సిద్ధాంత నిబద్ధత, నిలువెల్ల నిజాయితీ, బతుకంతా త్యాగనిరతి, పేదరికానికి ఎదురీత.. ఈ లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో పోటెత్తాయంటే ఆ జీవితం ఎంత కల్లోలమవుతుందో ఊహించవచ్చు. ఈ ఆటుపోట్లను ఎదుర్కొంటూ సమసమాజం కోసం కమ్యూనిస్టు కార్యకర్తగా, ప్రజాకవి గాయకుడిగా బతుకుబండి లాగినవాడు మేర మల్లేశం. తన కార్యక్షేత్రం కరీంనగర్ దగ్గరి హుస్నాబాద్ ప్రాంతానికే పరిమితమైనందు వల్ల మల్లేశం పోరాట జీవితం, పాటలు బయటి ప్రాంతానికి తెలిసిరాలేదు. ఆచరణలో సిద్ధాంత పొంతన కోల్పోతున్న కమ్యూనిస్టులతో ఆయనకు ఏర్పడిన వివాదాల వల్ల కూడా మల్లేశం ఘనత ఎవరికీ పట్టనిదైంది. హుస్నాబాద్ ప్రాంతంలో తొలి కమ్యూనిస్టుగా దొరతనాన్ని ఎదిరించిన చరిత్ర ఆయనది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన సీపీఐ నేతలందరూ ఆయన వెనుక నడిచినవారే.
ఆయన పాటలకు గొంతు కలిపినవారే. నెహ్రూ పాలనకు వంతపాడుతూ, ఆశయాన్ని వదిలేసిన కమ్యూనిస్టుల తీరు నచ్చక మల్లేశం పార్టీకి దూరమవుతూ ఒంటరిగానే పీడిత జనానికి బాసటగా నిలుస్తూ తన బతుకును సాగించాడు.‘మేర మల్లేశం’ జీవితకాలం 1924-1997. హుస్నాబాద్ దగ్గరి అక్కన్నపేట ఆయన స్వగ్రామం. ఊర్లో బట్టలు కుడుతూ బతుకుతున్న తన తండ్రి భూస్వామితో తలెత్తిన గొడవ వల్ల ప్రాణ భయంతో ఊరు వదిలి, మహారాష్ట్రకు వెళ్తే, మల్లేశం హైదరాబాద్‌కు వచ్చాడు. ఒక టైలరింగ్ కంపెనీలో పనికి కుదిరిన ఆయనకు ఆర్యసమాజ్, భారత కమ్యూనిస్టు పార్టీ పరిచయమయ్యాయి. కమ్యూనిస్టు సిద్ధాంతానికి, పోరాటాలకు ఆకర్షితుడై పార్టీలో చేరిన మల్లేశం నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమయ్యాడు. పోరాట పాటలు తోడయ్యాయి. నిజాం పాలనపై వ్యతిరేకంగా పాటలు ఆశువుగా పాడేవాడు. హుస్నాబాద్ ప్రాంతంలో ఉద్యమ వ్యాప్తి కోసం తన వెరపులేని ప్రసంగాలతో, ఆకట్టుకొనే పాటలతో జనాన్ని ఏకం చేశాడు. పార్టీ అండతో దొరతనపు దౌర్జన్యాన్ని తన పాటలతో ఎండగట్టాడు.
పార్టీ కార్యక్రమాల్లో భాగంగా 1947, సెప్టెంబర్‌లో ఊర్లలో జాతీయ జెండాలను ఎగురవేయడం, ప్రజల వద్ద ఉన్న తుపాకులను పార్టీకి అందజేయడం లాంటివి జరిగాయి. వెల్దండ ప్రాంతంలో ఈ పనుల్లో ఉన్న మేర మల్లేశంను స్థానిక గ్రామాధికారులు నిజాం పోలీసులకు పట్టించారు. అలా డిసెంబర్, 1947 నుంచి జనవరి 1951 దాకా మల్లేశం జైలు జీవితం గడిపారు. ఆ నాటి జైళ్లలో పోలీసులు కమ్యూనిస్టులను ఎంత హీనంగా చూసేవారో, ఎలా హింసించేవారో మల్లేశం స్వీయ చరిత్రలో అనుభవపూర్వకంగా ఉన్నది. ‘రజాకార్లు మమ్ముల్ని పెట్టని హింస లేదు. కొట్టుడు, తన్నుడు, తుపాకులతో గుద్దుడు, మీసాలను పట్టుకార్లతో పీకుడు, ముఖం మీద కాండ్రించి ఊంచుడు, నీళ్లడిగితే నోట్లే ఉచ్చ పోసుడు’ చేసేవారని రాసుకున్నారు. ఈ కాలంలో మల్లేశం జనగామ, హైదరాబాద్, ఔరంగాబాద్, జాల్నా జైళ్లలో గడిపాడు.
జైలు నుంచి విడుదలయ్యాక ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రసంగాలు, పాటలతో ప్రచారం చేశారు. నాటి నెహ్రూ ప్రభుత్వాన్ని పార్టీ పొగుడుతున్న తీరును నిరసిస్తూ జాప లక్ష్మారెడ్డితో కలిసి విమర్శ పెట్టారు. నాయకుల సమాధానంతో సంతృప్తి చెందక బయటికి వచ్చాడు. అప్పటినుంచి ఏ పార్టీలో చేరలేదు. తనదైన రీతిలో కాలక్రమంగా వచ్చిన అన్ని ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించాడు. భార్య అరుణ కూడా ఆయన భావజాలాన్ని అనుసరించేదే. పూర్తి అనుకూలవతి. కుటుంబ పోషణ భారమంతా అరుణనే చూసేది. వారికి 8 మంది పిల్లలు. ఖర్చులకు డబ్బు సరిపోక పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇల్లు గడవడమే కష్టమై, ఎవరి చదువులు సరిగా సాగలేదు. సంపాదన కోసం మల్లేశం వ్యవసాయం, వ్యాపారం చేసినా నష్టమే మిగిలింది. తనలోని నిజాయితీ, నిబద్ధతలను వదులుకోలేక మల్లేశం ఈ కష్టాలను అనుభవించాడు.
1970లో స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్కై మిత్రుల ఒత్తిడితో దరఖాస్తు చేసుకున్నాడు. రైలు చార్జీలు లేక ఢిల్లీకి వెళ్లలేదు. తామ్రపత్రం కలెక్టర్ ఆఫీసుకు వచ్చింది. నెల నెలా రూ.200 వచ్చేవి. ఆ సొమ్ము కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చింది. తొలి తెలంగాణ రాష్ర్టోద్యమానికి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వకున్నా తాను మాత్రం తెలంగాణ వైపు నిలిచాడు. 1980 తర్వాత విప్లవ రాజకీయాల వైపు మొగ్గడంతో మళ్లీ పోలీసులతో చిక్కులు తప్పలేదు. 1996లో ప్రముఖ రచయిత మలయశ్రీ సారథ్యంలో మల్లేశం దంపతులకు సత్కారం జరిగింది. గుండెలోని రెండు కవాటాలు దెబ్బ తినడంతో మల్లేశం 1997, ఆగస్టు 19న కన్నుమూశాడు. ఆయన అంతిమయాత్రకు తెలిసిన ఊర్లన్నీ కదిలివచ్చాయి. అంతకపేటలో సీపీఐ ఆయన స్మారకస్థూపం ఏర్పాటు నిర్మించింది.
ఇంతకాలం విస్మృతికి గురైన ఆయన పోరు చరిత, పాటల ఘనత ఇటీవల వెలువడ్డ ‘మేర మల్లేశం-స్వీయ చరిత్ర-పోరాట పాటలు’ అనే పుస్తకంతో వెలుగుచూశాయి. సుమారు నలభై ఏండ్ల కిందట కవి అన్నవరం దేవేందర్ స్వయంగా మల్లేశంను కలిసి మాట్లాడి, చర్చించి, సేకరించిన సమాచారానికి పుస్తక రూపమిది.
1997లో దేవేందర్ సంపాదకత్వంలో ‘మేర మల్లేశం – పోరాట పాటలు’ అనే చిన్న పుస్తకం వచ్చింది. అందులో మల్లేశం రాసిన వాటిలో లభ్యమైన 31 పాటలున్నాయి. అందులో చాలామట్టుకు స్థానిక దొరల ఆగడాలను ఎదిరిస్తూ రాసినవే. ప్రస్తుత పుస్తకానికి కె.ముత్యం సంపాదకుడు. పరిశోధకుడిగా అన్నవరం అందించిన సమాచారంతో తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లేశం పాత్రను ముత్యం ఎంతో క్రమబద్ధంగా వివరించారు. ఈ పుస్తకంలో స్వయంగా మల్లేశం రాసుకొని అన్నవరం దేవేందర్‌కు ఇచ్చిన 15 పేజీల స్వీయ చరిత్ర ఉన్నది. సుమారు యాభై ఏళ్ల మల్లేశం ప్రజా జీవితంపై కె.ముత్యం రాసిన విపుల వ్యాఖ్యానం ఉన్నది. అనుబంధంగా ‘మేర మల్లేశం పోరాట పాటలు’ ఉంది. తెలంగాణ మేరు సంఘం తరఫున కొత్తకోట కరుణాకర్‌రావు దీనికి ప్రచురణకర్తగా ఉన్నారు. ఇలా వీరి కృషిఫలితంగా ఒక విస్మృత తెలంగాణ పోరు బిడ్డకు చరిత్రలో చోటు లభిస్తున్నది.
-బి.నర్సన్
94401 28169