దట్టమైన వస్ర్తాన్ని
నలు దిక్కులు కప్పినట్లు
తెల్లని పొగ
భేదమింత చూపకుండా
సందు సందునూ
వేటాడుతోంది
దినకరుని కిరణాలు
సోకీ సోకగానే
నెమ్మదిగా విడివడుతూ
పుప్పొడిగా రాలుతున్న
హిమపాతం అనుకుంటున్నారా?
కాదు కాదు..
నక్షత్ర మాలలను
దేహమంతా నింపుకున్న
చంద్రుని సామ్రాజ్యం నుంచి
ఎడతెరిపి లేకుండా కురిసే
పండువెన్నెల గిలిగింత కాదు
ఆకుపచ్చని
చెట్ల పరువాన్ని
ఆశగా అల్లుకుపోతూ
వెండి ఛాయను కప్పుతున్న
హేమంత ఋతువు కాదు
దేశ రాజధాని నగరంపై
పంజా విసిరిన కాలుష్యం
మానవ తప్పిదాలతో
మరణానికి మార్గమైన
విషపు గుళిక
గాలిని గుప్పిట పట్టి
ఊపిరికి ఉరితాడై
వేలాడుతున్న భూతం
గణాంకాలను మించి
మనుగడకు ప్రమాదంగా
మేధస్సుకు సవాలుగా
అంతుచిక్కని మాయ
కారణాల చిక్కువిడి
స్వచ్ఛంగా వికసించేదెప్పుడో…??
వారి జీవన గమ్యంలో
సుగంధాలు విరిసేదెప్పుడో..??
అరుణ , ధూళిపాళ
87123 42323