నేడు ఎండ్లూరి జయంతి
‘ఒక మృదువైన కలం
ఒక పదునైన భావం
ఒక సున్నితమైన హృదయం
ఒక బలమైన భావజాలం
అరమరికలు లేని ప్రేమ స్వరూపం
బుధులు మెచ్చే పాండిత్యం
సుధలు కురిసే సాహిత్య జలపాతం
ఒక అమృతభాండం’
అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రశంసించిన ప్రముఖ కవి, అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్. ఆయన కవిత్వం చదువుతుంటే జాషువా గుర్తొస్తారు. ఆయన వందలాది మంది కవులకు స్ఫూర్తిప్రదాత. నాలుగు దశాబ్దాలపాటు దళిత సాంస్కృతిక విప్లవానికి సారథిగా నడిపించారు. తెలుగు దళిత సాహిత్యంలో ఎండ్లూరి సుధాకర్‌ది విశిష్ట స్వరం. ఆయన కవితా విన్యాసం అందరినీ ఆకర్షించింది.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21,1959న నిజామాబాద్‌లోని పాములబస్తీలో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయిలకు ప్రథమ సంతానం. వీధి బడిలో ప్రారంభమైన ఆయన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్‌లోనే సాగింది. 1985 నుంచి 1990 వరకు తెలుగు పండిట్‌గా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2011 వరకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించే ’వాఙ్మయి’ సాహిత్య పత్రికకు సహాయ సంపాదకుడిగా, సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ, తెలుగు వర్సిటీ కౌన్సిల్, తెలుగు సలహా మండలి, తెలుగు అకాడమీలలో సభ్యులుగా ఉన్నారు. ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడిగా సేవలందించారు. జాషువా జయంతి, వర్ధంతులను ఉద్యమంలా సాగించారు.
‘వర్తమానం’, ‘నల్లద్రాక్ష పందిరి’, ‘పుష్కర కవితలు’, ‘ఆటా జనికాంచె..’ వంటి కవితాసంపుటులు, ‘కావ్యత్రయం’, ‘కొత్త గబ్బిలం’, ‘గోసంగి’, ‘వర్గీకరణీయం’ వంటి దళిత దీర్ఘ కావ్యాలు, జాషువా ‘నాకథ ’ వంటి ఎంఫిల్ పరిశోధన, జాషువా సాహిత్యం- దృక్పథం – పరిణామం- పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం, ‘నా అక్షరమే నా ఆయుధం’- డా.శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథకు అనువాదం, ‘మల్లె మొగ్గల గొడుగు’ వంటి మాదిగ కథలు రచించారు.
వర్గీకరణీయం, కొత్త గబ్బిలం సంకలనాలు రిజర్వేషన్ల హేతుబద్ధీకరణను బలపరుస్తాయి. మాదిగల సామాజిక సాంస్కృతిక జీవితాన్ని కథలుగా ఆయన చెప్పిన తీరు ప్రత్యేకం. మల్లెమొగ్గల గొడుగు కథాసంకలనం విశిష్టమైనది. అలాంటి కథలు ఆయన తప్ప ఎవరూ రాయలేరు. అమెరికా వెళ్లినప్పుడు అక్కడి విశేషాలను, అనుభవాలను ‘ఆటా జనికాంచె’ కవితా సంకలనంలో వ్యక్తం చేశారు. దేశంలో జరిగే అనేక దుర్మార్గాలను ఆయన ఎప్పటికప్పుడు తన కవితల ద్వారా నిరసించారు.
హిందీ, ఉర్దూ భాషల్లో గల పట్టుతో గజల్, రుబాయీలను తెలుగులోకి అనువదించారు.
‘సదా నా హృదయం నిన్నే స్మరిస్తోంది నీ జ్ఞాపకాల దీపంతో చీకట్లో చరిస్తోందితొలినాటి తీపి వలపు తొలగిపోదు నేస్తమా!
నిన్ను తలచుకున్నపుడల్లా నా జన్మ తరిస్తోంది’ అని అన్న కవి సుధాకరే అగ్నినీ కురిపించే కవిత్వాన్ని రాశారు.
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురికి ఎటువంటి సంబంధంకోరుకుంటారో సాహిత్య పాత్రలతో వర్ణించారు.‘ప్రవరాఖ్యుడు కాకపోయినాఫరవాలేదనిపించాలికుబేరుడు కాకపోయినా నగలను కుదువబెట్టనివాడు కావాలి సత్యవంతుడు కాకపోయినా నిత్య సంతోషితుడూ, మా అమ్మాయికి హితుడు, సన్నిహితుడు కావాలి’(‘వరాన్వేషణ’ పేరిట రాసిన కవితలోని భాగమిది.) తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ 2022 జనవరి 28న తుదిశ్వాస విడిచారు. మరణంతో మనల్నందర్నీ ఆయన విడిచివెళ్లినా ‘నవతరం జాషువా’గా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
సాయి లోహిత పులపా