పైన పచ్చని రాపర్
లోన బంగరు పంక్తుల కవిత్వం
మొక్కజొన్న పెరడు
కంకుల రూపంలో
కనువిందు చేసే
కవనాన్ని పండిస్తోంది
మీద బంగారు పూత
లోపల తళుక్కుమనే
వెండి అక్షరం
వరిపొలం గెలల రూపంలో
కడుపుకు విందు చేసే
కవిత్వాన్ని అందిస్తోంది
గుండ్రని తెలిముత్యాల్లాంటి
బీజాక్షరాలు
పసుపు పచ్చని లేదా
ఎర్రని ఓనమాలు
జొన్న చేను ఎత్తిన పిడికిళ్ళతో
తలమానికమైన కంకుల
కవితలు రచిస్తోంది
ఇన్ని కవిత్వ సంపుటులకు,
సంకలనాలకు
సంపాదకత్వం వహిస్తూ
ఈ కర్కశ వ్యవస్థలో
కనీస మార్కెట్ కూడా లేని
కర్షక పాదాలకు
ఇది నా కన్నీటి సమీక్ష
– నలిమెల భాస్కర్