రాపోలు సీతారామరాజు రచించిన ‘నెల్సన్ మండేలా’ గ్రంథం తెలుగు సాహిత్యంలో అరుదైన జీవిత చరిత్రగా నిలుస్తుంది. రచయిత మండేలా జీవితాన్ని కథనం చేయడమే కాకుండా, ఆయన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, మానవీయత, తత్త్వబోధనలను ఎంతో లోతుగా విశ్లేషించారు. విశ్లేషణాత్మక దృక్పథం, తాత్త్విక ఆవిష్కరణ, స్ఫూర్తిదాయక సందర్భాల ఎంపిక రచయిత రాపోలును ఒక నిబద్ధత కలిగిన సాహిత్య దిట్టగా నిలబెడతాయని చెప్పవచ్చు.
సీతారామరాజు అధ్యయనా చాతుర్యం, పరిశోధనాత్మక నైపుణ్యానికి ప్రతీక ఈ అనువాదం. మండేలా స్వగ్రామం నుంచి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా జీవనయానాన్ని పాఠకుడి మనసులో పరవశంగా ప్రవహించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ఘట్టాలైన అణచివేత, జైలు జీవితం, సంఘర్షణలు, మానవీయత, ప్రజాస్వామిక విలువలపై దృష్టిసారించి, చరిత్రను నిస్పృహగా కాక, జీవంతో నింపుతూ వర్ణించారు. అంతేకాదు, నాయకత్వ మౌలిక లక్షణాలపై దృష్టిసారించే ఒక మానవతా సాహిత్య గ్రంథమిది. ఈ పుస్తకంలో రచయిత తన అంతర్దృష్టిని మేళవించారు.
మండేలా నాయకత్వం శూన్యంలోంచి రూపుదిద్దుకున్నది కాదు. అది అనుభవాల అల్లిక, ఆత్మస్ఫూర్తితో పెరిగిన దారి. ప్రజాభిప్రాయాలను గౌరవించే శక్తి, వినయంతో కూడిన దృఢత, ప్రశాంతత ఇవన్నీ అతని నాయకత్వ లక్షణాలుగా తీర్చిదిద్దాయని రచయిత వివరించారు. ముందుండి నడిపించే నాయకుడే కాదు, వెనుక నుంచి మార్గం చూపే మహోన్నతుడిగా మండేలాను అభివర్ణించారు. మండేలా వ్యక్తిత్వంలో క్షమాగుణం ప్రస్ఫుటంగా కనపడుతుంది. వేధించిన వారిని జైలు జీవితం తర్వాత కూడా క్షమించడం ఆయన లోపలి శాంతిని, లోతైన తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మండేలాలోని ఈ భావాన్ని రచయిత రాపోలు హృదయానికి హత్తుకునే భాషలో పాఠకుల
ముందుంచారు.
మండేలా రాజకీయ తత్వం, సమాజంలో సమానత్వం సాధించే ప్రయత్నంగా రచయిత విశ్లేషించారు. గాంధేయ తత్వానికి తన జీవితాన్ని అంకితం చేసినా, పరిస్థితుల చట్రం మారగానే మార్పు వైపు అడుగేసిన మండేలా నిర్ణయాన్ని రచయిత నిగూఢంగా అందించారు. ఆయుధ పోరాటం వైపు మొగ్గు చూపిన సమయంలోనూ ఆయన లక్ష్యం ప్రజల విముక్తి అని స్పష్టంగా తెలియజేస్తారు. మండేలా వ్యక్తిత్వం శ్రమ, త్యాగం, చింతనతో ముడిపడింది. మండేలా జీవితాన్ని వెలికితీసే విధానం, పాఠకునిలో విభిన్న ఆలోచనలు రేకెత్తిస్తుంది. శత్రువులను సైతం మిత్రులుగా మలచిన సామర్థ్యం, అతని ఆత్మగౌరవానికి నిదర్శనం. జైలు అనుభవాన్ని తపస్సుగా మార్చుకున్న మహోన్నత వ్యక్తిగా మండేలా ఈ రచనలో ఆవిష్కృతమవుతారు.
రాపోలు సీతారామరాజు శైలి సరళంగా ప్రస్ఫుటమైన భావనలతో నిండి ఉన్నది. ఆయన ఎంచుకున్న పదాలు, వాక్య నిర్మాణం, భావ ప్రకటన ఇవన్నీ గ్రంథానికి మరింత బలాన్నిచ్చాయి. ముఖ్యంగా మండేలా మాటలను విశ్లేషిస్తూ వాటికి జీవం పోశారు. ఈ పుస్తకం ఒక మహనీయుడి జీవితం అందించిన విలువల సందేశం. నాయకత్వానికి మార్గదర్శి, మానవతా దృక్కోణానికి దర్పణం, ప్రజాస్వామ్య భావనకు
బలమైన వేదిక. రాపోలు రచన, తెలుగులో జీవిత చరిత్ర రచనలకు ఓ కొత్త ఊపిరిగా నిలుస్తుంది. యువత ఈ గ్రంథాన్ని చదివి, స్ఫూర్తి పొందాలి.
– మంజుల కులకర్ణి