పంచమ వేదమైన మహాభారతేతిహాసం 18 పర్వాలు, లక్ష శ్లోకాలతో ప్రపంచంలో అతిపెద్ద కావ్యంగా ప్రసిద్ధి చెందింది. ‘ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ/ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్’ భారతంలో ఏది ఉంటుందో అది ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు. హిందువుల పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామాలు వంటివి మహాభారతంలోని భాగాలు కావడం ఈ కావ్య విశిష్టతను తెలుపుతాయి.
సంస్కృతంలో వ్యాసవిరచితమైన మహాభారతాన్ని కవిత్రయంగా ప్రసిద్ధి పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించారు. కవిత్రయంలో ద్వితీయుడైన తిక్కన కవిత్వంలో అద్వితీయుడు. తిక్కన మహా కవి, కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడిగా ప్రసిద్ధి పొందారు. ఈయన నాటకీయ శైలిలో, సంభాషణాత్మకంగా మహాభారతంలోని విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తెలుగులో రాశారు. తిక్కన రచనా శిల్పం గురించి విశ్వనాథ వారన్నట్టు ‘తిక్కన్న శిల్పంపు దెనుగు తోట’ అనేది అక్షరసత్యంగా విరాజిల్లుతుంది. తిక్కన భారతావతారికలో తన భారత రచన సంకల్పాన్ని తెలియజేస్తూ..
హృదయాహ్లాది చతుర్థ మూర్జిత కథోపేతంబు నానా/ రసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులుంగూడగా/ బదియేనింటి దెనుంగు బాస జన సంప్రార్థ్యంబులై పెంపునం/ దుదిముట్టన్ రచియించుటొప్పు బుధ సంతోషంబు నిండారగన్’.. దీనిలో చెప్పిన హృదయాహ్లాది, ఊర్జిత కథోపేతము, నానారసాభ్యుదయోల్లాసి.. ఈ మూడు విశేషణములు ఒక్క విరాట పర్వమునకు సంబంధించినవని అనుకోకూడదు. ఇవన్నీ భారతరచన మొత్తానికి సంబంధించినవిగా తిక్కన రచనలో తేటతెల్లమవుతుంది.
ఒక మహారాజు కుమార్తెగా, మహా వీరులకు భార్యగా, అనేక కష్టనష్టాలు, అవమానాలు ఎదుర్కొని నిలదొక్కుకున్న ఆత్మైస్థెర్యం గల స్త్రీగా, దుర్మార్గులను ఎదిరించడంలో శక్తిస్వరూపిణిగా, భర్తల మన్ననలు పొందిన పతివ్రతగా, ఆత్మీయతను పంచగల అనురాగవతిగా, కృష్ణుని ఆదరాభిమానాలు, అండదండలు పొందిన అపురూప సోదరిగా, తరతరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ద్రౌపది పాత్రను రూపుదిద్దిన తీరు తిక్కన కథన శిల్పానికి నాటకీయ శైలికి దృష్టాంతంగా చెప్పవచ్చు.
అంతకుముందు జన్మలో ద్రౌపది పేరు నలయాని. ఆమె తపస్సు చేసుకుంటున్న ఒక ముని పుంగవుడి ఆగ్రహానికి గురవుతుంది. ‘ఈ జన్మలో నీకు పెళ్లి కాద’ని ఆ ముని శపిస్తాడు. అప్పుడు నలయాని శివుని కోసం కఠిన తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షం కాగానే తనకు ధర్మం, పర్వతాలను పిండి చేయగలిగే బలం, విలు విద్యలో ప్రావీణ్యం, ప్రకృతి ఆరాధన, అందం.. ఈ ఐదు గుణాలు కలవాడు భర్తగా కావాలని కోరుతుంది. అప్పుడు శివుడు ఈ లక్షణాలన్నీ ఒకరిలో ఉండవు, ఇవన్నీ కావాలంటే ఐదుగురు భర్తలను పొందాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు. అయినా ఆ వరమే కావాలని పట్టుబట్టడంతో మరో జన్మలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులను భర్తగా పొందింది.
పాంచాల రాజు ద్రుపదుడు సంతానం కోసం క్రతువు చేయగా అగ్నిగుండం నుంచి ఒక పుత్రుడు, ఒక పుత్రిక ఉద్భవిస్తారు. ఆ పుత్రికే ద్రౌపది. ద్రౌపది పుట్టినప్పుడు ఆకాశవాణి ఆమెకు ‘కృషి’ అని నామకరణం చేస్తుంది.
ఆమెకు అయోనిజ, పాంచాలి వంటి పేర్లు కూడా ఉన్నాయి. ద్రుపదుని ఆజ్ఞానుసారం ద్రౌపది స్వయంవరంలో అర్జునుడిని వరించడం, శివుని వరం కారణంగా, కుంతీ మాట ప్రకారంగా పంచ పాండవులను భర్తలుగా పొందడం వంటివి ద్రౌపదిలోని వినయశీలతను, పెద్దల పట్ల గల గౌరవభావాన్ని తెలియజేస్తాయి. అయితే, తిక్కన మహాభారతంలో ద్రౌపదితో పాండవుల వివాహ వర్ణన మాత్రమే చేశాడు. దీనికి కారణమేమిటని ఆలోచిస్తే భారత కథలో ద్రౌపది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఆమె వల్ల కథలో ఘర్షణ, వేగం ఎక్కువైనట్టు తెలుస్తుంది. తర్వాత కౌరవ, పాండవ వైరభావం తీవ్రతరం కావడానికి ద్రౌపది కారణభూతమైంది. ఆమె లేకపోతే కౌరవ, పాండవ వైర స్వరూపం ఊహించలేం. ద్రౌపదియందు కౌరవులకు గల మత్సర భావం వల్లనే జరిగిన వస్ర్తాపహరణ ఘట్టం వారిరువురి వైరానికి పరమావధి. వస్ర్తాపహరణ ఘట్టం తర్వాత ద్రౌపదిని వరం కోరుకోవాలని ధృతరాష్ర్టుడు చెప్తాడు. దాంతో తన భర్తల దాస్యం బాపి, వారి ఆయుధాలు వారికి ఇవ్వాలని ద్రౌపది కోరింది. ఇంకను కోరుకొమ్మని ధృతరాష్ర్టుడు అడగగా రాజ కాంత రెండు వరాల కంటే ఎక్కువ కోరరాదని చెప్పిన రాజనీతిజ్ఞురాలు ద్రౌపది.
పాండవులతో పాటు అరణ్య, అజ్ఞాతవాసాలకు వెళ్లాల్సి వచ్చినా ద్రౌపది విచారించలేదు. భర్తలతో కలిసి ఉండటమే వరప్రసాదంగా భావించింది. శ్రీకృష్ణునితో కలిసి తమను చూడటానికి వచ్చిన సత్యభామకు సతి ధర్మాలు బోధించిన సాధ్వీమణి ద్రౌపది. అజ్ఞాతవాసం గడపడానికి పాండవులు మారుపేర్లతో విరాటుని కొలువుకు చేరారు. ద్రౌపది సైరంధ్రి రూపంలో మాలిని అనే పేరుతో తన నిజవృత్తాంతాన్ని చెప్పుకొని వాగ్ధోరణితో రాణి సుదేష్ణను మెప్పించి చెలికత్తెగా చేరింది. రాణి సోదరుడైన కీచకుడు ద్రౌపదిపై మనసు పడగా.. భీమసేనునికి చెప్తుంది. దాంతో కీచకుడిని భీముడు సంహరించాడు. ద్రౌపది వేషంలో కీచకుడిని భీముడు సంహరించే కథనాన్ని తిక్కన నానా రసాభ్యుదయోల్లాసముగా నడిపించారు. అలాగే ఉత్తర గో గ్రహణం నందు ఉత్తర కుమారునికి రథసారథిగా అర్జునుడిని వెళ్లాలని ద్రౌపది మెత్తని పలుకులతో చెప్పినదని తిక్కన రాశారు. అర్జునున్ని ఒప్పించడంలో ద్రౌపది వాక్చాతుర్యాన్ని, యుద్ధక్రియాపరమైన బుద్ధి కుశలతను తిక్కన నిరూపించారు.
అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తిచేసుకొని తిరిగి వచ్చిన పాండవులకు రాజ్య భాగాన్ని ఇవ్వడానికి నిరాకరించిన కౌరవుల వద్దకు కృష్ణుడు రాయబారిగా వెళ్తాడు. ఈ సందర్భంలో ద్రౌపది అభిప్రాయాన్ని కూడా కృష్ణుడు అడుగుతాడు. అయితే, ఇక్కడ కృష్ణునికి ద్రౌపది పట్ల ఉన్న అభిమానానికి గల దృష్టాంతాలను ప్రస్తావించుకోవాలి. ఒక మారు సోదరుడైన జగన్నాటక సూత్రధారి కృష్ణుడికి గాయమవగా.. ద్రౌపది వెంటనే తన చీర కొంగును చింపి, వేలికి కడుతుంది.
ఆమె ఆదరాభిమానానికి సంతుష్టుడైన కృష్ణుడు అవసరమైన సమయంలో తలచిన వెంటనే వచ్చి ఆదుకుంటానని మాట ఇస్తాడు. అలా వస్ర్తాపహరణ సమయంలో ద్రౌపదికి అండగా నిలుస్తాడు. అరణ్యవాసంలో సమయం కాని సమయంలో దూర్వాస మహాముని శిష్య సమేతంగా సందర్శించినప్పుడు కృష్ణుడు ఆదుకుంటాడు.
ఇంతటి అనుబంధం గల కృష్ణుడు రాయబారానికి వెళ్లేముందు ద్రౌపది అభిప్రాయం కోరగా ఆమె ఆక్రోశంతో ‘సుయోధనుని మీద ప్రేమాతిశయంతో ధర్మరాజు ఇన్ని అవమానాలను సహించి ఊరుకున్నాడేమో గానీ, రావలసిన రాజ్య భాగం తీసుకోకపోతే పాండవులంతటి పిరికివాళ్లు, అసమర్థులు, అవివేకులు లేరని లోకులు నిందించరా? పాండవుల ముందు కౌరవులెంత? నాకు తోచింది చెప్పాను. మీకు తోచింది చేయండి’ అని చెప్తుంది. ఈ సందర్భంలో వివేకవంతురాలిగానూ, క్షేత్రధర్మాన్ని చాటిన ధీరవనితగానూ ద్రౌపది దర్శనమిస్తుంది.
మహాభారతంలో ప్రధానపాత్ర ద్రౌపది. సహనశీలత, వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ, అన్యాయాన్ని ఎదిరించగలిగే శక్తి, తప్పులను ఎత్తిచూపడంలో కచ్చితత్వం, ధీరత్వం వంటి శుభలక్షణ సంపన్నురాలు ద్రౌపది. నేటి సమాజంలో ప్రతి చిన్న సమస్యకు కుంగిపోతూ జీవితాలను అంతం చేసుకుంటున్న మహిళలు ద్రౌపది చరిత్రను తెలుసుకుంటే సమస్య పరిష్కార శక్తిగా ఎదగడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని సాధికారతను సాధించవచ్చు.
– డాక్టర్ నమిలకొండ సునీత 99084 68171