మరుగున పడుతున్న మానవీయ విలువలను బలంగా తట్టిలేపే కథలతో ఇటీవల వెలువడ్డ కథాసంపుటి ‘వారధి’. రచయిత కటుకోజ్వల మనోహరాచారి హృదయ మార్దవం కలిగించే కథలు రాయగల చేయి తిరిగిన కథా రచయిత అని నిరూపించే కథాసంపుటి ఇది.
‘వారధి’ సంపుటిలోని కథలు.. ఆ కథల్లోని సన్నివేశాలు, సంఘటనలు మానవీయ పరిమళాలను వెదజల్లుతూ, పాఠకుని హృదయ లోతుల్లోకి వెళ్లి నిత్యం వెంటాడుతాయి. రచయిత ఇతర కథల్లాగే ఈ ‘వారధి’ సంపుటిలోని ప్రతి కథా సందేశాత్మకంగా కొనసాగింది. మానవీయ కోణాలను స్పృశిస్తూ, మానవ సంబంధాల లోతులను, మనిషి మూలాలను పట్టిచూపుతాయి. ఈ ‘వారధి’లో 15 కథలున్నాయి. అన్నీ వివిధ పత్రికల్లో ప్రచురితమైనవే కాకుండా పలు బహుమతులు కూడా అందుకొన్న కథలు. నిత్యం మన చుట్టుపక్కల కదలాడే వ్యక్తులే ఈ కథల్లో పాత్రలు కాగా రచయిత తాను చూసిన, అనుభవించిన పరిసర సన్నివేశాలు, సంఘటనలనే కథలుగా అల్లినట్టు పలు కథలు రుజువుచేస్తాయి.
‘పాత్రులు’, ‘అంగడి’, ‘ఆత్మ నివేదన’, ‘మనిషితనం’, ‘బెల్టుషాపు’, ‘బాసట’ వంటి కథల్లోని సంఘటనలు నిత్యం మనకు ప్రతిచోటా దర్శనమిస్తునే ఉంటాయి. ‘ఆప్తుడు’, ‘వెలుగు’, ‘సుపుత్రులు’, ‘బలిపిల్లలు’, ‘భాగ్యశ్రీ’ వంటి కథల్లోని సంఘటనలు అక్కడక్కడ జరిగినవే, జరుగుతున్నవే. రచయిత తను చూసిన సంఘటనలకే చిన్న చిన్న కల్పనలు జోడించి అద్భుతమైన ముగింపునిస్తూ ఈ కథలను రాశాడు.
చదువు చెప్పిన గురువు రుణాన్ని అవసరం వచ్చినపుడు ఎట్లా తీర్చుకోవాలో ‘ఆప్తుడు’, ‘సుపుత్రులు’ కథల్లో బలంగా చాటాడు. తల్లిదండ్రులు, పెద్దల పట్ల ఎంతటి ఆదరణ చూపాలో ‘ఆత్మనివేదన’, ‘కిరాయిబంధం’, ‘బాసట’ వంటి కథల్లో వ్యంగ్యంగా చెప్పాడు రచయిత. ‘భాగ్యశ్రీ’ వంటి పలు కథల్లో మానవ నైజం కనిపించగా ‘మనిషితనం’, ‘వెలుగు’, ‘ఆప్తుడు’ వంటి కథలు వ్యక్తిలోని కృతజ్ఞతా లక్షణాలను ప్రస్ఫుటం చేస్తాయి. ‘అపాత్రదానం’, ‘జాతర’ వంటి కథలు చక్కని సందేశాన్నిస్తాయి. ఆ మాటకొస్తే ఈ ‘వారధి’ సంపుటిలోని అన్ని కథలు ఏదో ఒక రూపంలో సందేశాన్నో, సమస్యకు చక్కని పరిష్కారాన్నో సూచిస్తూ ముగుస్తాయి.
పాఠకులను అక్షరాల వెంట పరిగెత్తించే శిల్ప నైపుణ్యం కూడా ప్రతి కథలో దర్శనమిస్తుంది. అనుబంధాలు, ఆప్యాయతలు, మానవత్వం ఇత్యాది మానవీయ గుణాలు కరువై మనిషి మరమనిషిగా మారిన నేటి తరుణంలో ఈ కథలు అనుబంధాల పందిరులు వేసి, ఆప్యాయతల పూలు పూయించి, మానవత్వపు సుమగంధాలను వ్యాపింపజేస్తూ కుటుంబ జీవన సౌందర్యపు ఫలాలను సమాజానికి అందించే వృక్షాలై కనబడుతాయి. మానవతా విలువలను మరిచి మనిషి తనకు తానే విస్మృతికి లోనవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ‘వారధి’ కథలు ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద ఔషధంగా పనిచేసి, హృదయ మార్దవం కలిగిన మనిషిగా మార్చగలవు. తెగిన బంధాలకు అనుబంధాల ముడులు వేసి మానవత్వపు వంతెనను నిర్మించగలవు. మొత్తంగా ‘వారధి’ కథలు నేటి సమాజానికి అత్యంత అవశ్యకం అని కథలు చదివిన ప్రతి పాఠకుడూ భావిస్తాడు.
-గాజుల రవీందర్
98482 55525