ఎన్నో రాత్రులు మేలుకుంటే తప్ప ఈ దళితోద్యమ అఖండ చరిత్ర బయటికి రాదు. ఒక చరిత్రను బయటికి తేవడం తేలికైన పని కాదు. కొలిమిలో కాలిన కర్రుకు తెలుసు బాధేంటో.. పొలాన్ని పొతం చేసి పంటను నిలబెట్టిన నాగలికి తెలుసు కష్టం ఎంతనో.. అలాగే ఈ ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’ వెనుక ఉన్న కృషి ఎంతటిదో సంగిశెట్టి శ్రీనివాస్‌కే తెలుసు.
మన మైదానం ఖాళీగా లేదు, మనం రాయకపోవడమే ఖాళీ.. ఇక్కడ అస్తిత్వం కోసం పోరాడని వీరులు వీరవనితలు, గెలువని క్రీడాకారులు లేరు. కాకపోతే, చరిత్ర రాయలేదంతే. అక్కడక్కడా రాసినా వెలుగులోకి రానీయలేదు. బండారు అచ్చమాంబ కథలు, సురవరం కవిత్వం, సురమౌళి కథలు, సుషుప్తి మాదిరెడ్డి నవల, ఇందుమతి కవిత్వం, తెలంగాణ విస్మృత వీరుడు కేవల్ కిషన్… తెలంగాణ చారిత్రక పత్రాలు.. ఇలాఎన్నింటినో పరిశోధించాడు. ఎన్నో గ్రంథాలను వెలుగులోకి తెచ్చారుసంగిశెట్టి శ్రీనివాస్. కాలాన్ని బోనులో నిలబెట్టిన సంగిశెట్టి చారిత్రక సమగ్ర పరిశోధన చేశారు. ఆ పుస్తకమే ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’.
ప్రతి ఇంటా ఉండాల్సిన పుస్తకం ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’. ఈ పుస్తకాన్ని మునివేళ్లతో పట్టుకొని చూడండి మన తాతలు, మన ముత్తాతలెందరో చరిత్ర మరుగున మట్టిలో కప్పేయబడ్డారనే విషయం అవగతమవుతుంది. ఏ మనువాదులు వాళ్లను అణగదొక్కారు? ఏ ఆధిపత్యవాదులు వాళ్లను హత్యచేశారు? వాళ్లు వీరులుగా కాకుండా కులవాదులుగా, అంటరానివారుగా ఎలా ముద్రవేయబడ్డారు, వెలివేయబడ్డారు? అలా అగ్రకుల సమాజం వెలేసిన విస్మృతుల చరిత్రనే విజయ గీతికగా, వీరచరిత్రగా ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’ పుస్తకం మనకు కనిపిస్తుంది.
మనకు తెలియకుండానే మన మీద పసరు రుద్దినటువంటి ఒక నిచ్చెనమెట్ల కులవ్యవస్థ భావజాలానికి మనం బానిసలుగా ఉన్నాం. అదీ స్వతంత్రంగా, బలవంతంగా. రెండూ మన ముందున్నవి. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవడమే మనందరి కర్తవ్యం.
మన పూర్వికులే ఈ ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’లో హీరోలు. నేలమాళిగలలో ఇంకిపోయిన దళిత సామాజిక సాంస్కృతికతను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నమే ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’. మూలాలను లోతుగా పరిశోధిస్తూ, విశ్లేషిస్తూ ఇప్పటికే ఎందరో చరిత్రలో సామాజిక వీరవనితల వీరులపై కప్పబడిన బూజును దులిపారు సంగిశెట్టి. కట్టివేయబడిన ప్రాచీన తాళకట్టలను విప్పారు. బందీకాబడ్డ చరిత్రకెక్కదగ్గ వారందరినీ చరిత్ర శిఖరాగ్రాన నిలబెట్టేందుకు సంగిశెట్టి కృషిచేశారు.
తెలంగాణ అస్తిత్వానికి పట్టం గట్టిన ఈ ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’ విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ‘అన్నీ మేమే కనిపెట్టాం అన్నింటికీ మేమే ముగ్గు పోశాం’ అని చెప్పుకొనే వాళ్లందరూ ఈ పుస్తకాన్ని పరిపూర్ణంగా చదువాలి.
ఈ పుస్తకంలో ప్రధానంగా ఆధునిక కాలం నుంచి తెలంగాణ సమాజంలో దళిత సమాజం ఎదిగి వచ్చిన తీరు చెప్పడమైంది. దళితులు క్రీడలు, జర్నలిజం, విద్య, వ్యాపారరంగాల్లో ఎదిగొచ్చిన తీరు, అందుకు వారు ఎదుర్కొన్న అవరోధాలు, వాటిని అధిగమించడంలో చూపిన ఓర్పు కూడా పూసగుచ్చినట్టు చర్చించారు సంగిశెట్టి.
హైదరాబాద్ నుంచి వలసపోయి విఖ్యాతులుగా వివిధ రంగాల్లో తెలంగాణ కేతనాన్ని దేశ విదేశాల్లో ఎగరేసిన న్యాయమూర్తి, పార్లమెంటేరియన్ రాజారామ్ భోలే గురించి, హెచ్.కె.ఆరా, కుమారిల స్వామి లాంటి అంతర్జాతీయ పెయింటర్ల గురించి, బొంబాయి చిత్రసీమలో సంగీతంలో తనదంటూ ముద్రవేసిన శంకర్ జీ గురించి ఇందులో రాశారు. యక్షగానాన్ని చిరస్మరణీయం చేసిన చిందు ఎల్లమ్మ గురించి కూడా ఈ పుస్తకంలో ఉండటం ముదావహం. చరిత్రకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే స్ఫూర్తి ప్రదాతల గురించి రాయడం గొప్ప స్ఫూర్తిగా ఉన్నది.
హైదరాబాద్ రాజ్య దళిత సమాజంపై అంబేద్కర్ ప్రభావం, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా దళితులు ఎదిగి వచ్చినతీరు, నిజాం ప్రభుత్వంలో దళిత ప్రాతినిధ్యం, బ్రిటిష్ వారి చేయూతను ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ దళిత చైతన్యాన్ని, చరిత్రను రాసిపోసిన కల్లం ఈ పుస్తకం. సమస్త వికాస చరిత్రనంత రాసులుగా పోసి, చదువుకోవడానికి వీలుగా ఉన్న అత్యుత్తమ సమగ్ర గ్రంథమే ఈ తెలంగాణ దళితోద్యమ చరిత్ర.
– వనపట్ల సుబ్బయ్య 94927 65358