కుంపటి అనే దీర్ఘకవితతో ఆలోచనల అగ్నిజ్వాలను వెలిగించిన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు, తన తాజా కవితాసంపుటి ‘రాత్రి సింఫని‘ తో భావప్రపంచానికి మరో కొత్త దిశను చూపించారు. ఈ సంపుటి అక్షరాల్ని కేవలం పంక్తులకే పరిమితం చేయకుండా, అవి చేరగల లోతుల్ని కొత్తగా నిర్వచించిన వర్ణనాతీత కవితా అనుభూతిగా నిలుస్తుంది. ఈ సంపుటిలోని కవితలు ఒక్కో పాదంగా మనసులోకి జారిపోతున్నప్పుడు, లోతైన
నిశ్శబ్దాల్లో దాచుకున్న వేదనను సున్నితంగా కదిలిస్తూ పైకి తెస్తాయి.
వ్యూహగామి అనే కవితలో జీవితం ముళ్లపాన్పయినప్పుడు ఓడిపోయిన ఆటల ఆలోచనే వద్దు ఈ పాదంతో వ్యూహగామి కవిత ముందుకు సాగుతుంది. వెనుదిరుగుదల కాదు, నేర్చుకోవడమే జీవనపాఠం అని కవి స్పష్టం చేస్తాడు.
రాత్రిసింఫని అనే కవితలో ఆ గది గూటిలో అలసిపోయి హాయిగా నిదురిస్తున్న చిన్నిపక్షులు అనే పాదం రాత్రిని ఒక మృదువైన ఆశ్రయంగా చిత్రిస్తుంది. ఇదే సమయంలో, దూరంగా ఓ ఆగంతకుడి ప్రవేశాన్ని పసిగట్టి, నిదురించే కాలనీని నిద్రలేపుతున్న వీధికుక్కలు అనే వాక్యం రాత్రి ఆత్మలో దాగి ఉన్న అప్రమత్తతను వెలిగిస్తుంది.
కవిలోని అంతర్ముఖ స్వరం నిద్రపట్టని నా మనసును మెలిపెడుతూ అనే పంక్తిలో స్పష్టమై, రాత్రి నిశ్శబ్ధం మనసును ఎలా కదిలిస్తుందో చెప్తుంది. చివరకు దట్టమైన చీకటి పలచబడినట్టు తూర్పున వెలుగుమొగ్గలు విచ్చుకుంటున్న అనే పాదంతో రాత్రి సంగీ తం ఉదయపు ప్రశాంతలో కలుస్తుంది. రాత్రి సింఫని చీకటి, నిశ్శబ్దం, అప్రమత్తత, అంతర్మథనం, ఉదయం అన్నింటినీ ఒకే స్వరపేటికలో కుదించి వినిపించే సున్నితమైన కవిత.
అమ్మను ఎవరు గుర్తు చేసినా
ఆమెతో వాళ్లకున్న అనుబంధాన్ని
ఎవరు తడిమినా..
నా కళ్లుకురిసేవి కన్నీళ్లు కాదు
అమ్మ నాతో పంచుకున్న గతకాలపు
నైరాశ్యపు జీవితశకలాలు
నా మనోమైదానంలో ఆవిరైపోని తీపిచేదు
అనుభూతుల మంచు బిందువులు
ఎప్పటికీ చెక్కిలిలోకి
ఇంకని ప్రేమసింధువులు
అమ్మను ఎవరు గుర్తు చేసినా ఆమెతో వాళ్లకున్న అనుబంధాన్ని ఎవరు తడిమినా ఈ పాదం మొదలయ్యే క్షణంలోనే కవితలో ఒక నిశ్శబ్ధ అలజడి ఎగసి వస్తుంది. ఇది సామాన్యమైన జ్ఞాపకోద్వేగం కాదు. లోలోపలి అగాధం మెల్లగా పైకి ఎగసే క్షణం.సంజీవనిలాంటి పాదం కవిత మొత్తం మీద ఒక వాక్యం మనిషి జీవితంలో వెలిగించే శక్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. కవి ఒక్క వాక్యం చాలు నీలో నిద్రాణమై ఉన్న నిన్ను నిప్పురవ్వను చేసేందుకు అని చెప్పినపుడే పాఠకుడు అక్షరాల సంజీవని శక్తిని గ్రహిస్తాడు. అలాగే జ్ఞాపకాల తేనెతుట్టెలో దాగిన తీయని అనుభూతుల్ని తట్టిలేపి&, మీ ఊరి వాగులో ఈతకొట్టి, బాల్యస్మృతుల్ని తిరిగివ్వడానికి సాంద్రమైన అక్షరం, తన కన్నీళ్లతో తుడుస్తున్న అమ్మ ప్రేమ వంటి పాదాలు జ్ఞాపకాలు, ప్రేమ, బాల్యం ఇవన్నీ ఒక్క వాక్యం స్పర్శతో పునర్జీవం పొందగలవని చూపిస్తాయి. కవి అక్షరానికి దిశాదర్శి శక్తిని ఇస్తూ నువ్వు నడిచిన దారుల్ని రహదారుల్ని చేసి నీ భవిష్యత్తు గమనాన్ని మళ్లించే జీవమున్నొక్క వాక్యం అని చెప్తారు. చివరగా చరిత్ర పుటల్లో నీ పేరు శిలాక్షరమయ్యే సంజీవనిలాంటి ఒక్క కవిత్వ పాదం చాలు అనే పాదం ద్వారా వాక్యం వ్యక్తిగత జీవితానికే కాదు చరిత్రకూ వెలుగు నింపగలదని కవి ప్రతిపాదిస్తారు. మొత్తం మీద ఈ కవితపాదాలలో అక్షర శక్తిని జీవితం, జ్ఞాపకం, ప్రేమ, భవిష్యత్తు అన్నింటినీ సంజీవినిచేసే శక్తిగా చిత్రించే సున్నితమైన, లోతైన కవితగా మనకు కనబడుతుంది.
రాత్రి సింఫని కేవలం భావోద్వేగాలతో నిండిన కవితాసంపుటి కాదు, మనిషి లోపల ఏం జరుగుతుందో సుతిమెత్తగా చెప్పే అక్షరాల ప్రయాణం. ప్రతి కవిత కూడా పాఠకుడిని తనలోని భావాలు, అనుభూతులు, లోతుల్లో దాగిన జ్ఞాపకాలను మరోసారి గుర్తుకుతెచ్చుకునేలా చేస్తుంది. జీవితాన్ని నిశ్శబ్దంగా గమనించే వారికి, తమలోని భావాల్ని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యే ఒక అందమైన కవితాసంపుటి. అందమైన కవిత సంపుటిని అందించిన బాణాల శ్రీనివాసరావు గారిని అభినందనలు.
-గాజోజి శ్రీనివాస్
9948483560