సాక్ష్యాధారాలు లేని కేసులో సుదీర్ఘకాలం జైలులో దుర్భర జీవితం గడిపి, విడుదలైన కొన్నాళ్లకే తీవ్ర అనారోగ్యంతో మరణించిన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఉదంతం భారత న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు సంబంధించిన పలు మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. దర్యాప్తు ముసుగులో, విచారణ సాకుతో మనుషులను జైళ్లలో మగ్గబెట్టడమనే దుష్ట సంప్రదాయానికి ఆయన బలైపోయారు. సుమారు పదేండ్ల ‘అం డా సెల్’ నిర్బంధం ఆయనను శారీరకంగా కుంగదీసిందని విడుదల తర్వాతి పరిణామాలు రుజువు చేశాయి. నక్సల్స్‌తో సంబంధాలున్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారనేది ఆయన మీద చేసిన ప్రధాన ఆరోపణ.
అందుకు ఆధారాల్లేవని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచి నిర్దోషిగా తేల్చడంతో ఆయన స్వేచ్ఛను పొందగలిగారు. యల్గార్ పరిషద్ కేసులో నిర్బంధించిన ఫాదర్ స్టాన్‌కు ఆ మాత్రం అవకాశం కూడా దక్కలేదు. ఆయన నిర్బంధంలోనే కన్నుమూయడం ఏ రకంగా సమర్థనీయం. ఢిల్లీ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్ ఉద్యోగాన్ని తిరిగి పొందేందుకు పోరాడుతూనే సాయిబాబా కన్నుమూయడం బాధాకరం. ఆయన అనుభవంతో దేశంలో నిద్రాణమైపోయిన అండర్ ట్రయల్స్ లేదా విచారణ ఖైదీల సమస్య మరోమారు ముందుకు వచ్చింది. 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలోని వివిధ రకాల జైళ్లల్లో మొత్తం 5,73,220 మంది ఖైదీలుంటే వారిలో 4,34,302 మంది విచారణ ఖైదీలే. వారిలో అత్యధికులు అట్టడుగు వర్గాలవారే. ఇటీవలి కాలంలో సాయిబాబా లాంటి రాజకీయ, మేధావి ఖైదీలు వారిలో వచ్చిచేరారు.
సంస్థలు ఏవైనా, ఆరోపణలేవైనా, కేసులేవైనా ఒకటి మాత్రం నిజం. ప్రభుత్వ ఆలోచనతో పొసగని వివిధ భావజాలాలకు చెందినవారిని నిర్బంధించుకుంటూ పోతున్నారు. మహారాష్ట్ర యల్గార్ పరిషద్ కేసు అయినా, ఢిల్లీ లిక్కర్ కేసు అయినా, మరో కేసు అయినా నెలల తరబడి, ఏండ్ల తరబడి జైలుకే పరిమితమైపోయిన వారెందరో. న్యాయం నిర్ణయించేది ఎవరు? ప్రభుత్వమా, న్యాయస్థానాలా? అక్రమ నిర్బంధాలతో తీర్పులు లేని శిక్షలు అమలు చేస్తున్నది కేంద్రం. ప్రభుత్వాలే న్యాయ పరిధిని అతిక్రమిస్తూ పోతుంటే ఇంక కోర్టులు దేనికి? బెయిల్‌కు వీలులేని చట్టాలను చేసి కోర్టుల చేతులు కట్టేయడం మనం చూస్తున్నాం.
చివరకు ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే గాని బెయిల్ దక్కని పరిస్థితి. ఎట్టకేలకు బెయిల్ దక్కి విడుదలైనందుకు సంతోషించాలా, జైలు జీవితం శారీరకంగా, మానసికంగా చేసిన నష్టానికి బాధపడాలా? అనేది ప్రశ్న. జైలులో గడిపిన కాలానికి నష్టపోయిన వ్యక్తిగత కుటుంబ జీవనం, వృత్తి జీవితం, అన్నిటికీ మించి ఆరోగ్యం ఎవరు తిరిగిస్తారు? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? వేదన జైలులో గడిపిన వ్యక్తిది మాత్రమేనా? అతని కుటుంబ సభ్యులు, సహచర మిత్రులు అనుభవించిన ఆవేదనకు ఎవరు పరిహారం చెల్లిస్తారు?
విభిన్న రాజకీయ, సామాజిక భావజాలాలను, వాదాలను సర్దుబాటు చేసుకోవడమే కదా ప్రజాస్వామ్యం. ఆ స్ఫూర్తికి భంగం కలిగించి నష్టపరచడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని దర్యాప్తు సంస్థలు ఈ సంప్రదాయాన్ని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తూ విమర్శల పాలవుతున్నాయి. కోర్టులు పలు సందర్భాల్లో అక్షింతలు వేస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. బెయిల్ అనేది సార్వత్రికం, జైలు అనేది మిహాయింపు మాత్రమేనన్న సూత్రాన్ని సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో నొక్కిచెప్పడం గమనార్హం. ప్రొఫెసర్ సాయిబాబాకు ఈ సూత్రాన్ని వర్తింపజేసి విడుదల చేసేసరికి చాలా ఆలస్యమైంది. ఆలస్యంగా న్యాయం చేయడం అన్యాయం చేయడమేననే నానుడిని మన న్యాయవ్యవస్థ తు.చ. తప్పకుండా పాటిస్తేనే అనవసర నిర్బంధాలకు తెరపడుతుంది.