గత శతాబ్దానికి చెందిన పద్యకృతుల మార్తాండుడు రామసింహ కవి. గ్రామీణ, వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆనాటి పండితులకు దీటుగా శతకాలను, కీర్తనలను రచించి సాహితీపోషకులచే సత్కారాలు అందుకున్న ధీశాలి. ఆయన పద్య రచన, శిష్ట భాషా ప్రావీణ్యం, గ్రాంథిక వచనం, చక్కని వాక్య నిర్మాణం, వ్యక్తీకరణలో సూటిదనం రామసింహకవి సాహితీ ప్రతిభకు ప్రాకారంగా నిలుస్తాయి. జీవితపు చివరి రోజుల్లో రామసింహకవి తన ఆత్మకథ రచించి తన సాహితీ కీర్తి శిఖరాల పయనం వివరించకుంటే తెలుగు సాహిత్యం ఒక సమర్థ కవీంద్రుని సమాచారం కోల్పోయి ఉండేది. వేముల ప్రభాకర్ సంపాదకులుగా ‘రాఘవపట్నం రామసింహకవి ఆత్మకథ’ పేరుతో అది వెలువడింది.
సిక్కు మతస్థుడైన రామసింహకవి బాల్యం నుంచే హిందూ పురాణాలను, మహాభారత రామాయణాలు క్షుణ్ణంగా చదివి ఆకళింపు చేసుకొని కథాసారాలపై గట్టి పట్టు సాధించారు. ఆ జ్ఞానసంపద వల్లే జీవిత చరమాంకం వరకు ఎన్నో పద్యకృతులు, కీర్తనలు, నాటకాలు రచించి బహుగ్రంథకర్తగా నిలిచారు. ఆ రోజుల్లో సురవరం ప్రతాపరెడ్డి తెచ్చిన గోలకొండ కవుల సంచికలో వీరి విశ్వకర్మ అనే పద్యకవిత ప్రచురితమైంది. ‘ఆదరించినవారి కపకారమొనరించి / ప్రజ్ఞదెల్పుట మహాపాతకంబు’ అని ఆ కవిత మొదలవుతుంది.
జగిత్యాల సమీపంలోని రాఘవపట్నం అనే ఊరికి రామసింహకవి కుటుంబం తాతలనాడే వలస వచ్చింది. వారి పూర్వీకులను ఐదవ నిజాం శాంతిభద్రతలు, శిస్తు వసూళ్ల కోసం పంజాబ్ నుంచి హైదరాబాద్కు రప్పించారట. 1857లో జన్మించిన రామసింహ పిన్న వయస్సులోనే ఊర్లో ఆవుపై దాడి చేసిన పులిని చంపి ప్రజలచే ప్రశంసలు, ప్రభుత్వ అధికారిచే పది రూపాయల బహుమతి అందుకొని గుర్తింపు సంపాదించారు. అయితే ఎడ్ల కాపరుల మధ్య మొదలైన చిన్న వివాదం పెరిగి రామసింహ జీవితంలో తీరని వేదనను మిగిల్చింది. కత్తితో తనపై దాడికి వచ్చిన తోటి గ్రామస్తుడితో జరిగిన పోరులో రామసింహ స్వీయరక్షణార్థం కత్తిని ఆయనవైపు తిప్పడంతో ఆ వేటుకు ప్రత్యర్థి ప్రాణాలు పోయాయి. దీంతో రామసింహకవిని కోర్టు హంతకుడిగా నిర్ధారించింది. పరమ భక్తుడైన రామసింహకవి ఇదంతా ఈశ్వరేచ్ఛ అనుకొని 14 ఏండ్లు జైలు జీవితం అనుభవించారు.
జైలులో ఆయన పాడే కీర్తనలకు తోటి ఖైదీలు, జైలు సిబ్బంది ఆనందించి గౌరవించేవారు. తనకు ఇచ్చే వంట దినుసులను ప్రస్తావిస్తూ రామసింహ కవి – ‘విసిరిన మండని కట్టెలు – పిసికిన జిగటకురాని పిండి లభించెన్ / పొసగదిక బ్రతుకు ఛీ ఛీ – విసిగితి జీవితమికెట్లు విధినేమందున్’ అని కంద పద్యాన్ని రాసి తోటి ఖైదీలకు వినిపించారు. ఆ పద్యసారాంశం జైలు అధికారుల దాకా వెళ్ళింది. జైలు విధానాలను విమర్శించడం ఆ రోజుల్లో నేరం.
కొరడా దెబ్బలు తప్పవని అందరూ అనుకుంటుండగా పిలిపించిన జైలు అధికారి ఆయన పద్యాలకు ముగ్ధుడై కవికి ఇష్టమైన చక్కని భోజనాన్ని ఇవ్వమని ఆదేశించాడు. పద్యం ద్వారా రామసింహ కవి సాధించిన తొలి విజయమిది.
జైలు జీవితంలో రామసింహకవి రాసిన పద్యా లు రామదాసు రచనలను పోలినా రామసింహ తన పరిస్థితికి దైవాన్ని దూషించలేదు. ‘దోషినో నిర్దోషినో స్వతంత్రుడనో పరతంత్రుడనో / పోషితుండను నేను పోషకుడవీవు సవి / శేష దయతో రామసింహ కవిని భరించు’ అని మొర పెట్టుకున్నారు. ‘ఆశ్రిత రక్షకుడవుగావా నా చెర విడిపించగలేవా/కృతులతో నమస్కృతులతోను ప్రస్తుతి జేయుచు నమ్మితి నిను శ్రీహరి’ అంటూ వేడుకున్నారు. ‘నేను జేసిన పని నేరమైతే గాదు నీవెరుంగవా నేర / మైన నీవే భరింపనౌను నాకభయ వాక్యంబొసంగవా’ అని బాధ్యత దైవంపై వేశారు. ‘నేరస్తుడగాకుండుట / భారమైన జన్మ శిక్ష ప్రాప్తించుటయున్ / కారాగృహ బాధలబడి / ఈరీతిగా దూరి పరమ హీనుడనైతిన్’ అని తనను తాను నిందించుకున్నారు. చివరగా – ‘నేటికి నన్ను భరించితివీ నా నేరములన్ని క్షమించితివీ / నాటనుండి పదునాలుగేండ్లు వొకపూట / నొకయుగంబుగ గడిపితి హరి’ అని జైలు పద్యాలకు మంగళం పలికారు. ఆయన పేర్కొన్న ప్రకారం ఆయన జైలు జీవితం 1895 నుండి 1909 దాకా కొనసాగిందని తెలుస్తున్నది.
ఆ తర్వాత సొంత ఊరిలో వ్యవసాయం చేస్తూ నిరంతరంగా కృతుల రచన కొనసాగించారు. ఆయన రాసిన కృతులను విని సంతోషించి పోషకులు, పెత్తందార్లు, దొరలు రామసింహ కవికి సత్కారాలతో పాటు ‘రౌప్యములు’ అందించేవారు. యాగాలు, పండుగలకు గ్రామా ల్లో భజనలతో వేడుకలను జనరంజకం చేసేవారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఆయన విస్తారంగా గ్రామ సందర్శనలు చేశారు. రామసింహ కవి ఆత్మకథలో ఆయా పర్యాటక విశేషాల ప్రస్తావన ద్వారా ఆరోజుల్లో ఉన్న రవాణా వ్యవస్థ, పాత గ్రామాల పేర్లు, మనుషుల ప్రవర్తన, బాంధవ్యాలు మనకు తెలుస్తాయి.
రామసింహకవి రాసిన యథార్థ మహాభారతము, యథార్థ దశమస్కంధము మొదలగు రచనల ముద్రణకు ఆర్థిక సహాయార్థం ఆయన ఆ ముదిమి వయసులో చాలా ఊర్లు తిరగవలసి వచ్చింది. కాలం మార్పుతో గ్రంథముద్రణకు పూర్వరీతిలో సహాయం లభించలేదు. అయిదు, పది రూపాయలు కూడా స్వీకరించక తప్పలేదు. ‘ధనమున్నను ధర్మ గుణములేని వారలందరు ధనముపై కావలుండిన క్రూరసర్పములే యనుటకే మభ్యంతరము. ఇంతైతే ప్రయాసమే అధికము, ఫలము స్వల్పము’ అని ఆయన పేర్కొన్నారు. అలా ఎంతో ఆశగా చాలా ఊర్లు తిరిగి జమ చేసిన ధనంతో కరీంనగర్ ప్రెస్లో యథార్థ మహాభారతము, ఆ తర్వాత సికింద్రాబాద్లోని కొండా శంకరయ్య శ్రేష్టి ప్రెస్లో యథార్థ దశమస్కంధము ముద్రితమయ్యాయి.
ఈ ఆత్మకథను కవి తన 99వ ఏట ఆరంభించినట్టు ప్రస్తావించారు. రామసింహ కవి 1963లో జీవితాన్ని చాలించారు. ఈ కవి కృతులు, జీవితంపై మరింత కృషి, పరిశోధన జరుగాలి. పాఠ్య పుస్తకాల్లో వీరి రచనలకు స్థానం కల్పించాలి. తెలుగు సాహిత్యచరిత్రలో రామసింహకవి చేర్పు ఆ ఇతిహాసానికి వన్నె తెస్తుంది.
-బి.నర్సన్
94401 28169