భిన్న ప్రక్రియల్లో రచనలు చేసి మెప్పించి తనదైన ప్రత్యేక ముద్రను మిగుల్చుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. ముఖ్యంగా కథ, కవిత్వం, నవల, నాటకం, వ్యాసం, విమర్శ వంటి ప్రక్రియల్లో నిపుణతతో ఆరితేరితేనే ఆ రచనకు ప్రామాణికత దక్కుతుంది. జీవన దార్శనికతతో గొప్ప కథలను, బలిమితో కూడిన భావనామయమైన కవితలను, మనసులో ముద్రగా గుర్తుండిపోయే విశ్లేషణాత్మక వ్యాసాలు, నవలలు, నాటకాలను ఐదు దశాబ్దాలుగా సాహితీ లోకానికి అందిస్తున్న ప్రసిద్ధ సాహితీవేత్త, విఖ్యాత రచయిత ప్రొఫెసర్ రామా చంద్రమౌళి.
(ప్రఖ్యాత రచయిత రామా చంద్రమౌళి 2026 జనవరి 3న ‘అజో- విభో కందాళం ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని’ అందుకుంటున్న సందర్భంగా…)
మానవ జీవిత అంతరంగపు లయల్ని అక్షరమయం చేసి భిన్న ప్రక్రియల్లో విశిష్టమైన రచనలు అందించిన రామా చంద్రమౌళి 1950 జూలై 8న వరంగల్‌లో రాజ్యలక్ష్మి, కనకయ్య దంపతులకు జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆచార్యులుగా, తర్వాత ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం అనేక పాఠ్య గ్రంథాలు రచించిన ఈయన 1999లో రాష్ట్రపతి ఇంజినీరింగ్ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు సాహిత్యంలో నిరంతరంగా, నిత్య నూతనంగా ఐదు దశాబ్దాలకుపైగా కృషిచేస్తూ 35 నవలలు, 427 కథలు, 18 కవితా సంపుటాలు, 4 నాటకాలు, వందలాది విమర్శనాత్మక, విశ్లేషణాశీలత వ్యాసాలను వెలువరించారు.
చిత్ర రంగంపై మక్కువ ఉండి ప్రఖ్యాత సినీ గీత కవి ఆచార్య ఆత్రేయ వద్ద సినిమా కథ, సంభాషణ, పాటల రచనలో మెళకువలను నేర్చుకున్నారు. రామా చంద్రమౌళి రాసిన ‘భూమి దుఃఖం కథ’ టెలిఫిల్మ్‌గా నిర్మితమై 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వర్ణ నంది పురస్కారాన్ని అందుకుంది.
తెలుగు భాషకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన కాళోజీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ కవిత, నవల పురస్కారాలు, సరోజినీ నాయుడు జాతీయ పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్తు ఉత్తమ కథా పురస్కారం, సినారె కవితా పురస్కారం, దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితా పురస్కారం, గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం వంటి ఎన్నో విశిష్ట పురస్కార సత్కారాలను అందుకున్నారు. గణనీయ సాహిత్య కృషిచేస్తున్న తెలుగు వెలుగులకు అంతర్జాతీయ స్థాయిలో అందజేసే ప్రతిష్ఠాత్మకమైన ‘అజో – విభో – కందాళం ఫౌండేషన్’ వారి ‘విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన’ పురస్కారాన్ని 2026 జనవరి 3న హన్మకొండలో రామా చంద్రమౌళి అందుకోబోతున్నారు. ఇదే సందర్భంగా ఆ ఫౌండేషన్ ప్రచురించిన రామా చంద్రమౌళి 19వ నూతన కవితా సంపుటి ‘అనేక ఆకాశాలు’ ఆవిష్కరణ కూడా జరగనున్నది.
నవ్యత, శిల్ప ప్రతిభ, వస్తు విషయ ప్రత్యేకత, భాషా సమర్థతతో ప్రస్ఫుటమైన నిర్మాణ పద్ధతులను పాటిస్తూ అనుభూతులకు ఆత్మసాక్షి వంటి కథలెన్నో రామా చంద్రమౌళి రాశారు. ‘ఒక దేహం అనేక మరణాలు’, ‘తపస్సు’(తెలుగు- ఇంగ్లీష్ ద్విభాష కవిత్వం) వంటి ఆయన వెలువరించిన పలు కవితా సంపుటులలోని కవిత్వం స్వచ్ఛమైన, అచంచలమైన మానవీయతా పరిమళాలను పరివ్యాప్తం చేసింది. ‘ప్రతి ఉదయం తట్టిలేపి క్రమశిక్షణ నేర్పిన సూర్యునికి, దోసిల్లతో వెన్నెలను శిరస్సుపై కుమ్మరించి ఆశీర్వదించిన చంద్రునికి, నా పాదాలను మొట్టమొదట పలకరించిన ఈ నేలకు… ఎంత తరచి చూచినా జీవితం అర్థం కాదని చెప్పిన ఆకాశానికి రుణపడే ఉన్నాను’ అని ఒక కవితలో ఆయన తన విధేయతను, కృతజ్ఞతను కవితాత్మకంగా వెల్లడించారు.
‘అంతా మౌనంగానే’ కవితలో ‘ఒక ఉనికిని సృజించుకుంటున్నప్పుడు/ వెతుకుతున్నాను చుట్టూ/ ఒక తోడు కోసం, ఒక సహచర్యం కోసం/ ఒక కలిసి వెంట నడిచే రెండు పాదాల కోసం’ అని తనలోని ప్రగతిశీల దృక్పథాన్ని, ప్రాపంచిక వైఖరిని, అనుబంధపు అనుశీలతను చంద్రమౌళి స్పష్టం చేశారు.
‘అంతర్దహనం, అంతర, ఎటు..?, ఒక ఏకాంత సమూహంలోకి, కిటికీ తెరిచిన తర్వాత, అసంపూర్ణ’ వంటి కవితా సంపుటాలు, ‘తాత్పర్యం, పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు, జనన బీభత్సం… మరణ సౌందర్యం, లోపలి ఖాళీ’ వంటి కథా సంపుటాలు, ‘మొదటి చీమ, పరంపర, ఎటు, ఎక్కడినుండి..? ఎక్కడిదాకా, సూర్యుని నీడ, మనిషి పరిచయం, కాలనాళిక’ వంటి నవలలు, ‘స్ఫూర్తి ప్రదాతలు’ (విజేతల జీవన రేఖలు) వంటి వ్యక్తిత్వ ప్రేరణాత్మక రచనలు రామా చంద్రమౌళి సాహిత్య విశిష్టతకు నిదర్శనాలుగా నిలిచాయి. ఆంగ్లం, కన్నడ, తమిళ, పంజాబీ భాషల్లోకి కూడా ఆయన రచనలు అనువాదమై ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ‘పరిపూర్ణ పూర్ణిమ ఎంత సుందరమో నిం డు అమావాస్య కూడా అంతే అం దమైందనిపించింది’ అని తానే రాసుకున్న కవితా వాక్యాన్ని నిజం చేస్తూ రామా చంద్రమౌళి సాహిత్యం మనిషి జీవన చక్రంలోని వ్యథార్థ దృశ్యాలను యదార్థాలుగా ఆవిష్కరించి వెలుగు వాకిళ్లకు ద్వారాలను తెరిచింది.
-డా.తిరునగరి శ్రీనివాస్
94414 64764