ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా ఒకే వైపు పయనిస్తూ జాతిపరంగాను, భాషా పరంగాను, సంస్కృతిపరంగాను ఒకే లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నది. ఫలితంగా దీని ప్రభావం విభిన్న బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న ఆదిమ జాతులు, తెగల జీవితాలపై కూడా పడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సౌకర్యాలు, మారుమూల ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన విద్య, పట్టణ ప్రజలతో సంబంధాలు ఏర్పడటంతో తమ పురాతన సంస్కృతి, సంప్రదాయాలు జీవన లక్షణాలు గిరిజనులు కోల్పోతున్నారా? అని ప్రశ్న వేసుకుంటే అవుననే చెప్పాలి!
కథా సాహిత్యంలో గిరిజన సాహిత్యం కాంట్రిబ్యూషన్ తక్కువనే చెప్పాలి. ఇటీవల జీవన్ సంపాదకత్వంలో వచ్చిన ‘ఇప్పపూలు’ (పరివర్తిత ముద్రణ), డాక్టర్ సూర్యాధనంజయ్, రమేష్ కార్తీక్ నాయక్ సంపాదకత్వంలో వచ్చిన ‘కేసులా’ కథా సంకలనాలు గిరిజన-సంచార తెగల జీవన విధానం, ఆర్థిక స్థితిగతులు, సామాజిక సంబంధాలు, సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుకుతెస్తాయి.
గిరిజన తెగలవారు గిరిజనేతరులతో సంబంధాలు ఏర్పర్చుకోవడం వల్ల వారి సంస్కృతులను వారే మరిచిపోవడం జరుగుతున్నది. కొండలు, అడవి ప్రాంతాల్లో ఏకాంతంగా జీవనం సాగించే సంచార తెగలు మైదాన ప్రాంతాల్లోకి, పట్టణాలకు జీవనోపాధి కోసం వలస రావడం ఒక కారణం కాగా, ఇప్పటితరం చదువుల కోసం, ఉద్యోగాల కోసం రావడం ఇతర భాషల సంపర్కంతో వారి గిరిజన భాషలను మర్చిపోయే స్థితికి రావడంతో గిరిజన భాషలు కూడా మరుగున పడిపోతున్నాయని చెప్పవచ్చు.
కోయ తెగకు చెందిన పద్దం అనసూయ కథ ‘మూగబోయిన శబ్దం’, పి.విద్యాసాగర్ గొత్తికోయల కథ ‘దాడి’, సవర తెగకు చెందిన మల్లిపురం జగదీశ్ కథ ‘దారి’, అలాగే చెంచుల జీవితాలను, ఇతర ఆదివాసీ తెగల జీవనశైలులను కథాసాహిత్యంలో ప్రతిబింబించినా వారి భాషను కథల్లో వాడలేదు. కొన్ని కథలకు బహుశా ఆ తెగల జీవన పరిస్థితులు, సంస్కృతీ, అలవాట్లపై అవగాహన ఉండి కథకులు గిరిజనేతరులు కావడం, భాష తెలియకపోవడం ఒక కారణం కావచ్చు. మరో కారణం, గిరిజన భాషలు పాఠకులకు అర్థం గాక కథలో పఠనవేగం, అభిముఖ్యత తగ్గి ధ్యాస మళ్లిపోవచ్చన్న సందేహం ఉండొచ్చు.
మిగతా ఆదివాసీ గిరిజన వర్గాలకన్నా గోర్ బంజారాలు గ్రామీణ, పట్టణ ప్రజలకు దగ్గరై ఎలాంటి సమస్యలు లేకుండా వారి సంస్కృతితో తమ సంస్కృతిని సమన్వయం చేసుకోగలుగుతున్నారు. చదువుల్లో, ఉద్యోగాల్లో ముందుండి సంప్రదాయపరమైన వస్త్రధారణ, ఆభరణాల విషయంలో ఆధునితను ఆహ్వానించగలిగారు. కథా రచనలు చేస్తూ వారి భాషను కథల్లో ప్రయోగిస్తూ వాటికి తెలుగు భాషలో అనువాదాలు ఇస్తూ పాఠకులకు అర్థమయ్యేరీతిలో కథను నడిపించగలిగే సహజత్వాన్ని అందిస్తున్నారు.
గిరిజన తెగలకు చెందిన కథలు అడపాదడపా కొన్నిచోట్ల దర్శనమిచ్చినా ఈ మధ్య కాలంలో జీవన్ సంపాదకత్వంలో వచ్చిన ఇప్పపూలు, ఆచార్య సూర్యాధనంజయ్, రమేష్ కార్తీక్ నాయక్ సంపాదకత్వంలో వచ్చిన కేసులా కథా సంకలనాలు ప్రత్యేకంగా గిరిజన జీవితాలకు సంబందించినవి కావడం తెలంగాణ కథాసాహిత్యంలో ఒక ముందడుగు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రస్తావించిన కథల్లో కూడా చాలావరకు బంజారాల భాషనే వాడారు కథకులు. ఒక కథలో గోండుల భాష వాడినా ఇంకా కోయ, సవర, జాతావు లాంటి తెగల భాషలు కథల్లో కనబడలేదు. మున్ముందు ఆ తెగల మూలాలున్న రచయితలు రాయాలని ఆశిద్దాం.
‘ఢావ్లో’ కథ రమేష్ కార్తీక్ నాయక్ రాసింది. ‘ఢావ్లో’ అంటే విషాద గీతం. దుఃఖం, జీవన తాత్వికత నర్మగర్భంగా ఈ ఏడుపు పాటల్లో వ్యక్తమవుతాయి. ఈ కథ చదువుతున్నంతసేపు మనం కూడా బంజారాలమై పోయామా? తండాలో తిరుగుతున్నామా? అన్న భావనకు లోనవుతాం. భాష ఒక్కటే కాదు, దుఃఖం వెనుకాల ఉన్న బంజారాల జీవన సౌందర్యం, తాత్వికత, అనుబంధాల మధ్య ఉన్న ప్రేమ అన్నీ అభివ్యక్తమవుతాయి.
ఉమ్మడి ఏపీని తీసుకుంటే గిరిజన సంచార తెగల సంఖ్య అధికంగానే ఉన్నది. తెలంగాణలో కోయ, సవర, గోండులున్నా గోర్ బంజారాలు అధిక శాతంలో ఉన్నారు. ఈ బంజారా తెగకు చెందినవారు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కలిగి విద్య, ఉద్యోగ రంగాల్లో ఇతర సంచార తెగల వారికన్నా ముందున్నారు. గిరిజన, సంచార తెగలు అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్మడం, పోడు వ్యవసాయం చేయడం వీరి ప్రధాన జీవనాధారాలు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల చేతిలో దోపిడీకి గురికావడం, ఫారెస్ట్ అధికారుల అవినీతి కారణంగా ఎదుర్కొనే సమస్యలు, పోలీసుల దాడులు ఇలా అనేకరకాల సమస్యల చిక్కుముడుల్లో ఇరుక్కున్న వీరి జీవితాలు ఇంకా సంఘర్షణల వలయంలోనే ఉండిపోయినవి. అటవీ ప్రాంతాల్లోని భూముల సంరక్షణార్థం గిరిజనేతరులు భూమిని కొనకూడదని ప్రభుత్వం 1/70 చట్టం తెచ్చినా లాభం లేకుండాపోయింది.
గిరిజనాభివృద్ధి సంస్థలు, గిరిజన కార్పొరేషన్లు, గిరిజన సంక్షేమ పథకాలు వారికి ఎంత వరకు అందుబాటులోకి వస్తున్నాయో? ఇలా అనేక సమస్యలను స్పర్శిస్తూ మనసును కలచివేసే సంఘటనలను, పరిణామాలను కథకులు తమ కథల ద్వారా ఎరుకజేశారు.
ఈ కథల్లో రెండు విషయాలను స్పష్టంగా గమనించవచ్చు. ఒకటి, గిరిజనులకు చదువు లేకపోవడం, మూఢాచారాలను నమ్మడం ఇంకా పాత ఆచారాలను పాటిస్తూ ఆటవిక సమాజపు కట్టుబాట్లకు పరిమితం కావడం వల్ల వారి జీవనశైలిలో ఎదుగుదల లేదనే భావన, మరోవైపు చదువుకొని ఉద్యోగాలు చేసుకునేవారు వారి భాషను, వస్త్రధారణను, ఆచార వ్యవహారాలకు దూరంగా ఉండటం. ఈ వైరుధ్యాలు వారి జీవితాల్లో అనివార్యమవుతాయి. నగరీకరణ, నాగరీకరణ చెందాలంటే వారి భాషా సంస్కృతులకు దూరం కావలసిన పరిస్థితులు తప్పనిసరిగా ఏర్పడుతాయి. చదువు, ఉద్యోగాలు కావాలంటే వారు మాట్లాడే భాషకు దూరంగా ఉండక తప్పడం లేదు. అన్ని సందర్భాల్లో ఆచారాలు, ఆధునికత కలిసి సాగడం సాధ్యపడదన్నది వాస్తవం.
హట్టన్, బీఎస్ గుహ, వెరియర్ ఎల్విన్, డీఎన్ మజుందార్ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు గిరిజనుల భాషా సంస్కృతులపైన విశేష కృషి చేశారు. గ్రామీణ, పట్టణ ప్రజలకు, గిరిజన తెగలకు మధ్య సంస్కృతిలో ఉన్న భేదాలననుసరించి తెగల వర్గీకరణ చేశారు. 1950 దశకంలో వెరియర్ ఎల్విన్ సంస్కృతీ పరంగా గిరిజన తెగలను 4 విధాలుగా వర్గీకరించగా, మజుందార్ వర్గీకరణ గిరిజనుల జీవన సంక్షోభాలను తెలియజేసినా వారి పునరావాస కార్యక్రమాలకు ఆమోదయోగ్యం కాదని సంస్కృతీ ప్రాతిపదికగానే మూడు విధాలుగా వర్గీకరించారు. మజుందార్ వర్గీకరణలో గిరిజనులకు, గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య ఆరోగ్యకరమైన, సృజనాత్మకమైన సంబంధాలు ఉండాలన్నది ప్రధానోద్దేశం.
ఈ చారిత్రిక ఉద్యమ పోరాటాలు భారతీయ కథా సాహిత్యంలో, నవలా సాహిత్యంలో కొంతవరకు వచ్చినా ఇంకా రావలసి ఉన్నది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆధిపత్య పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు చేసిన పోరాటాలు కొంతవరకు చరిత్రకెక్కినా ఇంకా అనేక సంఘటనలు, సందర్భాల చిత్రీకరణతో గిరిజన కథాసాహిత్యాన్ని సంపన్నం చేయవలసిన అవసరం ఉన్నది.
– డాక్టర్ రూప్‌కుమార్ డబ్బీకార్ 91778 57389