ఆధునిక కాలంలో వెలువడుతున్న మెజారిటీ సాహిత్యం పాఠకుల్లో ఎలాంటి నొప్పిని కలిగించడం లేదు. ఈ సాహిత్యం ఉద్యమాలను, ఉద్యమకారులను ప్రభావితం చేయలేకపోతున్నది. వితంతు వ్యవస్థ సంస్కరణోద్యమం ఇందుకు మినహాయింపు కాదు. అందుకే వితంతువుల పట్ల సంవేదన, సంయోజన, సానుభూతి, సంఘీభావం కొరవడుతున్నది. ఈ విషయాలు చరిత్రలో, వర్తమానంలో ఎట్లా రికార్డయ్యాయి? సమాజంలో, సాహిత్యంలో దాని ప్రతిఫలనాలు ఎట్లా ఉన్నాయి? అని విశ్లేషించి వివరించే గ్రంథమే ‘భారతదేశంలో వితంతు వ్యవస్థ’. అనిశెట్టి రజిత ప్రధాన సంపాదకులుగా వెలువడిన ఈ గ్రంథంలో సామాజిక, సాహిత్య వ్యాసాలు, వ్యక్తిత్వాలు, కథనాలు వెలువడ్డాయి.
‘తెలుగు సాహిత్యంలో వితంతు పునర్వివాహాలు మహిళా ఉద్యమాలు ఒక సమీక్ష’ పేరిట డాక్టర్ విజయచంద్ర తెన్నేటి రాసిన వ్యాసంలో పుష్కరాల సమయంలో వితంతు స్త్రీలు ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రోత్సహించే విధంగా ఆ చావులకు ‘పవిత్రత’ను ఆపాదించేవారని రాశారు. అంటే ఇది మరో రకంగా ‘సతి’ ప్రథను ప్రోత్సహించడమే అని గుర్తించాలి. శిరోముండనం, ఏకభుక్తం, అమాంగల్యం, కులాంగనలు పేరిట వితంతువులకు గౌరవప్రదమైన జీవితాన్ని నిరాకరించడాన్ని చర్చించారు. అయితే ఈ వ్యాసంలో ఉప్పులూరి నాగరత్నమ్మను పునర్వివాహం చేసుకోవడానికి కందుకూరి వీరేశలింగం సహకరించారని రాశారు. అదే సమయంలో దేవదాసీ అయిన బెంగళూరు నాగరత్నమ్మను ఆమె సంగీత, సాహిత్య సేవను కందుకూరి తూలనాడిన విషయం కూడా అందరికీ తెలియాలి.
అప్పుడే వీరేశలింగం లాంటి ‘సంఘ సంస్కర్తల’ స్త్రీ సానుభూతి ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి, మిగతావారితో పోల్చి బేరీజు వేసుకోవడానికి తోడ్పడుతుంది. ఈ వ్యాసంలో రచయిత్రులు పులుగుర్త లక్ష్మీనరసమాంబ, మొసలికంటి రమాబాయమ్మ, బుచ్చి బంగారమ్మ, సరస్వతి, పులవర్తి కమలాదేవి తదితరుల రచనలను ఉటంకిస్తూ సాహితీ విలువను జోడించారు. అట్లాగే సంకలన సంపాదకులు కొమర్రాజు రామలక్ష్మి, సోమంచి శ్రీదేవి రాసిన ‘సంగమం’ నవలను ఇందులో విశ్లేషిస్తూ సంస్కృతి, సంప్రదాయం పేరిట వితంతువుల ఆత్మగౌరవాన్ని ఎట్లా దెబ్బతీసిండ్రో చెప్పిండ్రు.
మరో సంపాదకురాలు తమ్మెర రాధిక ‘శ్రీపాద కథల్లో వితంతువులు’ అనే అంశాన్ని విషయాన్ని చర్చించారు. వీళ్లేగాకుండా తెలుగు మహిళా విమర్శకుల మీద విలువైన పుస్తకాన్ని పరిశోధించి గతంలో వెలువరించిన దివంగత కందాల శోభారాణి గురజాడ, కందుకూరి చిత్రించిన వితంతు సమస్యలు, చలం సాహిత్యంలో వితంతు సమస్య గురించి తిరునగరి దేవకీదేవి, కొ.కు. కథల్లోని వితంతు పాత్రల గురించి కె.ఎన్.మల్లీశ్వరి తదితరులు రాసిండ్రు. అట్లాగే సామాజిక వ్యాసాల విభాగంలో ‘కులమూ, జెండర్ సంబంధంతో ఉంటూ, కులాల సరిహద్దులను కాపాడేందుకు ప్రధానంగా స్త్రీలపై ఆధారపడే ఒక నిర్మాణానికి సంబంధించిన నిబంధనల సమాహారమే ‘బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థ’ అంటూ నిర్వచించిన ఉమాచక్రవర్తి వ్యాసం ఇందులో ఉన్నది. వేదకాలంలో లేని వివక్ష ఆ తర్వాతి కాలంలో ఎట్లా, ఎందుకు వచ్చిందో ఇందులో వివరించారు. ఈ వ్యాసాన్ని తెన్నేటి విజయచంద్ర తెలుగులోకి తెచ్చారు.
వితంతు సమస్యపై సంస్కరణోద్యమ కాలపు మహిళల అవగాహనను కాత్యాయని విద్మహే అక్షరబద్ధం చేశారు. ఆమె తన వ్యాసంలో ఫూలే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, సామినేని ముద్దునరసింహం నాయుడు, వీరేశలింగం, దామెర్ల సీతమ్మ, జూలూరు తులశమ్మ తదితరుల రచనల ఆసరాగా ఆనాటి స్త్రీల చైతన్యాన్ని, వితంతువుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా చేసిన రచనలను సమగ్రంగా విశ్లేషించారు. పుస్తకంలోని మొదటి మూడు వ్యాసాలు అనిశెట్టి రజిత రాశారు. ఇక్కడే మహారాష్ట్రలో ‘విద్యాదేవి’గా కొలువబడ్డ సావిత్రీబాయి రోడే, స్త్రీ, పురుష తులనాత్మక రచన చేసిన తారాబాయి షిండే, తెలంగాణలో సంగెం లక్ష్మీబాయమ్మ తదితరుల గురించి కూడా ఇందులో చేర్చితే బాగుండేది. ‘కథనాలు’ శీర్షికన వెలువడిన రచనల్లో సమాజంలోని అన్నివర్గాల వారి మహిళల వెతలు రికార్డయ్యాయి.
వితంతువు అంటే ఒకప్పుడు బాల్య వివాహం చేసుకున్న బ్రాహ్మణ స్త్రీల సమస్యగానే ఉండేది. ఇప్పుడది బహుజన స్త్రీల సమస్యగా మారింది. విద్యావకాశాలు పెరిగి బ్రాహ్మణ స్త్రీలలో బాల్యవివాహాలు రద్దయ్యాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆ కులాల్లో వితంతు వ్యవస్థ సమస్య కాకుండాపోయింది. అయితే మద్యపాన సేవనం, హజార్డస్ ఉద్యోగాలు కూడా బహుజనుల్లో ముఖ్యంగా నిరక్షరాస్యులు వితంతవులుగా మారడానికి హేతువులవుతున్నాయి. వీటన్నింటిని పట్టించుకొని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ఈ గ్రంథం కరదీపిక లాగా ఉంటుంది. సమాజం పట్ల కన్సర్న్ ఉన్న అందరూ చదవాల్సిన గ్రంథం ఇది.
-డాక్టర్ సంగిశెట్టి
శ్రీనివాస్