మనుషుల మనసులను ఆనందింపజేసేది, ఆహ్లాదపరిచేది సాహిత్యం. హితాన్ని కోరేది సాహిత్యమనుకుంటే అందరికీ అర్థమయ్యే భాషలో ఉన్న సాహిత్యమే అధిక శాతం మనుషుల మనసులను ఆహ్లాదపరుస్తుంది. మధురానందాన్ని ప్రసాదిస్తుంది.
అయితే ఒకప్పటి తెలుగు సాహిత్యంలో గ్రాంథిక పదజాల శాతం అధికంగా ఉండేది. అంతేకాకుండా జటిల గ్రాంథికంతో కొందరు, అర్ధ గ్రాంథికంతో మరికొందరు, సరళ గ్రాంథికంతో ఇంకొందరు కవులు పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, కథ, కవిత, నవల అంటూ రకరకాల ప్రక్రియలలో సాహిత్యాన్ని సృజించారు. ఆయా ప్రాంతాల యాసల పదజాలంతో కూడా కవిత్వమల్లిన మహాకవులు ఉన్నారు. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలో విజయనగరం ప్రజల యాస, భాష ఎక్కువగా కనిపిస్తుంది.
తెలుగు సాహిత్యం అనగానే మనకు ఠక్కున పద్యం యాదికి వస్తుంది. పద్య కావ్యాలను రాసిన అనేకమంది సుకవులు, ఆశు కవులు, మధుర కవులు, చిత్ర కవులు యాదికి వస్తారు. తెలుగు సాహిత్యానికి ఉన్న అతిపెద్ద ఆస్తి పద్యం అని కొందరు సాహితీప్రియులు అంటారు. పాడుకోవడానికి అనువుగా ఉండే తెలుగు పద్యం అనగానే పాత తరం వారికి తిరుపతి వేంకట కవుల ‘బావా యెప్పుడు వచ్చితీవు.. ‘చెల్లి యో చెల్లకో’, ‘జెండాపై కపిరాజు’, ‘తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి’, ‘ముందుగ వచ్చితీవు..’ వంటి పద్యాలు, బలిజేపల్లివారి ‘బాలసూర్య ప్రభా కలితంబై’ వంటి పద్యాలు, పోతన రచించిన ‘పలికెడిది భాగవతమట.. పలికించెడి వాడు రామభద్రుండట’, ‘కారే రాజులు రాజ్యముల్ గల్గవే’.. ‘సిరికింజెప్పడు’.. ‘నల్లని వాడు పద్మ నయనంబులవాడు’,‘ శ్రీకృష్ణా! యదుభూషణ’ వంటి పద్యాలు, అలాగే వేమన, బద్దెన పద్యాలు యాదికి వస్తాయి. (తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం సందర్భాన కేసీఆర్ రాసిన ‘నవ్వవు జంతువుల్ మనిషి నవ్వును…’ పద్యం కూడా అర్థవంతంగా ఉంటుంది)
అయితే కొందరు ఆధునిక కవులు పద్యాన్ని పాతిపెట్టి, ఛందో సంకెళ్లను తెంపి అందరికీ అర్థమయ్యే వచనంలో కవిత్వం రాయండి అని అన్నారు. మరికొందరు తెలుగు కవులు ప్రజల హృదయాలలో ఏనాడో పద్యాలను పాతిపెట్టామన్నారు. ఇలా ఎవరిష్టం వచ్చిన రీతిలో వారు తెలుగు సాహిత్య కవనావేశాన్ని ప్రదర్శించారు. ఏదేమైనా కొందరు తెలుగు కవులు కొంతకాలం వచన కవిత్వం రాశారు. అయితే వారి వచన కవిత్వాన్ని సైతం నేడు చదివేవారు తక్కువయ్యారు. మళ్లీ ఇప్పుడు కొందరు తెలుగు కవులు మాత్రా ఛందస్సున అంత్య ప్రాసలతో కూడిన కవిత్వం రాస్తున్నారు.
తెలుగు ఛందస్సుతో కూడిన పద్యాలలో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలము, మత్తకోకిల, తరళము, కందం, సీసం, ఆటవెలది, తేటగీతి, ద్విపద వంటి పద్యాలు ఉంటే మాత్రా ఛందస్సులో మధురిమలు, వెన్నముద్దలు, చిమ్నీలు, వెన్నెలమ్మలు, భువన (ప్రాస, అంత్యప్రాసలతో మాత్రా ఛందస్సున నాలుగు పాదాలతో కూడిన భువన అనే పేరుగల పద్యం ఈ వ్యాస రచయిత రూపకల్పన) మురళి వంటి పేర్లు గల రకరకాల మాత్రా ఛందస్సు పద్యాలను ప్రస్తుతం కొందరు యువ కవులు రాస్తున్నారు. మనసులోని భావాలను పొందికగా ఆచితూచి చెప్పడానికి ఛందస్సు ఉపయోగపడుతుందని ఛందో ప్రియులు చెబుతుంటారు. భాషను ఆచితూచి పద్యంగా చెప్పడానికి ఛందస్సు ఉపయోగపడుతుంది.
కవిత్వం రాసే వారు తెలుగు పద్యం రాయాలంటే వారికి మనో భావనతో పాటు కొంతైనా ఛందో పరిజ్ఞానం ఉండాలి. ఛందో పరిజ్ఞానం కావాలంటే కొంత అభ్యాసం ఉండాలి. తెలుగులో అప్పకవీయం, కవిజనా శ్రయం, గోవర్ణ ఛందస్సు, అధర్వణ ఛందస్సు, కవి వాగ్బంధము, తాతంభట్టు ఛందో దర్పణం, అనంతుని ఛందో దర్పణం వంటి అనేక ఛందో శాస్త్ర గ్రంథాలు పద్యాలలో ఉన్నాయి.
తెలుగు సాహిత్యంలోని తెలుగు పద్యం కేవలం మా నసిక ఆనందాన్ని కలిగించడానికే ఉందంటే నేటి విద్యా ప్రపంచంలో దాని గురించి ఆలోచించవలసిన అవస రం లేదు. అందరి మానసిక ఆనందం ఒకే రీతిన ఉం డదు. కాబట్టి పద్యం ద్వారా మానసిక ఆనందాన్ని పొం దేవారు పద్యం ద్వారా పొందితే.. రకరకాల కవితా ప్రక్రియల ద్వారా ఆనందాన్ని పొందేవారు వాటి ద్వారా పొందుతారు. దండి మహాకవి వంటి వారు ‘కావ్యం యశసే అర్థ కృతే వ్యవహారవిదే శివేతరక్షతయే సద్యః పర నిర్వృత్త యే కాంతా సమ్మిత తయోపదేశయుజే’ అంటూ కావ్య ప్రయోజనాలను చాలా చాలా ఉన్నత స్థాయిలో చెప్పారు. అనగా కావ్యం వలన కీర్తి, వ్యవహార జ్ఞానం, అమంగళ నివారణ, తత్కాల పరమానందం, ధర్మోపదేశం కలుగుతాయని అర్థం. అయితే దీన్నంతా ఈ కాలానికి అన్వయించుకోవచ్చా? అంటే అది వేరే విషయం. ఏది ఏమైనా తెలుగు పద్య రచనకు ఉపయోగపడే ఛందో మూలాలు సామాన్యంగా లేవు. అవి గణిత జ్ఞానంతో ప్రకాశిస్తున్నాయి. ఆ గణితంలో ఆధునిక గణితం అందంగా అర్థవంతంగా ఉంది. ఛందో అభ్యాస మూలాల్లోకి సశాస్త్రీయంగా వెళితే అక్కడ ఆధునిక గణిత ఛాయలు మస్తుగా కనిపిస్తాయి. అవి నేటి విద్యా ప్రపంచానికి పుష్కలంగా ఉపయోగపడతాయి.
వేదాంగాలలో ఒకటైన ఛందస్సు వేదపురుషుని పాదాలని అంటారు. వేద ఛందస్సు ఏ మంత్రంలో ఎన్ని మాత్రలు ఉన్నాయి? వాటిలోని గణాలు ఎలా ఉంటాయి? మన మనోభావాన్ని ఏ ఛందస్సులో ఉంచితే అది తేజోవంతమవుతుంది? వంటి విషయాలను వివరిస్తుంది. వేదాంగాలలోని ఛందో శాస్త్రం ఆధునిక గణిత శాస్త్రంలోని కొన్ని అంశాలకు అతి దగ్గరగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఛందస్సులో రెండే రెండు గుర్తులు ఉంటాయి. అవి 1.గురువు (U) 2. లఘువు (I). ఈ రెండింటి సహాయంతోనే వివిధ రకాల గణాలు పుడతాయి. ఆ గణాలతో రమారమి 42 కోట్ల పద్యాలు ఆవిర్భవిస్తాయి. కంప్యూటర్ భాషలో కూడా రెండే రెండు గుర్తులు సున్నా (0), ఒకటి (1) మాత్రమే ఉంటాయి. ఆ రెండు గుర్తులే ద్విసంఖ్యా మాన భాషను సృష్టిస్తున్నాయి. అంతేగాక ఛందో గణ ప్రస్తారాల ద్వారా బీజ గణిత సూత్రాలను, ప్రవచన గణిత అమరికల వంటి అనేక గణిత సూత్రాలను రూపొందించవచ్చు. అంటే ఛందోశాస్త్రం ద్వారా విద్యా ప్రపంచానికి రమారమి 42 కోట్లకు పైగా గణిత సూత్రాలను అందించవచ్చు.
అలాంటి ఛందో ధర్మాన్ని మేధస్సులో నిక్షిప్తం చేసుకుని అందులో మనోభావాలను పదిలపరిస్తే వచ్చే విజ్ఞాన స్వరూపమే తెలుగు వారి పద్యం. ఇవన్నీ తెలుసుకోకుండా కూడా తెలుగు పద్య ప్రియులు నాలుగు పద్య లక్షణాలను తెలుసుకుని పద్యం రాయవచ్చు. అయితే అందులో వారి మనోభావాలు వికసిస్తాయి తప్పించి, జ్ఞానభావాలు వికసించవు. నవగణ సూత్ర రూపకల్పనకు శ్రీకారం చుట్టవు. ఛందస్సుతో కూడుకున్న తెలుగు పద్యాలను పరిహసించడమంటే సశాస్త్రీయ గణితాన్ని పరిహసించడమే. కొందరు లెక్కించడం చేతకానివాడు లెక్కలోకి రాడంటారు.
మన తెలుగు సాహిత్యంలో ఛందో భరిత పద్యం మేధో పరంగా మరింత లోతులకు వెళ్లిం ది. అదే పద్యంలో పద్యం.. గర్భ కవి త్వం. అనగా రెండు పద్య లక్షణాలు గల ఏకపద్యంలో మనోభావం ఉంచడం. ఇక్కడ భావం, లక్షణం రెండూ ప్రధానమేనని చెప్పాలి.
ఒక పద్యంలో అనేక పద్యాలు ఇమిడి ఛందో దోషాలు, అర్ధ దోషాలు లేకుండా కనపడే పద్యాలే గర్భ కవిత్వ పద్యాలని అప్పకవి గర్భ కవిత్వం గురించి చెప్పారు. పద్యంలో ఛందో దోషం వచ్చిందంటే గణ దోషం వచ్చిందని అర్థం. అదే ఆధునిక భాషలో చెప్పాలంటే గణిత దోషం వచ్చిందని అర్థం.
ఉదాహరణకు గణిత పరంగా చెప్పాలంటే ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ సూత్రంలో ఏ ప్లస్ బీ హోల్ స్కేర్ సూత్రం ఉంటుంది. ఇక్కడ రెండు సూత్రాల ధర్మాలు ఉంటాయి. ఇదే రీతిన మన కవులు చంపకమాల గర్భ కంద పద్యం, కంద గర్భ మణి గణ వృత్తం, సీస గర్భ గీత పద్యం వంటి అనేక గర్భ కవిత్వ పద్యాలు రాసిన వారు ఉన్నారు. అనగా వారు రాసిన చంపకమాల గర్భ కంద పద్యంలో చంపకమాల పద్య లక్షణాలు కంద పద్య లక్షణాలు రెండూ ఉంటాయి. అలాగే మిగతా వాటిలో కూడా రెండు పద్య లక్షణాలు ఉంటాయి. అంతేగాక వాటితో పాటు వారి మనోభావన కూడా ఉంటుంది.
(ఇంకా ఉంది)
-వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
98494 48947