నేడు మహాశ్వేతాదేవి జయంతి
ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్న గిరిజన జాతుల పోరాటమైనా, ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో జరిగిన గిరిజనుల అంతర్గత రిజర్వేషన్ పోరాటమైనా, ఇంద్రవెల్లి, వాకపల్లి వంటి ఘటనలైనా.. అవి కొంతకాలం తర్వాత పరిష్కారం దొరకని యధార్థ కథలుగా మిగిలిపోవడం షరా మామూలే! వాటిని వివరించే రచయితలకు అవి కథావస్తువులుగా మారుతున్నాయి. తప్ప వారి జీవితాలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రం లభించడం లేదు. ‘అడవిని చూడండి. జలజల పారే సెలయేళ్లు, మెరిసే ఎండ, చెంగుచెంగున గంతేసే కృష్ణ జింకలను చూడండి. సెలయేళ్లు, వాగులు, వంకలు, చెలిమల దగ్గర పల్లెతల్లులు పిల్లల్ని చంకనేసుకుని కుండల్లో నీరు పట్టుకోవడం, సూర్యుడు వంగి భూమిని చూస్తుండటం వంటి దృశ్యాలు ఇంపుగా ఉంటాయి. రైతులు పొలాలు దున్నుతున్నప్పుడు అడవులే కాదు, కొండలు, గుట్టలు కూడా పచ్చదనంతో నవనవలాడుతున్నా బాగానే ఉంటాయి.
కానీ ఆ చిత్రాల వెనుక ఉండే కష్టాలు, కన్నీళ్లు మారవు. ఏమీ జరగదు! ఏమీ కాదు !! నువ్వు కలగననంతవరకు, కలగనడం ఎలాగో నీకు తెలియనంత వరకు అక్కడ ఏమీ జరగదు. అయితే రాజకీయ, పరిపాలన వ్యవస్థలు రిమోట్ కంట్రోల్‌తో నీతో కలలు కనిపించే నీ మెదడు జీవకణాల్ని నాశనం చేస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కలలు తప్పించుకుని బయట పడతాయి. అట్లా తప్పించుకుని బయటపడ్డ కలల వెంట నేనెప్పుడూ పరుగెడుతుంటాను. ఈ మానవాళి సజీవంగా కొనసాగాలంటే కలలు గనే హక్కు తప్పకుండా ఉండాలి. కానీ పరిపాలన వ్యవస్థ కలలుగనే హక్కునే కూలగొడుతుంటే ఏమవుతుంది? వ్యక్తులు కూలిపోతారు. మొత్తంగా ప్రపంచమే కూలిపోతుంది. కలలు కనడమన్నది మనందరి సహజ హక్కు. దీన్ని మనం కాపాడుకోవాలి’ అని ఎల్లవేళలా చెప్తుండేవారు సాహితీవేత్త మహాశ్వేతాదేవి. 1926, జనవరి 14న ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో, మనీష్ ఘటక్, ధరిత్రీదేవి దంపతులకు ఆమె జన్మించారు.
‘బహుశా 1980 నుంచి నేను సామాజిక పోరాటాన్ని ఉధృతం చేశాను. గొంతు విప్పాను. ఆదివాసీలు, గిరిజనులు, భూమిలేని గ్రామీణ పేదప్రజలు, కూలీలు, నగరాల్లో ఫుట్‌పాత్ జీవుల సమస్యలపై వారి పక్షాన నా దినచర్యగా ప్రతిస్పందించాను. భారతదేశంలో స్వాతంత్య్రం ఎన్ని తప్పిదాలతో, ఎన్ని తప్పు నడకలతో ముందుకు వచ్చిందో విప్పి చెప్పగలిగాను. దేశంలో ప్రతి భాషలో ఇంకా పుస్తకాలు రావాలి. ముద్రితమవ్వాలి. అణగారిన ప్రజల జీవిత కథలు ప్రవహించాలి. ప్రతి ఒక్కరి చేతి వేళ్లు అక్షరాల కోసం అంగలార్చాలి. మూగబోయిన గొంతు విప్పాలి. గతంలోనైనా, ఇప్పుడైనా, భవిష్వత్తులోనైనా మనమంతా కలలు గనేది మానవీయ విలువల కోసమే’ అంటూ 2006 అక్టోబర్ 21న మహాశ్వేతాదేవి జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవ ప్రసంగంలో చెప్పారు. అంతిమంగా – కలలకు స్వాతంత్య్రం కావాలి. రచయితల కలాలకు స్వేచ్ఛ కావాలి అని నిరంతరం చెప్తుండేవారు మహాశ్వేత.
మహాశ్వేతా దేవి రచనలు 90 శాతం గిరిజనుల జీవిత సంక్షోభాన్ని ఆవిష్కరించేవే. 1979లో సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ఆమె చారిత్రక, కాల్పనిక రచన అరణ్యేర్ అధికార్ (ఎవరిదీ అడవి?) 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనపై జరిగిన ఆదివాసీ ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గిరిజన నేత బిర్సాముండా జీవితాన్ని, పోరాటాన్ని వెల్లడించే రచన అది. 1899 -1900 మధ్యకాలంలో చోటానాగపూర్, రాంచీ ప్రాంతంలో జరిగిన గిరిజనోద్యమం (ఉల్గులాన్) ఆధారంగా రాసిన నవల ఎవరిదీ అడవి?. గిరిజనోద్యమమో, మరో ఘటనో జరిగిన ప్రదేశానికి వెళ్లకుండా రచనలు చేసినవారిలా కాకుండా, సంఘటన స్థలానికి వెళ్లి, ఆ మట్టితో మాట్లాడి, ఆ గాలిలో తిరగాడటమే మహాశ్వేతకు తెలిసిన అద్భుతమైన విద్య. భారతీయ గిరిజనోద్యమాల ఆత్మఘోష మొత్తం ’ఎవరిదీ అడవి?’ నవల ద్వారా అవగతమవుతుంది.
మహాశ్వేత ఒక్కొక్క కథ గిరిజన జీవితంలోని ఒక విషాద పరిణామాన్ని వివరిస్తుంది. వ్యభిచార కూపాలలోకి బలవంతంగా కూరుకుపోతున్న వంగ ప్రాంత అటవీ బాలిక విషాద కథ ‘శనిచరి’. ఇటుక బట్టీలలో పని పేరుతో తీసుకువెళ్లి ఆ బాలికలతో వ్యభిచారం చేయిస్తూ ఉంటారు దళారులు. అది భరించలేని ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. శనిచరి మాత్రం కడుపున పుట్టిన బిడ్డతో సహా తిరిగి గ్రామంలోకి వచ్చి తనతప్పునకు అపరాధ రుసుము చెల్లిస్తుంది. ఐనా గిరిజన సమాజం ఆదరించదు. రైలు పట్టాల మీద బొగ్గు ముక్కలను ఏరుకుంటూ బతుకీడుస్తున్న దైన్యం. ఆ బొగ్గు ముక్కలే నిప్పురవ్వల్లాంటి ప్రశ్నలను సంధిస్తాయి. ’జీవిత ఖైదీ’ కథలో మకర సవరలు అల్లకల్లోలమైన గిరిజన జీవితం కనిపిస్తుంది. ఇది సవర తెగలో పుట్టిన ‘మకర’ అనే గిరిజనుడి వైవాహిక సంఘర్షణ. పెళ్ళయిన చాలా కాలానికి కూడా అతని భార్యకు గర్భం కాకపోవడంతో ఆమే స్వయంగా విడాకులు కోరుకుంటుంది. నిస్పంతువుగా ఉండటం ఆ తెగలో నిషిద్ధం. గ్రామపెద్దలకు హఠాత్తుగా తెలుస్తుంది అసలు సంగతి. అతనికి పిల్లలు పుట్టకుండా , రహస్యంగా శస్త్రచికిత్స చేశారని! గిరిజన సాంప్రదాయాన్ని 1975 నాటి అత్యవసర పరిస్థితులలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఎలా సంక్షుభితం చేశాయో వర్ణించే కథ ఇది.
1997లో విశాఖపట్నం వచ్చిన మహాశ్వేత మన్యంలో గొప్ప మన్యసీమ ఉద్యమం నడిపిన అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా ఆయన శతజయంతి (1997) సందర్భంలో నవల రాస్తానని చెప్పారు. అలాగే విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ’మూల వలస’ సందర్శించి మన్యం వీరునిపై నవల రాస్తానని ప్రమాణం చేశారు. ఆమె తెలంగాణ ఆదివాసీ గిరిజన పోరాటాలపై విస్తృత సమాచారం సేకరించారు. నైజాం రజాకార్లపై తిరగబడ్డ ఘనచరిత్ర గల కుమ్రంభీం వంటి ఆదివాసీ పోరాట యోధుని గురించి ఆమె ఆరా తీశారు. అల్లూరి నవలా ప్రయత్నం నెరవేరితే తెలుగు ప్రాంతాల గిరిజనోద్యమాలపై మరింత వెలుగు ప్రసరించేది. 2007, ఆగష్టు 20 న జరిగిన వాకపల్లి దుర్ఘటనను అమానవీయ చర్యగా మహశ్వేత చెప్పారు. అణగారిన వర్గాల గొంతుకగా తన కథా రచనలతో కేంద్ర సాహిత్య అకాడమీ(1979), జ్ఞానపీఠ్ (1996), రామన్ మెగసెసె (1997), పద్మభూషణ్ (2006) పురస్కారాలు అందుకున్న మహాశ్వేత 2016 జూలై 28న కోల్‌కతాలో కన్నుమూశారు. అటవీ సంరక్షణ, ఆదిమ జాతుల వారు రక్షితులుగా రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకునేలా నేటి పాలకులు కొంతైనా చేయగలిగితే అదే మహాశ్వేతకు నిజమైన నివాళి!
వ్యాసకర్త: ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి
గుమ్మడి లక్ష్మీనారాయణ
94913 18409