ఉదయం ఉగాదిని ప్రసవిస్తోంది
కోయిల వసంతాన్ని ప్రకటిస్తోంది
మీరేంటి భీరువులై రేయి కవచంలో
దాక్కుంటున్నారు?
మీ కలలకు కారాగారాలు బద్దలుకొట్టి
తలుపులు తెరుస్తున్నాం!
మీ కలతలకు కన్నీళ్లు జల్లెడపట్టి
పిడికిళ్ళు మొలుస్తున్నాం!!
ఆ నదీ తీరాల్లో,ఆ వ్యవసాయ భూముల్లో
కాదు నాగరికత పురుడుపోసుకుంది,
మీ ఉక్కు సంకల్పంలో
మీ యుద్ధ నేపథ్యంలో!!
మీరు నడిచే కర్మాగారాలు
మీ కదలిక హిమానీనదాలు
మీ కేక నినాదాల బాకా
మీరు గోడల్లోంచి సమాధుల్లోంచి
పెళ్ళగించుకొని రండి
మీరు జయించేందుకు జగత్తు వుంది
మీరు గమించేందుకు సత్తువ వుంది
కలాలకు కవాతు నేర్పితే
కత్తుల్ని పొదుగుతుంది కలకు కర్తవ్యం చూపితే శిఖరమంత ఎదుగుతుంది
ఇక్కడ శిథిల శాఖా పత్రాలు కాదు
కొత్త వసంతపు చివుళ్ళు వేయాలి
భూలోకం పచ్చగా వెచ్చగా నవ్వాలి
ఓ వీరుడా!
నువ్వధిరోహించిన ఆ అశ్వం
మళ్లీ యాగం చేయాలి
నువ్వనుభవించిన వైభవం
మళ్లీ ఉదయం చూడాలి
రా!ఎడారుల్ని ఎదల్లోంచి తుడిచేందుకు
రా!సముద్రాల్ని పంట కాలువల్లోకి
పిలిచేందుకు
మరో కొత్త ఆశలు మొలిచేందుకు!!
-దండమూడి శ్రీచరణ్
98661 88266