ఆయన పద్య కవితాధారతో అందరినీ మురిపిస్తారు. మృదు మధురమైన ప్రసంగాలతో మైమరిపిస్తారు. అవధానంతో సభాసదులందరినీ అలరిస్తారు. కమ్మని కవితా కాంతులతో ప్రకాశిస్తారు. మాటల పాటల మాంత్రికుడై పరవశింపజేస్తారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ విద్వత్కవి, అవధాన యువకేసరి డాక్టర్ అందె వేంకటరాజం. కవిగా, అష్టావధానిగా సుపరిచితులైన ఆయన జగిత్యాల జిల్లా కోరుట్లలో భూదేవి-లింబయ్య దంపతులకు 1933 అక్టోబర్ 14న జన్మించారు.
జగిత్యాలలో పాఠశాల విద్యనభ్యసించిన వేంకటరాజం కాకతీయ యూనివర్సిటీలో బీవోఎల్,ఎంఏ చదువుకున్నారు. ‘వానమామలై వరదాచార్యుల కృతులు-అనుశీలనం’ అనే అంశంపై పరిశోధన చేసి కేయూ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఆయన చదివింది ఉర్దూ మీడియం అయినప్పటికీ, తెలుగు భాషపై ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా తెలుగు పరీక్షలు రాసి డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకుడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రకృతిని గాఢంగా పరిశీలించే మనస్తత్వం ఉన్న వేంకటరాజం చిన్నప్పటి నుంచే కవిత్వం రాయడం ప్రారంభించారు. ఈయన అచ్చమైన సంప్రదాయవాది. మృదుమధురమైన పద్య రచన చేయడంలో అందె వేసిన చేయి. అంతేకాకుండా గేయ రచనలోనూ చేయి తిరిగినవారు. వ్యాసాలు, కథలు, నాటికలు, నాటకాలు రాశారు. విశేషించి సుప్రసిద్ధ కవి, అభినవ పోతన డాక్టర్ వానమామలై వరదాచార్యులకు ఆంతరంగిక శిష్యుడు. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ, దాశరథి, దివాకర్ల వేంకటవధాని, డాక్టర్ సి.నారాయణరెడ్డి లాంటి మహాకవుల ప్రశంసలు పొందారు. ముఖ్యంగా డాక్టర్ సి.నారాయణరెడ్డి ఈయనతో కొన్ని గంటల తరబడి సాహిత్య చర్చలు చేసేవారంటే, ఈయన పాండిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.‘భారతీయ సాహిత్య సమితి’ అనే సాహితీ సంస్థను నెలకొల్పి ఎన్నెన్నో వినూత్నమైన సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు.
నవోదయం, మణి మంజూ, మాసవీణ, నింబగిరి నరసింహ శతకం, ఈశ్వర శతకం, మాధవ శర్మ, భువన విజయం, సాహితీ జీవన తరంగాలు, విచిత్ర గాథలు, స్వర్ణ భారతం, భారత రాణి, కళా తపస్విని మొదలైన 25 పుస్తకాలను వేంకటరాజం రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ పిలుపునందుకొని వానమామలై వరదాచార్యులపై లఘు గ్రంథాన్ని కూడా రాశారు. నవోదయం కావ్యంలోని ‘సెలయేరు’ అనే కవిత అప్పట్లో మైసూరు విశ్వవిద్యాలయం విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారంటే ఆయన ప్రతిభా సంపత్తి గురించి వేరే చెప్పవలసిన పనిలేదు.
వేంకటరాజం చక్కని కావ్యాలు రాయడమే కాదు, అవలీలగా, అద్భుతంగా అష్టావధానాలు కూడా చేశారు. అష్టావధానం చేయడంలో ఈయనది ప్రత్యేకమైన శైలి. పృచ్ఛకులు ఎంత కష్టమైన ప్రశ్నలు వేసినా అత్యంత సులభంగా, అతివేగంగా, పండితులనే కాక సామాన్య శ్రోతల్ని కూడా అలరించే రీతిలో అవధానం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీరు చేసే అవధానాల్లో జీవీ సుబ్రహ్మణ్యం, తిరుమల శ్రీనివాసాచార్య, ఇరివెంటి కృష్ణమూర్తి లాంటి మహానుభావులు పృచ్ఛకులుగా పాల్గొనేవారు. తెలుగు రాష్ర్టాల్లోనే కాక మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో కూడా అవధానాలు నిర్వహించి ‘అవధాన యువకేసరి’ బిరుదును కూడా పొందారు. మొత్తం ఎనభై ఎనిమిది అవధానాలు చేసి అవధాన సరస్వతిని అభిషేకించారు.
వేంకటరాజం కవిత్వంలోనే కాదు,గృహవాస్తు, జ్యోతిష శాస్ర్తాల్లో కూడాచక్కని పరిజ్ఞానం కలిగినవారు. వీరు రాసిన నింబగిరి నరసింహ శతకంలోని పద్యాలు ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. వీరి షష్టిపూర్తి రోజున మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి
ఆయన చేతికి స్వర్ణకంకణాన్నిఅలంకరించడం విశేషం.
గంభీరమైన ప్రౌఢత్వంతో విరాజిల్లే వేంకటరాజం పద్యాలు, లలితమైన శబ్ద సౌందర్యంతో ప్రకాశించే ఆయన కవితలు చాలామంది అభిమానుల నాల్కలపై నాట్యామాడుతుంటాయి. మధురకవి, కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన పంచానన వంటి బిరుదులు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం, హైదరాబాద్, బొంబాయి, పునా వంటి ప్రాంతాల్లో అనేక గౌరవ సత్కారాలు, పురస్కారాలు అందుకున్న అందె వేంకటరాజం 2006 సెప్టెంబర్ 11న పరమపదించడం సాహితీ లోకానికి తీరని లోటు.
– తిరునగిరి శ్రీనివాస స్వామి
94403 69939