ఒంటరి చినుకు
ఎన్నిసార్లు కురిసినా
ఉనికిని కోల్పోవలసిందే!
ఏకధాటిగా నాలుగు చినుకులు నేల రాలందే
ప్రవాహం నేత్రపర్వం కాదు
ఏక కాలంలో చెట్లన్నీ చిగురించందే
వసంతం కనువిందు చేయదు!
ఆకులందున అణగిమణగిన
కోయిలమ్మలు స్వరవీణల్ని సరి చేయందే
ఉగాదుల ఉషస్సులు వెల్లువెత్తవు!
ఒంటి చేతులతో చప్పట్లు
ఎవరికీ సాధ్యం కావు!
కలిసి పాదాలు కదం తొక్కందే
గమ్యం విముక్తి గీతాలల్లుకోదు
యుద్ధాలు ఎవరికీ కొత్త కాదు
జీవన సంఘర్షణలో భాగాలే!
కనిపించని క్రిమి ఒకటి
మానవ సంహారానికి పూనుకున్నప్పుడు
లోకం ఏకమై మట్టి కరిపించింది కదా!
శత్రువులు బయటి వాళ్ళనే భ్రమల్లో ఉండొద్దు
ఎన్నికల కాలంలో గుమ్మం తొక్కే
బహురూపుల బండారాన్ని బయట పెట్టాలి
దాడి చేసేవాడెప్పుడు
దూకుడే ప్రదర్శిస్తాడు భయపడరాదు
యుద్ధం చేసే వాడికి సహనం ఉండాలి!
నాలుగడుగులు వెనక్కి వేస్తే
ఓడినట్లేం కాదు
పొంచి ఉండటం
ప్రమాదాలను పసిగట్టడానికే!
కలిసి ఉండటాన్ని
కలబోతల్ని నమ్ముకున్న వాళ్ళం
విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టినా
సమూహ శక్తితో ఎదుర్కోవలసిందే!!
కోట్ల ,వెంకటేశ్వర రెడ్డి
94402 33261