తెలుగు సాహిత్యంలో కవి అనేది కేవలం కవితలు పద్యాలు రాసే వాడే కాదు. సమాజానికో ఆత్మ, మనసుల మధ్య ఒక వారధి. ఆ పాత్రను అత్యంత నిబద్ధతతో, స్వచ్ఛమైన హృదయంతో నిర్వర్తించిన కవుల్లో కొరుప్రోలు హరనాథ్ ఒకరు. కవి కావాలంటే జ్ఞానం, అధ్యయనం, పరిశీలనా దృష్టి, సున్నితమైన మనసు అన్నీ కలగలిసి ఉండాలి. ఈ లక్షణాలన్నీ హరనాథ్లో సహజసిద్ధంగా అంకురించి, దశాబ్దాలపాటు అక్షరంగా వికసిస్తున్నాయి. పాత నగర సాహిత్య వాతావరణంలో పెరిగిన ఆయన, కవిత్వాన్ని కేవలం రాయడమే కాదు, జీవించారు, శ్వాసించారు.
అక్షరాల మీద ప్రేమతో, భావాల మీద నిబద్ధతతో ఎనిమిది కవితా సంపుటాలను ఆయన వెలువరించారు. అవి అగ్నిపుష్పాలు, స్వర్ణపుష్పాలు, హోరు, నగరంలో నగ్నసత్యాలు, రాగమోహనం, మోంబత్తి, ఊహలకే ఊపిరొస్తే, రహదారి. ఇప్పుడు అవన్నీ ఒకే గ్రంథంగా సమగ్ర రూపంలో మన ముందుకు వచ్చాయి. ఈ మొత్తం సంపుటిలో చిన్న కవితల నుండి పెద్ద కవితల వరకు విస్తరించిన భావ వైచిత్య్రం ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా మినీ కవితలపై హరనాథ్ పట్టు అద్వితీయం. చిన్న పదాల్లో పెద్ద అర్థం ఇమిడించడం అంటే కవిత్వంలోని గొప్ప నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని ఆయన అందంగా నిరూపించారు.
హరనాథ్ కవిత్వం ఎక్కడ చదివినా ఒక స్పష్టమైన సామాజిక బాధ్యత కనిపిస్తుంది. దోపిడీ వ్యవస్థలపై, నల్లధనపు కోటలపై, అన్యాయంపై ఆయన అక్షరాలు అస్ర్తాలై నిలుస్తాయి. వెలుగును చీకట్లో బంధించడం ఎంత కష్టమో, సంపన్నుల చేతిలోని నల్లధనాన్ని వెలుగులోకి తీయడం అంతకంటే కష్టం. ఒక్క వాక్యమే కాదు, ప్రతి కవిత ఆయన నిబద్ధతకు ప్రతిబింబం.
‘రాగమోహనం’లో కనిపించే ప్రేమ కవిత్వం మరొక హరనాథ్ను పరిచయం చేస్తుంది. సామాజిక భావాలతో పాటు, మనసు మృదుత్వాన్ని, ప్రణయ సౌందర్యాన్ని అంత నిష్కపటంగా రాయడం చాలా అరుదు. ఇతర మేధావులు చెప్పిన మాటల్లో.. శేషేంద్ర శర్మ ఆయనను న్యాయం కోసం అచంచలంగా నిలిచే కవి అని అభినందించారు. చందన్ రావు ఆయన హిందీ ఉర్దూ అనుబంధాన్ని ప్రశంసించారు. సత్యనారాయణ పాతనగరంలో నిరంతర అక్షరాగ్ని కురిపించే కవి అని పేర్కొన్నారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఒక కవికి ఇది సాధారణ గుర్తింపు కాదు . అది సమకాలికులు ఇచ్చిన గౌరవం, అంగీకారం, విలు వ. ‘నగరంలో నగ్నసత్యాలు’ వంటి దీర్ఘ కవితల్లో నగర జీవితంలోని గందరగోళం, మాయాజాలం, పరిస్థితుల దుస్థితి కచ్చితంగా ప్రతిబింబించబడింది. నగరాలు గమ్మత్తుల జిమ్మిక్కులు అంటూ, నగరం అనే శబ్దంలో దాగున్న అర్థాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తారు. హరనాథ్ కేవలం కవి కాదు, ఒక దృక్పథం. అక్షరాలు ఆయుధాలైతే, వాటిని సమాజపక్షాన ప్రయోగించే సాహసి.
సాహిత్యానికి శ్రమ, శ్రద్ధ, సత్యం అనే మూడు మూలాల్ని జోడించిన సాహితీవేత్త. ఈ సమగ్ర కవిత్వం ఆయన నాలుగు దశాబ్దాల ప్రయాణానికి అందమైన ముద్ర. కవిత్వం చదివే వారికి, పరిశోధన చేసే వారికి, సృజనను ప్రేమించే వారికి హరనాథ్ కృతులు ఒక పాఠం, ఒక ప్రేరణ, ఒక వెలుగు. ప్రతి అక్షరంలో ఆయన మనసు వినిపిస్తుంది. ప్రతి భావంలో ఆయ న జ్ఞానం ప్రతిఫలిస్తుంది. కొరుప్రోలు హరనాథ్ సాహిత్య ప్రయాణానికి హృదయపూర్వక అభినందనలు. ఈ సమగ్ర సంపుటి ఆయన సాహిత్య మన్ననకు శాశ్వత సాక్ష్యం అవుతుంది.
-ఎన్.లహరి
98855 35506