“మనమంటే 32, 24, 35 కొలతలమైన
చోట.. మొటిమలు మొలవడం,
జుట్టు రాలడం, నడుం సన్నగా
లేకపోవడమే మన నిరంతరాందోళనలైన చోట.. ఎంత హింసని
అనుభవిస్తున్నామో కదా!”
ఈ హింసను స్త్రీలే అనుభవించారా… విమల రాసిన ఈ నాలుగు లైన్లు చదివిన తర్వాత ‘వీరిని ఇలా చూస్తున్నామా’ అని కొందరు పురుషులు కూడా ఎంత హింసని
అనుభవించారో. అలాం టి వారిలో నేనూ ఒకడిని. మూడు దశాబ్దాల కిందట విమల రాసిన
ఈ పద్యం చదివిన తర్వాత…
‘నవ్వినా… నడిచినా… మాట్లాడినా… కూర్చున్నా…
ఒక కృత్రిమ సౌందర్యం కోసం వెంపర్లాడుతూ…’
ఇదిగో అలాంటి సమయంలోనే, ఆ యుక్త వయసులోనే ఈ విమల కవిత్వం చదివి వొళ్లు దగ్గర పెట్టుకొని బతకాలని అర్థమైంది. విమల అంటే భక్తి కలిగింది. భయమూ ప్రారంభమైంది. వెరసి విమలని చూస్తే భయ భక్తులతో మెలగాలని జ్ఞానోదయమైంది. ఈమె రాసిన అడవి ఉప్పొంగిన రాత్రి సంకలనంలో పద్యాలు చదివిన తర్వాత ఈ సువిశాల భారతదేశంలో మరో వారం, లేదూ మరో రెండు నెలలు, పోనీ ఇంకొంచెం ఎక్కువనుకుంటే ఓ సంవత్సరంలోగా విప్లవం వచ్చేస్తుందని నిర్ణయించుకొని ఆ మత్తులో ‘విప్లవం వర్ధిల్లాలి’ అంటూ గోడల మీద నినాదాలమైపోయాం.
వచ్చేసేదేమో… విప్లవం… కానీ ఆగింది. అనేకానేక కారణాల వల్ల. ఈ కారణాల వెతుకులాటలో మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో ఎన్ని సంఘర్షణలు, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు. కొన్ని విజయాలూ దక్కాయి తెలంగాణ రాష్ట్ర సాధన రూపంలో. ఇందులో విమల పాత్ర ఉందా… సాంస్కృతికంగా అనేకానేక మంది పోషించిన పాత్రల్లాగే కవయిత్రిగా కూడా విమల పాత్ర ఉంది. ఇందులో నాకైతే సందేహం లేదు. ఇదంతా గతం. గతం గతః అని అనుకోవడానికి ఇదేమైనా ఇరువురి మధ్య తండ్లాటనా. కాదు కదా… అందుకే ఆ గతానికి నేటి స్వగతాన్ని జతచేసి వగరు జ్ఞాపకాల నవ్వు ఇలా ఉంటుందని చూపిస్తున్నారు విమల.
అవునూ… నాలుగు దశాబ్దాలుగా సాహిత్యమై… అందునా కవిత్వమై మానవ జీవితాలను దేదీప్యమానంగా వెలిగించిన… వెలిగించాలనుకున్న విమల జ్ఞాపకాల నవ్వు తెరవగానే ఇంతకీ కవిత్వం అంటే ఏమిటీ? అనే ప్రశ్నించడం ఆశ్చర్యం వేస్తుంది. నేడు వస్తున్న కుక్కర్ కవిత్వం కాదు విమల రాసిన కవిత్వం. మూడు విజిల్స్ రాగానే కాగితాలను కరాబు చేసే కవిత్వం కాదు కదా విమల రాసిన కవిత్వం. ప్రశ్నించిన వెంటనే జవా బు కూడా ఆమే చెప్పారు తన మూడో జ్ఞాపక నవ్వులో. వాన కురిసిన సాయంత్రాల్లో ఎలా ఉంటుందో కవిత్వీకరించారు.
“వాన కురిసిన సాయంత్రాలు
పరమ కోలాహలంగా ఉంటాయి
బడి గంట మోగంగానే పిల్లలు
వాన చినుకుల్ని ఒడిలో నింపుకొని
నీళ్లలో కాగితం పడవల్ని వదులుతూ
తూనీగల్లా ఇళ్లకేసి పరిగెడతారు’
ఇక్కడివరకూ ఓ సీన్ తప్ప కవిత్వం పెద్దగా కనిపించదు. ఈ తర్వాత ప్రారంభమవుతుంది విమల చిక్కని కవిత్వం… అది ఇలా ఉంటుంది ‘తడిసిపోవడం గురించి/ భయం లేని వాళ్లు వాళ్లొక్కరేనేమో’ అని ముగుస్తుంది ఈ స్టాంజా. ఇది చదివాక అప్రయత్నంగా వొళ్లు తుడుకోవాలనుకుంటాం. అలా అనుకోవడమే కవిత్వం. ఇది చదివిన తర్వాత డిగ్రీ చదువుతున్న నా కూతురికి ఈ పద్యం వినిపించాను. ఏంటో చిరాగ్గా పెద్దదాన్ని అయిపోతున్నాను అంది. బహుశా ఇది చదివిన, చదువుతున్న పెద్ద వాళ్లందరికీ ఇలాగే అనిపించి ఉంటుంది. అలా అనిపించడమే కదా కవిత్వమం టే. సౌందర్యాత్మక హింస, వంటిల్లు, అడవి వంటి కవిత్వం రాసిన విమల ఇలా పరవశంతో ప్రకృతి కవిత్వం రాయడం ఆమె కవిత్వాభిమానులకు ఓ పండుగ. కవులు, రచయితలకు ఏదో ఒక ముద్ర వేయడం, వారిని ఆ చూపుతోనే చూసేలా చేయడం బహుశా తెలుగు సాహిత్యంలో మాత్రమే సాధ్యం. అలాంటివారికి ఈ జ్ఞాపకాల నవ్వు కవిత్వం కాసింత ఏడుపు మిగులుస్తుంది. ఫెమినిస్టు అని, విప్లవవాది అని విమలను ఓ గాటిన కట్టడానికి ప్రయత్నించినవారికి ఓ వెటకారపు నవ్వుతో సమాధానం చెప్పారనిపించింది ఆమె కవిత్వం చదివితే.
‘జీవించేందుకు ప్రయత్నిస్తున్న ఆడమనిషి
ప్రతి ఉదయం మేల్కొనగానే
తానింకా జీవించే ఉన్నట్టుగా కనుగొంటుంది’
ఇందులో ఏ ఇజం ఉంది.. ఏ విప్లవం ఉంది.. ఇందులో ఏముందంటే ఓ కవిత్వం ఉంది.. ఓ జీవిక ఉంది.. ఓ ఆవేద న ఉంది. ఈ పద్యంలోనే ‘జీవితానికి తానింకా జీవించే ఉన్నానని/చెప్పేందుకు అప్పుడామె నవ్వుతుంది కన్నీళ్లతో’ అం టారు. ఇదీ అసలు సిసలు కవిత్వం. కన్నీళ్లతో నవ్వడం ప్రతి రోజూ అందరికీ ఎరుకలోనే ఉంటుంది. అనుభవంలోనూ ఉంటుంది. కానీ, దాన్ని కవిత్వీకరించడమే సాహిత్య సృజన అవు తుంది. విమల ఆ పనే చేశారు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే, తాను అనుభవించిన ప్రపంచాన్నే, అనుభవించని ప్రపంచాన్నే, దారి తప్పిపోయిన ప్రపంచాన్నే కవిత్వం చేశారు. అందుకే విమల అందరిలాంటి కవయిత్రిగా కాదు. ఏ తరం వారైనా ఆమె ఎదురుకాగానే చేతులతో కాదు, మనసుతో నమస్కరించేంతగా ఎదిగారు.
ముక్కామల చక్రధర్
99120 19920