కలిసిపోవొచ్చు. కానీ, ఇంగ్లీష్ పదాలు మాత్రం పంటి కింద రాయిలా వచ్చి చేరుతున్నాయి. ఇంతకుముందు కవులు రాయలేదా అంటే రాసి ఉండొచ్చు కానీ రాయాలని నియమం ఏమీ లేదుగా. నేటి తెలుగు కవిత్వం రాబోయే, రాయబోయే కవులకు మార్గదర్శకం కావాలి. ఆంగ్ల వ్యామోహం నిత్య జీవితంలో ఉండొచ్చునేమో, కవిత్వంలో కాదు కదా! తెలుగు కవిత్వాన్ని స్వచ్ఛమైన, అందమైన, మధురమైన కవిత్వంగా ఉంచేలా ప్రయత్నం చేద్దాం. ఇది నాలాంటి కొందరి ఆవేదన, దీన్ని సద్విమర్శగా స్వీకరిస్తే ఆనందం.
పుట్టి గిరిధర్
9494962080