నిద్రతో శతృత్వం
తేలిక విషయం కాదు..
తెలిసో… తెలియకో…
నీపై నీవే ఓ యుద్ధభేరిని మోగించి ఉంటావు.
నీలో బలం, బలహీనతల మధ్య
ఒంటరిగా కేవలం కలను పుల్లగా పట్టుకొని
ఒట్టి ఊహల బెండుల నడుమ నిలబడి
పారిపోలేక, తప్పించుకోలేక ఒక్కడివే
నిద్రతో కలబడుతూ
రాత్రి కింద నలుగుతూ
మత్తులో మెలిక పడుతూ
చిత్రవధ అనుభవిస్తూ
రోజూ ఓ పగటి కలతో
రాత్రి గుండెల్లో దూరి
నిలబడలేక, నిలువలేక
నీ లోపాన్ని మోయలేనంత
సోమరితనంతో స్నేహం చేసి
చురుకుదనం చెరుపుకొని
మంచం తిట్టుకునేలా
దుప్పటి దుమ్మెత్తిపోసేలా
నీ లోపల ఒక్కడివే కుములుతూ
పగటికి భయపడి
బయటకు సిగ్గుపడి
చీకటిలోనే నిద్రకు వెలికాబడి
మెలకువ తెలియని మెలుకువతో
ఈ యుద్ధం ఎన్నాళ్లు?
శ్రీ సాహితి
97044 37247