ఆధునిక తెలుగు సాహిత్యంలో హృద్యమైన పద్యాలతో, మధురమైన గేయాలతో తన విశిష్ట ముద్రను పదిలపరచుకున్న కవి వేముగంటి నరసింహాచార్యులు. సంస్కృతాంధ్ర భాషాకోవిదులైన వేముగంటి కవిత మనోహరమైనది. మహా మహాకవి పండితుల ప్రశంసలందుకున్నది. సంప్రదాయబద్ధమైన కవిత్వంతో పాటు ఆధునిక కవిత్వరీతియైన
వచనకవిత్వంలో కూడా విశేషమైన కృషి చేసిన వేముగంటి 1930 జూన్ 30న మెదక్ జిల్లా సిద్దిపేటలో రామక్క, రంగాచార్యులు దంపతులకు జన్మించాడు. చిన్ననాటి నుండే వ్యాకరణం, తర్కశాస్ర్తాల పట్ల అభినివేశం ఉన్నవాడు. ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలను ఔపోసన పట్టినవాడు. ఆధునిక తెలుగు కవుల వరుసలో చూస్తే చిక్కనైన ధారతో, లలితమైన పదాల పోహళింపుతో, మనోజ్ఞమైన కల్పనలతో ప్రౌఢమైన రచనలు చేయగల కవి.
పద్యం రాయడంలో వేముగంటి శైలి ప్రత్యేకమైనది. శిల్పంలో, అభివ్యక్తీకరణలో, రసాస్వాదనలో ఆయన చూపిన నేర్పు అనిర్వచనీయం. ఏది రాసినా వేముగంటి ముద్ర విశిష్టమైనది. వేముగంటి మొదట ఎక్కువగా పద్యకృతులే రాశాడు. ఆ తరువాత అద్భుతమైన రీతిలో శ్రవణపేయంగా, సుమధురభరితంగా గేయాలు, గేయకావ్యాలూ రాశాడు. ఆ తరువాత వచనకవితలూ రాశాడు. ప్రాచీన సంప్రదాయాన్ని సంస్కారంగా స్వీకరించిన వేముగంటి ఆధునిక సంప్రదాయ కవితారీతుల్ని కూడా స్వీకరించి, అన్ని ప్రక్రియల్లో విశేషమైన రచనలు చేసిన విద్వత్కవి.
‘కాంతివైజయంతి’, ‘కవితాంజలి, ’భావతరంగిణి’, ‘అక్షరదీపాలు’, ‘మణికింకిణి’, ‘ప్రియదర్శి’, ‘వివేకవిజయం’, ‘అమృతవర్షిణి’, ‘నవమాలిక’,‘వీరపూజ’, ‘కవితాసిందూరం’, ‘అన్నమయ్య కవితావైభవం’, ‘ఆంధ్రవిష్ణువు’ మొదలైన 40కి పైగా గ్రంథాలు రాశాడు. ఆయన రచనలన్నీ ఒక ఎత్తు. ‘తిక్కన’ పద్యకావ్యం ఒక ఎత్తు. వేముగంటికి విశిష్టమైన కీర్తి ప్రతిష్ఠలను సంపాదించిపెట్టిన గ్రంథమిది. ఈ గ్రంథంలో తిక్కన మహాకవీంద్రుని జీవితాన్ని గురించి, అతడికి గల రాజనీతిజ్ఞతను గురించి, తిక్కన కవితామాధుర్యాన్ని గురించి వివరిస్తూ మహోన్నతంగా కావ్యాన్ని మలిచాడు. ప్రముఖ శాసన పరిశోధకుడు, చారిత్రకవేత్త బీ ఎన్ శాస్త్రి సహకారంతో ఈ గ్రంథాన్ని ప్రచురించాడు వేముగంటి. ఆ తరహాలోనే ప్రసిద్ధ వాగ్గేయకారుడు భక్తరామదాసు జీవితాన్ని, వాగ్గేయ వైభవాన్ని వివరిస్తూ ‘భక్త రామదాసు’ అనే పద్యకావ్యం రాశాడు.
వేముగంటి రాసిన ‘మంజీరనాదాలు’ గేయకావ్యం మాత్రాఛందస్సుపై ఆయనకున్న అధికారాన్ని నిరూపిస్తున్నది. మంజీరానదిని స్త్రీగా వర్ణిస్తూ కమనీయంగా, ఎంతో రమణీయంగా ఈ కావ్యాన్ని పలికించాడు. కావ్యం ఎత్తుగడలోనే వినూత్నగతిలో ఆయన కలం ఖండగతిలో ఉరకలెత్తుతుంది ఇలా…‘వాకగా, కార్తికిక/ రాకగా, కవిభావ
టీకగా, తెలిపట్టు/ కోకగా, వీకగా వచ్చినది మంజీర/ తెచ్చినది మధుధార’
అంటూ మంజీరాగతులను 20 ఖండికల్లో పరమాద్భుతంగా చిత్రించాడు. ఖండ, చతురస్ర గతుల్లో సాగిన ఈ గేయకావ్యంలో వేముగంటికున్న సంస్కృత పదప్రౌఢి అమోఘమని, భావం, శబ్దం, నాదం, ఔచిత్యం చతుర్ముఖంగా రూపు దిద్దుకున్న ఈ గేయకావ్యం ఉత్తమజాతికి చెందిన కృతియని ఈ కావ్యానికి ‘నాదామోదం’ పేరిట పీఠిక రాస్తూ మహాకవి డాక్టర్ సీ నారాయణరెడ్డి ప్రశంసించారు.
వేముగంటి పిల్లలకోసం ‘బాలగేయాలు’, ‘తెలుగుబాలనీతి’ వంటి గ్రంథాలు కూడా రాశాడు. ఇందులో పిల్లలనుద్దేశించి రాసిన పాటలు, నీతికథలు సరళమైన రీతిలో ఉన్నాయి.
‘కడలి నా పిడికిలి రత్నాలు సృష్టించాలి హలం నా బలం బంగారం పండించాలి’.
పై పంక్తులు వేముగంటి రాసిన ‘కవితాసిందూరం’ వచనకవితా సంపుటిలోనివి. ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది కవిగా వేముగంటి ఆశయమేమిటో. అతని కవితాశక్తి ఏమిటో.. అందుకే ఈ కవితా సంపుటికి ముందుమాట రాస్తూ ‘వేముగంటి పేరులోనే వేము ఆయన కలం కంటిలో తీపి’ అని ప్రశంసించాడు మహాకవి దాశరథి.
1960లో సిద్దిపేటలో సాహితీ వికాసమండలిని స్థాపిం చి, ఎందరెందరో మహాకవులను, విద్యావేత్తలను అతిథులుగా ఆహ్వానించి, ఎన్నో కవిసమ్మేళనాలు, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాడు. యువకవులను ప్రోత్సహించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యునిగా, అధికార భాషా సంఘ సభ్యునిగా ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి, వందలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేశాడు. ఎందరినో కవులుగా, పండితులుగా తీర్చిదిద్దిన మహితోత్తముడు వేముగంటి.
అతని సాహిత్య కృషికి ఫలితంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కనకాభిషేకం, సాహితీ స్వర్ణోత్సవం మొదలైన సత్కారాలను పొందా డు. కవిసామ్రాట్ విశ్వనాథ వంటి మహాకవులు వేముగంటి కవిత విని భళా! అన్నారు. ఆయన కవితలు హిందీ, గుజరాతీలో కూడా అనువాదమయ్యాయి. అతని జీవితం, సాహిత్యంపై పీహెచ్డీ, ఎంఫిల్ పరిశోధనలూ జరిగాయి. అతని కావ్యాలను అనేక విశ్వవిద్యాలయాలు పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించాయి. తెలుగు సాహితీక్షేత్రంలో అక్షరసిరులను పండించిన మహాకవి వేముగంటి నరసింహాచార్యులు 2005 అక్టోబర్ 29న పరమపదించినా, తన కవితాకాంతులతో చిరంజీవిగా వెలుగుతూనే ఉంటాడు.
-తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939