కవిత్వం భావాల ప్రవాహం. మనిషి చేసే కళాత్మక వ్యక్తీకరణ. అంతేకాదు, కవిత్వం మనసు పలికే స్వరం. అది హృదయానికి దారిచూపే వెలుగు. ప్రభావవంతమైన కవితని ఎవరైనా అనేక పంక్తుల్లో రాయొచ్చు, లేదా కొన్ని పంక్తుల్లోనే పలకవచ్చు. నిజానికి కవిత అయినా, వచనమైనా సంక్లిష్టంగా రాయడమే సులభం, సరళంగా రాయడమే కష్టం. అట్లాగే ఒక కవితను సుదీర్ఘంగా రాయడం సులభం. అందులో కవికి గొప్ప సౌకర్యం ఉంది. అనేక పదచిత్రాలు, సాహిత్య కళా సాధనాలు ఉపయోగించి తమ భావాలను, చెప్పదలచుకున్న విషయాలను విస్తృతంగా రాసే వీలుంది.
కానీ, చిన్న కవితలో పరిమిత పంక్తుల్లో అపరిమిత భావాన్ని వ్యక్తం చేయాలి. అది నేరుగా చదువరి హృదయాన్ని తాకాలి. అందుకే చిన్న కవితలు రాయడానికి ఉద్వేగం, స్పష్టత, సంక్షిప్తత అవసరమవుతాయి. అయితే చిన్న లేదా లఘు కవితలకు కొద్ది పదాల్లోనే విశాలమైన ప్రపంచాన్ని మోసుకుపోయే శక్తి ఉంది. చిన్న కవితలు రూపంలో చిన్నవే అయినా, వాటి ప్రభావం అమితమైనది. చిన్న కవితే పాఠకుల హృదయాలను ఎక్కువ గాఢంగా తాకుతుంది. నిజానికి ఒక చిన్న కవితలో జీవితాన్ని తిరగరాయవచ్చు.
ఇవ్వాళ్టి వర్తమాన కాలం అంతా వేగం ఆవరించి ఉంది. చదవడమే అరుదైన ఈనాటి ఆధునిక తరం సుదీర్ఘమైన దేన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా లేదు. ప్రతిదీ క్షణాల్లో అయిపోవాలి. ఇది ప్రధానంగా రీల్స్ యుగం. అంతా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల కాలం. ఇలాంటి పరిస్థితుల్లో కవిత్వంలో దీర్ఘ కవితల కంటే చిన్న కవితలకే ఎక్కువ ఆదరణ కనిపిస్తుంది. దానికి ఇంగ్లీష్‌లో MILK AND HONEY లాంటి కవిత్వానికి రూపి కౌర్ అందుకున్న ఆదరణే గొప్ప ఉదాహరణ. అందుకే దీర్ఘ కవితలతోపాటు తెలుగులో చిన్న కవితలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది.
చిన్న కవితలను చూస్తే చిన్నవిగా అనిపించవచ్చు. కానీ, అవి మనల్ని ఆలోచింపజేసే గొప్ప శక్తివంతమైన కళారూపాలు. చిన్న కవితలు చదివేందుకు కాలాన్ని తక్కువగా తీసుకున్నప్పటికీ, జీవితాన్ని లోతుగా ప్రభావితం చేస్తాయి. కవిత్వం రాయడాన్ని నేర్చుకునేవారు చిన్న కవితల ద్వారా పద ప్రయోగంలో నైపుణ్యం సాధించవచ్చు. చిన్నదే కానీ మహత్కార్యాన్ని సాధించగలిగే ప్రక్రియ చిన్న కవిత్వం.
చిన్న కవితల్లో ‘రూపమే’ దాని నిర్మాణ విధానం. కవి ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఎంపిక చేయాలి. పదాలు తక్కువగా ఉండటం వల్ల ప్రతీ పదానికి చాలా ప్రా ధాన్యం ఉంటుంది. చిన్న కవితల ప్రధాన లక్షణం సంక్షిప్తత. అవి చిన్న పరిమాణంలో ఉండటం. ఇక మరో ముఖ్యమైన లక్షణం ఇందులోని కచ్చితత్వం. పదాలు అవసరమైనంత మేర మాత్రమే ఉండాలి. అంటే అనవసరమైన మాటలు, పదాలు ఉండకూడదన్నమాట. చిన్న కవితల్లో లయ కూడా ఒక లక్షణమే కానీ, అన్నింటిలో ఈ లక్షణం కనిపించదు. చిన్న కవితల్లో మరో ముఖ్యమైన లక్షణం అందులోని శబ్ద సౌందర్యం. చిన్న కవితల్లోని పదాల్లో సంగీతత్వం, ఒత్తులు, ధ్వనుల సౌందర్యం ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి.
ఇక విభిన్నమైన చిన్న కవితల్లో విషయ వస్తువు గురించి పరిశీలిస్తే వాటిల్లో సాధారణంగా ఒకే భావన, ఒకే దృశ్యం లేదా అనుభూతి ఆవిష్కృతమవుతుంది. వాటిలో కేంద్రీకృత భావం కనిపిస్తుంది. ఒకే విషయం కేంద్రీకృతంగా ఉంటుంది. ఈ కవితలు విషయాలను పూర్తిగా వివరించవు, సంకేతంగా మాత్రమే చెబుతాయి. వీటిలోని సూచనాత్మకత చదువరిని ఆలోచింపజేస్తుంది.
చిన్న కవితల్లో ప్రకృతి, సంఘటనల ద్వారా లోతైన భావాలు ప్రకటితమవుతాయి. కవితా వస్తువు ప్రతీకాత్మకంగా సూచించబడతాయి. వాటిని చదివిన తర్వాత పాఠకుడే దాని అర్థాన్ని అనుభూతి చెందేలా చేస్తాయి. అవి పాఠకుల్లో ఆలోచనకు గొప్ప అవకాశమిస్తాయి. సాధారణంగా చిన్న కవితల్లో ప్రకృతి, ప్రేమ, నష్టం, కాల ప్రభావం, జీవితం, ఆత్మ పరిశీలన లాంటి అంశాలు ప్రముఖంగా కనిపిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కవులు చిన్న కవితలను పలు రూపాల్లో రాశారు. అవి ప్రధానంగా..
జపాన్ దేశానికి చెందిన హైకూ (Haiku). ఈ రూపం మూడు పంక్తులతో ఉంటుంది. ఒక మాటని ఎన్ని భాగాలుగా పలికితే సరిపోతుందో, అందులోని ప్రతి భాగం ఒక సిల్లబుల్. హైకూలో సిల్లబుల్స్ 5-7-5 తరహాలో ఉంటాయి. రూపంలో చిన్నదైనా, ప్రకృతి, క్షణకాలపు దృశ్యాలు, భావాల్ని సున్నిత హృదయంతో హైకూ పలికిస్తుంది.
వసంత సాగరం
పాటిపాటీ నిస్సంగం
తేలికైన అలలు
(యోసా బుసోన్).
కప్లెట్ (Couplet)
అనేది రెండు పంక్తులు కలిసిన చిన్న కవిత. సాధారణంగా పంక్తులు రెండూ పరస్పరం అనుసంధానమవుతూ ఉంటాయి.
ఉదాహరణ :
‘గాయాలూ జ్ఞాపకాలూ
తడి తడి గానే ఉంటాయి, ఎప్పటికైనా
గాయాలు మానిపోతాయి,
జ్ఞాపకాలే మిగిలిపోతాయి’
‘నా లోపల మూడేసి
సముద్రాలు కళ్లల్లోంచి కురిసేవి రెండు
గుండెల్లో గుడిసేసుకున్నది ఒకటి’
(ముక్తకాలు).
టాంకా (Tanka) ఇది హైకూకి మరింత పొడవైన రూపం. ఐదు పంక్తులు 5-7-5-7-7 సిల్లబుల్స్గా ఉంటుంది. ఈ టాంకాలో భావవ్యాప్తి ఎక్కువ. ఇక మూడు పంక్తుల్లో రాసే చిన్న కవిత ‘త్రివేణి’. త్రివేణి సంగమంలో గంగా యమునలు మొదటి రెండు పాదాలు కాగా, సరస్వతిలా మూడో పంక్తి ఉంటుంది.
ఉదా: ‘ఎవరో తలుపు తట్టిన చప్పుడు
ఇంటి తలుపా
గుండె తలుపా’
++
‘ఆమె కంటి నిండా ఎదురు చూపులు
పోస్ట్ మ్యాన్ కోసమో
ప్రేమ లేఖ కోసమో’
+++
‘నాకు రెండు హృదయాలు కావాలి
ఒకటి ప్రేమను పంచడానికి
మరోటి దుఖాన్ని దాచడానికి’ (త్రివేణి)
ఎపిగ్రామ్ (Epigram) అనేది చిన్నదైన, సుతిమెత్తని వ్యంగ్య భావం కలిగిన కవిత. ఈ రకమైన చిన్న కవితల్లో తక్కువ పదాల్లో గొప్ప చమత్కారం వ్యక్తమవుతుంది. ఫ్రీ వర్స్ (Free Verse) వచన కవితగా పిలిచే ఈ రూపం నిబంధనలకు అతీతంగా, స్వేచ్ఛగా రచించిన చిన్న కవితలు.
ఇలా చిన్న లఘు కవితలు చూస్తే అవి చిన్నవిగానే అనిపిస్తాయి. కానీ, ఆలోచింపజేసే గొప్ప శక్తివంతమైన కవితా రూపాలు. చిన్న కవితలు కాలాన్ని తక్కువగా తీసుకున్నప్పటికీ, జీవితాన్ని లోతుగా ప్రభావితం చేస్తాయి. కవిత్వం రాయడం నేర్చుకునే ఇప్పటి తరం చిన్న కవితల ద్వారా పద ప్రయోగంలో నైపుణ్యం సాధించవచ్చు. తమలో ఉవ్వెత్తున ఎగిసిన భావాల్ని ఈ చిన్న రూపంలో వ్యక్తం చేయవచ్చు. ఈ ప్రక్రియలో రాయడానికి తమలో కలిగే అనుభూతులను, తమ అనుభవాలను సంక్షిప్తంగా, సూటిగా మనసుకు హత్తుకునే విధంగా రాయవచ్చు. ముఖ్యంగా యువత ఈ ప్రక్రియలో కృషి చేయాలని, చదువరులను చేరాలని కోరుకుంటున్నాను.