ధ్వని (Suggestion), వక్రోక్తి (the artistic turn of speech), అన్యాపదేశం లేదా సూచన (allusion), పరోక్షత్వం (indirectness) – ఇవన్నీ సుమారు ఒకే అర్థాన్ని కలిగిన వేర్వేరు పదాలు. వీటిలో మొదటి రెండు ఆమోదిత/ ప్రతిష్ఠిత పారిభాషిక పదాలు. వక్రోక్తి, అన్యాపదేశం రెండూ ఒకటే కాకపోయినా, వీటి మధ్య ఉన్న భేదం చాలా స్వల్పం. నిజానికి శ్లేష (pun), ప్రతీక (symbol), తప్పించుకోవడం (Elusion) కూడా సంబంధిత పదాలే. వక్రోక్తికి వంకరమాట అనే లిటరల్ (శబ్దపరమైన) అర్థం ఉంది. దీన్నే ఇంగ్లీష్‌లో innuendo అంటాం.
కానీ, ఇది భామహ కుంతకులు చెప్పిన వక్రోక్తికి పూర్తిగా భిన్నం. మొదటిదానిలో కళాత్మకత లేదు, రెండవదానిలో ఉంది. అందుకే దాన్ని artistic turn of speech అనడం. మొదట చెప్పిన పరస్పర సంబంధిత పదాలు ఎన్నో ఉన్నా, ఈ వ్యాసంలో వక్రోక్తినీ, అన్యాపదేశాన్నీ ప్రత్యేకంగా ఎన్నుకుని వివరించడం ప్రధాన ధ్యేయం.
వక్రోక్తిని ప్రతిపాదించి బలపరిచిన మన ప్రాచీన ఆలంకారికులలో భామహుడు, కుంతకుడు ముఖ్యులు. కుంతకుడు వక్రోక్తిని కవిత్వానికి ఆత్మగా, ప్రాణంగా అభివర్ణించాడు. ఇంకా, అది నైపుణ్యానికీ సృజనాత్మకతకూ నిదర్శనం అన్నాడు. రూపకం వంటి కొన్ని అలంకారాల సహాయంతో కూడా వక్రోక్తిని సాధించవచ్చునన్నాడు. ప్రతీకలు (symbols), పదక్రీడ (wordplay), వ్యంగ్యం (Irony) మొదలైనవి కూడా వక్రోక్తిని, అన్యాపదేశాన్ని సాధించేందుకు ఉపయోగపడుతాయి.
పోతన ఒక పద్యంలో కృష్ణుని చేత మాట్లాడించినదాన్ని వక్రోక్తికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ పద్యంలో కృష్ణుడు, ‘నీవు నా స్నేహితుడవు’ అంటాడు, చంద్రునితో. కృష్ణుని చుట్టూ గోపికలు ఉన్నట్టే చంద్రుని చుట్టూ తారకలు ఉంటాయి కదా! కాబట్టి, ఇది వక్రోక్తి. నువ్వు చాలా పెద్ద మనిషివి అనే బదులు, నువ్వూ చాలా పెద్ద మనిషివి అనడంలో కూడా వక్రోక్తి ఉంది.
వక్రోక్తి, అన్యాపదేశం ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండే అంశాలు. రెండవదాన్ని ఆధునిక కవులు కొందరు అందంగా ఉపయోగించారు. ఎమ్మెస్ సూర్యనారాయణ తన ఒక కవితకు పెట్టిన శీర్షిక ‘పియానో మెట్ల మీద గాడిద శవం.’ అంటే, ఒకాయనెవరో పియానో వాయిస్తే గాడిద అరుపు లాంటి ధ్వని వచ్చిందన్నది ఇక్కడి ‘ధ్వని’. గాడిద శవంకు బదులు గార్దభ శవం అని రాసి వుంటే సూచన మరికొంత సులభంగా అందేదేమో. గార్దభ స్వరానికి సంగీతంలో లంకె ఉంది మరి. కానీ, అలా అందకపోవడంలోనే అందం ఉంది! ఇతని కథల్లో కూడా ఈ లక్షణం విరివిగా కనిపిస్తుంది. ఐతే వక్రోక్తి అన్యాపదేశాలు ప్రధానంగా కవిత్వానికి సంబంధించినవి అని చెప్పవచ్చు.
ఈ వ్యాస రచయిత తన ఒక ప్రయోగాత్మక పద్యానికి పెట్టిన ‘ట్రంపెట్ పై శివరంజని’ అనే శీర్షిక కూడా సూచనతో కూడుకున్నది. అచ్చం వచన కవిత లాగా కనిపించే విధంగా చందోబద్ధ పద్యాన్ని రాయడం ఆ ప్రయోగం. ట్రంపెట్ పాశ్చాత్య సంగీత పరికరం. దాని మీద గమకాలు పలకవు. అటువంటి వాద్యం మీద భారతీయ శాస్త్రీయ సంగీతానికి చెందిన శివరంజని రాగాన్ని పలికించడం ఎంత కష్టమో, అచ్చం వచన కవిత లాగా కనిపించే ఛందోబద్ధ పద్యాన్ని రాయడం కూడా అంతే కష్టం అన్నది ఇక్కడి సూచన. ‘మోర్సింగ్ మీద మాల్కౌన్స్ రాగం’ అనే పుస్తక శీర్షిక కూడా ఇటువంటిదే. ఇదే వ్యాస రచయిత ఒక కవితలో, ‘నాది కాని చెరువు అంటే వైద్య రంగం (medical field). నలభైయ్యేళ్లు అంటే తను ఆ రంగంలో ఉన్న కాలవ్యవధి, సుమారుగా.
ఆధునిక తెలుగు కవులు కొందరు ఈ అన్యాపదేశాన్ని ప్రభావవంతంగా ఉపయోగిస్తున్నారు. శ్రీసుధ మోదుగు కవిత్వమంతా అన్యాపదేశంతో నిండి ఉంటుందని చెప్పవచ్చు. ఆ కారణంగా అది అందరికీ (సులభంగా, సంపూర్ణంగా) అర్థం కాదు. సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్, ‘నిజం’ శ్రీరామమూర్తి, శేషభట్టర్ రఘు మొదలైన మరికొందరు కూడా ఈ రకంగా రాసేవారిలో ఉన్నారు.