కథాసాహితి భారతీయ భాషలకు అంత అపరిచితమైందేం కాదని ఇంతకుముందోసారి అనుకున్న మాటేగా! మన దేశంలో నాలుగైదు వేల సంవత్సరాలుగా కావ్యేతిహాసాలు, మహాకావ్యాలు, కథాకావ్యాలు, అనగనగా కథలూ, పేదరాశి పెద్దమ్మ కథలూ, పుక్కిట పురాణాల్లాంటి సాహిత్య రూపాలు విస్తృతంగా ఉండేవి.
సామాన్య శకానికి పూర్వం 24 వందల సంవత్సరాల కిందట కూడా కథన రూపాలు అస్తిత్వంలో ఉన్నాయంటారు. ఎటొచ్చీ, ఇప్పుడు మనకు తెలిసిన కథానికలు వేరు- ఆనాటి కథనాలు వేరు! సామాన్యశకం తర్వాత సాహిత్య చరిత్రలు అరకొరగానైనా లెక్కతేలిన తర్వాత, తెలుగు కథా కావ్యాకాశంలో, రవ్వల్లా తళుక్కున మెరిసే రచనలూ కొన్ని పుట్టుకొచ్చాయి. తాము తిక్కనకు ప్రత్యక్ష శిష్యులమని చెప్పుకున్న పదమూడో శతాబ్దినాటి మూలఘటిక కేతన, మారన-వారి సమకాలికుడే అయిన మంచన తదితరులు కథాకావ్యాలు రాసిన వారిలో ప్రముఖులు. మరో రెండు శతాబ్దాల నాటివాడైన జక్కన ‘విక్రమార్క చరితం’ కూడా కథాకావ్యమే. ఆ మాటకొస్తే శ్రీనాథుడి ‘శృంగార నైషధం’ మొదలుకుని ప్రబంధాలన్నీ కథాకావ్యాలే! అయితే వాటిల్లో కథకు చిన్నపీట వేసి, కవిత్వకళకే పెద్దపీట వేశారు మనవాళ్లు.
అటు పడమటి ప్రపంచంలోనూ అదే ‘కథ’. పదమూడు, పద్నాలుగు శతాబ్దాల నాటి ‘రాబిన్‌హుడ్’, ‘విలియమ్ టెల్’ కథలూ, పదహారో శతాబ్దినాటి దక్షిణ యూరోపియన్ మట్టివాసనలతో గుబాళించే పికారెస్క్యూ కథలూ, తమిళంలో మళైకళ్ళన్ (కొండ దొంగ) కథలూ, తెలుగులో ‘ఆకాశరామన్న’ కథలూ, హిందీలో ‘సుల్తాన్ డాకూ’ కథలూ అలాంటి తారలే!
ఇక, కాశీమజిలీ కథలు సరేసరే! వాటి గొప్పతనాన్ని గౌరవిస్తూనే ఓ నిష్ఠుర సత్యం చెప్పుకోక తప్పదు. ఆధునిక కథానిక రూపురేఖలు తీర్చిదిద్దడంలో ఈ కథాకావ్యాల పాత్ర దాదాపు శూన్యం. కథానిక వస్తురూపాలూ, శిల్పంలో నగిషీలు మొనతేరడంలో ప్రధానపాత్ర పోషించిన ఇతర ప్రక్రియల విషయానికి వస్తే, నూరేళ్ల కిందట నిర్దిష్ట రూపం తీసుకున్న చిన్నకథ, పెద్దకథ తదితరాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. అయితే ఈ సాహిత్య ప్రక్రియల విషయంలో గందరగోళానికి ముఖ్యకారణం నామకరణలో చోటుచేసుకున్న చిందరవందలే. ఉదాహరణకి, చిన్నకథలుగా ప్రసిద్ధమైన కళాఖండాల్లో ఎక్కువ భాగం కథానికలు కావు-‘వడ్ల గింజలు’, ‘మార్గదర్శి’, ‘బ్రాహ్మణాగ్రహారం’ లాంటివైతే పేరుకు మాత్రమే చిన్నకథలు!
పందొమ్మిదో శతాబ్ది చివర్లో వచ్చిన ‘తెలుగు జనానా’, ‘హిందూ సుందరి’, ఇరవయ్యో శతాబ్ది మొదట్లో వచ్చిన ‘ఆంధ్రభారతి’ లాంటి పత్రికల్లో అచ్చయిన కథానికలు, కథాకావ్యాలు ఈ క్రమాన్ని పైమెట్టుకు చేర్చాయి! 1947కు ముందే, ఇలాంటివి ఇరవయ్యొక్క పత్రికలు ఉండేవని పరిశోధకులు లెక్క తేల్చారు. ఆ పత్రికలూ, వాటిల్లో వచ్చిన రచనలూ కథానిక ప్రక్రియను తీర్చిదిద్దిన వాచకాల్లాంటివి. అలాంటి పత్రికల్లోనే భండారు అచ్చమాంబ కథలు దాదాపు డజను వరకూ, గురజాడ కథానికలు కనీసం రెండు అచ్చయ్యాయి. 1910లోనే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు-క. రామానుజరావు అనే కలం పేరుతో-రాసిన కథానిక ‘ఎద్దుల బేరం’ కూడా అచ్చయింది. ‘ఆంధ్రభారతి’లోనే మాడపాటి హనుమంతరావు రాసిన అనువాద కథానిక ‘హృదయశల్యము’ 1912లో అచ్చయింది.
‘ఆంధ్రుల సాంఘికచరిత్ర’మనే చరిత్రాత్మక చరిత్ర గ్రంథాన్ని రాసిన సురవరం ప్రతాపరెడ్డి ‘మొగలాయీ కథలు’, ‘వింత విడాకులు’ లాంటి కథానికలు రాసిన సంగతి చదువుకున్న వారికి చాలామందికి తెలుసు. హిందూ స్త్రీ పునర్వివాహం విషయంలో-చట్టవిరుద్ధం కాని పద్ధతిలో- కమలమ్మ అనే క్లయింట్‌ను ఓ న్యాయవాది ఎలా చమత్కారంగా గట్టెక్కించాడో చెప్పిన కథానిక ‘వింతవిడాకులు’ స్వయంగా న్యాయవాదయిన ప్రతాపరెడ్డికి చట్టాల అంతరార్థాలకు ఎలా భాష్యం చెప్పాలో బాగా తెలియడంలో వింతేముంది?! 1922లో తాము మొదలుపెట్టిన సాహిత్యపత్రికలో, ఒద్దిరాజు సోదరులు (సీతారామచంద్రరావు, రాఘవరంగారావు) కనీసం మూడు కథానికలు (‘రక్తమూల్యము’, ‘అదృశ్య వ్యక్తి’, ‘నటి’ రాసినట్లు) తెలుస్తోంది. ఎటొచ్చీ, ఈ కథానికలకు అప్పట్లో ఆ ‘పేరు’ వాడుకలో లేదు! మాటలకు అర్థాలు, ధ్వన్యాశ్రయాలు కావు-అవి భావాలను ఆశ్రయించుకుని ఉంటాయంటారు పెద్దలు.
తొలితరం తెలుగు సాహిత్య పత్రికల సంపాదకుల్లో వీరేశలింగం స్ఫూర్తిగా కలంపట్టిన వెంకటశివుడు ఆ కాలంలోనే ఆంగ్లంలో ఎమ్మే చేసి అధ్యాపకుడిగా పనిచేసినవారు. భండారు అచ్చమాంబ కథానికలను తొలిసారి అచ్చువేసి, లోకానికి పరిచయం చేసింది ఆయనే. అచ్చమాంబ తొలి కథలను అచ్చువేసిన మరో పత్రిక ‘హిందూ సుందరి’.
ఈ పత్రిక విశిష్టత ఏమిటంటే, నలభైయ్యేళ్లు నడిచిన ఈ పత్రిక పేరులోనే ఉన్నట్లుగా పాఠకురాళ్లను ఉద్దేశించి రూపొందింది. దానికి ఎడిటర్లు మొసలికంటి రామాబాయమ్మ-వెంపటి శాంతాబాయమ్మ. చరిత్ర మూలమలుపు తిరిగే ముందు పదిసార్లు ఆలోచిస్తుందేమో కానీ, ఆ తర్వాత దానికి జంకుండదు! అందుకే పులుగుర్త లక్ష్మీనరసమాంబ, వింజమూరి వెంకటరత్నమ్మ, కళ్ల్లేపల్లి వెంకటరమణమ్మ తదితర సంపాదకురాళ్లు ఒకరి వెనుక ఒకరుగా పత్రికా రంగంలోకి ప్రవేశించారు.
గృహిణులు అప్పుడప్పుడే కథానికలూ, వ్యాసాలూ చదవటం మొదలుపెట్టిన యువపాఠకుల కోసం ఉద్దేశించిన పత్రికలకు రూపురేఖలు దిద్దిన ఆ తరం రాయసం, కాశీనాథుని, ముట్నూరి, అయ్యంకి, గాడిచర్ల తదితరుల కృషి గురించి పత్రికలకూ-పుస్తకాలకూ ఎక్కి, చరిత్రగా స్థిరపడింది. అయితే, తెలంగాణ ప్రాంతంలో అలాంటి కృషే చేసిన సురవరం, ఒద్దిరాజు, శబ్నవీసు, వట్టికోట, ఆదిరాజు, బుక్కపట్నం, దేవులపల్లి (రామానుజరావు) తదితరుల కృషి ప్రాచుర్యంలోకి రాలేదు.
1910కి ముందు వెలువడిన 92 తెలుగు కథానికలను రాసిన తొలితరం కథానికల రచయితల జాడ తీసి పుణ్యం కట్టుకున్న పరిశోధక రచయిత వి.వి.న.మూర్తి. బుద్ధిరాజు ఈశ్వరప్ప పంతులు లాంటి విశిష్టమైన రచయిత పేరు ‘దిద్దుబాటలు’ వల్లనే వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో తెలుగు సాహిత్య ప్రస్థానం తీరుతెన్నులను ప్రభావితం చేయడంలో ఒద్దిరాజు సోదరులు లాంటివాళ్ల కృషిని గ్రంథస్థం చేసినవాళ్లలో ముఖ్యుడు ‘కవిలె’ సంగిశెట్టి శ్రీనివాస్. ఇకపై, ఈ పరిశోధన పేర్ల తేదీల వేటగా కాకుండా నిలువుకోత విశ్లేషణగా సాగటం ఈనాటి చారిత్రక అవసరం!
-మందలపర్తి కిశోర్ ,81796 91822