తెలుగు భాషా సంస్కృతులకు, చరిత్రకు ‘తెలంగాణ’ తొట్ట తొలుత వికాస కేంద్రంగా నిలిచింది. ఆ తర్వాతే మిగతా తెలుగు నేలకు సంస్కృతీ వికాసం విస్తరించింది. అలాంటి బంగారు నేలపై వెయ్యేండ్లకు పైగా చారిత్రక సాక్ష్యంగా నిలిచిన భాగ్యనగరం నేడు తెలుగు వారలకు వికాసభూమి, నివాస భూమి, వ్యాపారకేంద్రం, విద్యల నిలయంగా నిలిచింది.
తెలుగు భాష ప్రాచీనత్వం కోసం తెలంగాణ సాహిత్యాన్నే ఆధారంగా తీసుకొని ప్రాచీన హోదాను కేంద్రం నుంచి వాదించి, గెలిచి తెచ్చుకున్నాం. అలాంటి మనం ఓ విశ్వవిద్యాలయానికి అందులో ప్రాచీన సంస్కృతీ కళలకు పట్టుకొమ్మ అయిన విశ్వ విద్యాలయానికి ఒక ప్రాచీన మహాకవి పేరు పెట్టుకోలేమా? అసలు పాల్కుర్కి అధ్యయనాంశంగా ఒక పీఠమే ప్రభుత్వం ఏర్పర్చాలి. అలాంటిది ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి ఈ మహాకవి పేరు పెట్టుకోవడం ఎంతో సముచితం.
ఈ హైదరాబాద్ మహానగరంలోని విద్యా వికాసానికి కేంద్ర స్థానాలైన విశ్వ విద్యాలయాల్లో తెలుగు విశ్వ విద్యాలయం ఒకటి. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మానసపుత్రికగా, ఆయన హయాంలో అన్ని కళా కేంద్రాలను అంతర్గర్భీకరించుకొని నగరం నడి బొడ్డున అందరికీ అందుబాటులో నాంపల్లి కేంద్రంగా డిసెంబర్, 2 1985లో తెలుగు విశ్వవిద్యాలయం వికసించింది. దీన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 1998లో ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’గా పేరు మార్చినారు. సంస్కృతం, జ్యోతిషం, క్లాసికల్ తెలుగు, నృత్యం, సంగీతం, చరిత్ర, ఇతర కళలు ఇలా అనేక సంస్కృతీ విభాగాలకు విద్యార్జన కేంద్రమైంది.
ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రం రెండు తెలుగు రాష్ర్టాలుగా విడిపోయి పదేండ్లు గడిచిన కారణంగా అన్ని అంశాల్లో విభజన అయి, ఈ విశ్వవిద్యాలయం కూడా ద్విధావిభక్తం అవుతోంది. తెలంగాణ విభాగానికి అనగా హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయానికి నామ్మీకరణం, నామ్నీకరణం దిశగా ప్రయాణిస్తున్నది. సురవరం ప్రతాపరెడ్డి పేరును ఇదివరలో కొందరు సూచించారు.
అయితే, ఇవి ఆధునిక విద్యా విషయాల విశ్వవిద్యాలయాలు కావు. ప్రాచీన సాహిత్యం, సంస్కృతీ, కళల నిలయాలు. వీటికి ప్రాచీనుల పేర్లు తగినవిగా ఉంటాయి. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం (రాజమండ్రి), వేమన విశ్వ విద్యాలయం (కడప), తిక్కన విశ్వవిద్యాలయం (నెల్లూరు) వంటి పేర్లతో ఆంధ్రులు వాటిని సముచితంగా గౌరవించుకున్నారు. తెలంగాణలోని ఈ విశ్వవిద్యాలయానికి ప్రాచీన తెలుగు కవులు లేరా? పేర్లు దొరకవా? ఆధునిక తెలంగాణ వైతాళికుల పేర్లు పెట్టాలా? అనేది ప్రశ్న.
బాగా ఆలోచిస్తే తెలంగాణకు ప్రాచీన సాహిత్య మణి కిరీటంలోని శిరోమణి వంటి పాల్కుర్కి సోమనాథుడున్నాడు. ఇతడు తెలంగాణకే కాదు, తెలుగు సాహిత్యానికే ‘స్వతంత్ర తొలి తెలుగు కవి.’ ఈతని శిష్ట సాహిత్యం, పద సాహిత్యం, శతక సాహిత్యం, స్తుతి సాహిత్యం పండితులకు పామరులకు ఉపాదేయమైంది. మిగిలిన కవులెలా ఉన్నా, ఈయన పేరు తెలియని తెలుగు వాడుండరు. ప్రసిద్ధుడైన ఈ మహాకవి తెలుగు సాహిత్య లోకానికే స్ఫూర్తిదాత. తెలంగాణ జాతికి నిత్యః ప్రాతః స్మరణీయుడు. అంతేకాదు, అత్యంత ప్రాచీనుడు. ఈయన కాలం 11వ శ. అంతం. ఇంత ప్రాచీనుడైన ప్రతిభావంతుడైన మహాకవి మరొకరు లేడు.
తెలుగు భాష ప్రాచీనత్వం కోసం తెలంగాణ సాహిత్యాన్నే ఆధారంగా తీసుకొని ప్రాచీన హోదాను కేంద్రం నుంచి వాదించి, గెలిచి తెచ్చుకున్నాం. అలాంటి మనం ఓ విశ్వవిద్యాలయానికి అందులో ప్రాచీన సంస్కృతీ కళలకు పట్టుకొమ్మ అయిన విశ్వ విద్యాలయానికి ఒక ప్రాచీన మహాకవి పేరు పెట్టుకోలేమా? అసలు పాల్కుర్కి అధ్యయనాంశంగా ఒక పీఠమే ప్రభుత్వం ఏర్పర్చాలి. అలాంటిది. ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి ఈ మహాకవి పేరు పెట్టుకోవడం ఎంతో సముచితం. అందరికీ సమ్మతంగా ఉండే భేషైనా కీర్తిమంతమైన చర్య. ముఖ్యమంత్రి, విద్యామంత్రులు ఈ విషయంగా పరిశీలించగలరని మనవి.
అయితే, సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు సంగతేమిటని ఒక ప్రశ్న తలెత్తుతుంది. వీరు తెలంగాణలోని ఆధునిక సాంస్కృతిక వైతాళికుల్లో ఆద్యగణనీయుడు. ఈయన తెలంగాణలో పుట్టకుంటే, తెలంగాణ సంస్కృతీ, కళావారసత్వం, రాజకీయ వికాసం ఒక వందేండ్ల వెనుకకు ఉండేదంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి మహానుభావుడి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టరాదా అని ప్రశ్న. అయితే, ఒక ప్రాచీన మహాకవి కోసం తపించి, పాల్కుర్కి సోమనను గణనలోకి తీసుకున్నాం.
సురవరం ప్రతాపరెడ్డి పేరును ఒక విశ్వవిద్యాలయానికి పెట్టవలసిందే. అంతటి యోగ్యత వారిది. ఆ బాధ్యత మనందరిది. ప్రస్తుతం పాలమూరు విశ్వవిద్యాలయం ఉంది. ఇది కొత్త విశ్వ విద్యాలయాల్లో ఒకటి. పైగా ఈ విశ్వవిద్యాలయం సురవరం వారి సొంత జిల్లాలోనిది. వారు ఆ జిల్లా వాసులే గనుక, వారిపేరు ఆ విశ్వవిద్యాలయానికి పెడితే సముచితంగా ఉంటుంది. ‘సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం, లేదా సురవరం ప్రతాపరెడ్డి పాలమూరు విశ్వవిద్యాలయం’ అన్నా సముచితంగా ఉంటుంది.
అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వాసులందరే కాక విశేషించి పాలమూరు జిల్లా స్థానికులు కూడా బాగా హర్షిస్తారు. ప్రతాపరెడ్డి గారంటే అభిమానించే వారు కూడా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారు, ఆహ్వానిస్తారు. సురవరం వారికి గూడా మనం ప్రేమపూర్వకంగా, నివాళి అర్పించినట్టుంటుంది. ఒకరు ప్రాచీన వైతాళికునిగా, మరొకరు ఆధునిక తెలంగాణ వైతాళికునిగా ఉభయులను ‘పాల్కుర్కి సోమన, సురవరం ప్రతాపరెడ్డి గారలను’ సంభావించి, సముచిత గౌరవమిచ్చి తెలంగాణ జాతికి వారిచ్చిన అమూల్య సంస్కృతీ వారసత్వాన్ని గౌరవించుకున్నట్టుంటుంది. ఈ దిశగా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాం.
డాక్టర్ సంగనభట్ల
నరసయ్య
94400 73124