మార్పు శాశ్వతం అనే చమత్కారాన్ని మనం తరచూ వింటూనే ఉంటాం. తెలుగు సాహిత్యంలో ఈ మార్పును కవులు బాగానే ఒంటపట్టించుకున్నారు. ముఖ్యంగా తమ కవిత్వ సంకలనాల శీర్షికల విషయంలో ఈ మార్పు కనిపిస్తుంది. ఇంతకుముందు అంటే రెండు, మూడు దశాబ్దాల క్రితం అన్నమాట.. కవిత్వ సంకలనాలకు మూస టైటిళ్లు ఉండేవి. తాము రాసిన కవితల్లో ఓ కవిత పేరే సంకలనానికి పెట్టేవారు. ఇది ఇప్పుడూ కొనసాగుతోంది కానీ, ఆ కవితకు పెడుతున్న శీర్షికే కొత్తగా, ఆకర్షణీయంగా ఉంటోంది. ముఖ్యంగా ఓ దశాబ్దం నుంచి కవుల్లో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే మార్పు కోరిన తరంగా కనిపిస్తోంది.
‘ఒక వెళ్లిపోతాను’ అని ఎం.ఎస్.నాయుడు తన కవిత్వ సంకలనానికి అందులోని ఒక పద్యం పేరే పెడితే తెలుగు సాహిత్య లోకమంతా చాలా ఆశ్చర్య పోయింది. ఆ కవిత్వ సంకలనాన్ని ఆవిష్కరించిన ప్రముఖ కవయిత్రి విమల అయితే, ఆ పేరు చూసి కవిత్వంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో అని ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సభలోనే విమల మాట్లా డుతూ ఒక్క లైనులోనే ఓ కవితను చెబుతున్న వారూ ఉన్నారన్నారు. ఇదీ నేటి కవిత్వ భాష. ఇక ప్రసేన్ అయితే తన మూడు కవిత్వ సంకలనాలకు పెట్టిన పేర్లు చూసి ఆ కవిత్వం చదవాలనిపిస్తుంది. (కొనాలనిపిం చదు. కొట్టేసి చదవాలనిపిస్తుంది). ప్రసేన్‌కు జర్నలిస్టుగా అనుభవం ఎక్కువే కాబట్టి, అక్కడ హెడ్డిం గులు పెట్టినట్టే తన కవిత్వ సంకలనాలకు కొత్తకొత్త పేర్లు పెట్టి పాఠకులను తన వైపు తిప్పుకునేలా చేస్తున్నారా యన. ‘Don’t Judge A Book by It’s Cover’ అంటూ కార్పొరేట్ ప్రకటనలు వస్తున్నాయి కానీ, తెలుగు కవిత్వాన్ని మాత్రం ఆ కవర్ పేజీ, ముఖ్యంగా ఆ సంకలనానికి పెట్టిన పేరుని బట్టే చదువుతున్నారు. అంతేకాదు.. పుస్తక ప్రదర్శనల్లో కొంటున్నారు కూడా.
ప్రసేన్ తన కవిత్వ సంకలనాలకు పెట్టిన పేర్లు కొందరికి కొత్తగా అనిపిస్తే… ఇంకొందరికి మాత్రం గమ్మత్తుగా అనిపించాయి. నాకు భలే నచ్చాయి ఆ పేర్లు. ప్రసేన్ రాసిన ఓ కవిత్వ సంకలనం పేరు ‘ఇంకా వుంది’. సృజనకారులకు ఎందులోనూ ముగింపు ఉండదు. కవి అనండి, రచయిత్రి కానివ్వండి ఏది రాసినా అంతా అసంపూర్ణమే. వాళ్లు చెప్పేందుకు ఇంకా చాలానే ఉం టుంది. బహుశా అందుకు సంకేతమే ఈ ‘ఇంకా వుంది’.
ఇలాంటి తాత్వికతే మరో రెండు సంకలనాల టైటిళ్లలోనూ కనిపిస్తుంది. అందులో ఒకటి ‘ఎవరికి వర్తి స్తే వారికి’. ఈ కవిత్వం చదవడానికి కాసింత ధైర్యం కావాలనిపిస్తుంది. ఆ సంకలనం తెరిస్తే ‘మన గురించి, మనల్ని ఉద్దేశించి ఏమైనా రాశారా, మనల్ని మన అద్దం లో చూపించారా…!? లేదా తన అద్దంలో చూపిం చారా…!?’ అనే సంశయం ప్రారంభమవుతుంది. ఏది కనిపించినా అది ఎవరికి వర్తిస్తే వారికి అలా…
సీనియర్ కవిగా గుర్తింపు పొందిన జూకంటి జగన్నా థం తన కవిత్వ సంకలనాలకు పెట్టిన పేర్లు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి, బాగుం టాయి. ఈ మధ్య ఖమ్మం ఈస్థటిక్స్వారు ఉత్తమ కవిత్వ సంకలనంగా జూకంటి రాసిన ‘ఒక కప్పు చాయ్ నాలుగు మెస్సేజ్ లు’కే ప్రకటించారు. ఈ సంకలనానికి అవార్డు ప్రకటించారని తెలియగానే తొలు త ఆశ్చర్యపోయాను. జూకంటి ఇప్పటి కవి కాదు. ఇంతకుముందు కూడా తన కవిత్వ సంపుటాలకు ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అని, ‘వాస్కో డిగామా డాట్‌కామ్’ అని సరికొత్త పేర్లు పెట్టారాయన. అంటే నేటి తరంతో నాటి జూకంటి అప్డేట్ అవుతు న్నారనిపించింది. ఊరికే పేరేనా… లోపల విషయం ఉందా అని చూస్తే చాలానే ఉందనిపిస్తుంది.
ఈ కప్పు చాయ్ పద్యం ‘వన్నెల వెన్నెలని చూడలేడు/ ఉదార హృదయాన్ని కనలేడు’ అంటూ ప్రారంభమై మధ్యలో ‘ఏమరుపాటుగా కుర్చీలో కూర్చుని/ ఒక కప్పు చాయ్ సిప్ చేస్తూ/ సెల్లో ఎంగిలి మెసేజ్‌లు చదువుతూ/ కొత్త ప్రపంచంలోకి ప్రవేశం/ కాకిలగ్గం డేటింగ్ చాటింగ్ చేస్తుంటాడు’ అంటారు. ఎంత గొప్పగా వెటకరించారు సెల్ఫోన్లే లోకంగా బతుకుతున్న నేటితరాన్ని. కవులే కాదు.. కవయిత్రులు కూడా తమ సంకలనాలకు సరికొత్త పేర్లు పెడుతూ పాఠకులకు చేరువవుతున్నారు. తోట సుభాషిణి ‘ఒకటి ఒకటి పదకొండు’, మందరపు హైమావతి ‘రాతిచెయ్యి’ కవిత్వ సంకలనాలు తీసుకొచ్చారు. తన కవిత్వ సంకల నాలకు ‘లోహనది’, ‘మరో దశ’ వంటి సీరియస్ పేర్లు పెట్టిన వసీరా మూడో సంకలనానికి మాత్రం ‘సెల్ఫీ’ అని నామకరణం చేశారు. ఇది తన మూడు దశాబ్దాల కవిత్వ ప్రయాణంలో తానే తీసుకున్న సెల్ఫీ. ఎప్పుడూ అచ్చమైన కవిత్వం రాసే పసునూరి శ్రీధర్‌బాబు ‘నిద్రపోని మెలకువ చెప్పిన కల’ అంటూ పొయెటిక్ సంకల్పం చెప్పుకొన్నారు తన కొత్త కవిత్వానికి.
తెలుగు సాహిత్యంలో చాలామందికి గురుస్థానంలోకి వచ్చిన సీనియర్ కవి శివారెడ్డి అయితే పొసగనివన్నీ కలిపి ఓ కవిత్వ సంకలనం వేశారు. అది కూడా దశాబ్దంన్నర క్రితమే. అలాగే ‘పక్కకు వొత్తిగిల్లితే’ ఏం జరుగుతుందో కూడా శివారెడ్డే చెప్పారు. ఎనిమిది పదుల వయసులోకి వచ్చాక అసలు సిసలు ప్రేమని కనుగొని దానికి ‘Ode To Love అను ప్రేమగీతం’ పాడారు. ఇంకా చాలామంది తమ కొత్త శీర్షికలు, కవిత్వ సంకలనాల పేర్లతో తెలుగు కవిత్వాన్ని వినిపిస్తున్నారు. ‘పేరులోన ఏముంది’ అన్నమాట కాదు నేడు వినిపిస్తున్నది.. ‘పేరులోనే అంతా ఉంది’ అన్నదే నేడు వినిపిస్తున్న కవిత్వం.
-ముక్కామల చక్రధర్
99120 19929