దాశరథి తెలంగాణ జాతిరత్నం. విశ్వ మానవ స్పందనల మహాకవి. పీడిత ప్రజావాణికి ‘మైక్’ గా గొంతెత్తిన యుగకవి. ‘నేనురా తెలగాణ నిగళాలు (సంకెళ్లు) తెగగొట్టి ఆకాశమంత యెత్తరచినాను’ అని ప్రకటించుకున్న సగర్వకవి. ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’ దాశరథి తొలినాళ్ల కవితా సంపుటాల పేర్లు. కవి పౌరుషానికీ, సమరశీలతకూ ఈ పేర్లు నిలువుటద్దాలు. ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’అని ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసినవాడు దాశరథి. ఇంతగా తన జాతి పట్ల అభిమానం గల కవులు చరిత్రలో అరుదుగా ఎదురవుతారు.
దాశరథికి తెలుగుభాష అందచందాలు, స్నేహ గంధా లు తెలుసు. తన హృదయ నాదానికీ- మనో నినాదానికీ తగినట్టు తెలుగు భాషకు సొంత ఆస్తి అయిన తెలుగు పద్యాన్ని తీర్చిదిద్దిన ఆధునిక చేతనా మనస్కుడు. గేయా లను లయబద్ధంగా తూగించాడు. శ్రోతలను ఉత్తేజితు లను చేశాడు. ఉద్విగ్నులను చేశాడు. పరవశింపజేశాడు.
తెలుగుభాషలో పరిపూర్ణంగా సకల వ్యక్తి స్పృహలూ ఒదిగించాడు. వచన కవితలను ఆలోచనాత్మకంగా మలి చాడు. తనదైన కథాకథన శైలిని ఎంచుకున్నాడు. నవల ల విస్తృతిని పదిలంగా పెంచుకున్నాడు. నాటికల దృశ్యా లను ఒడుపుగా పేర్చుకున్నాడు. వ్యాసాల రూపురేఖలను తగినట్టు క్రమబద్ధీకరించు కున్నాడు. స్వజీవిత‘యాత్రా స్మృతి’రేఖలను ఇంపుగా-సొంపుగా కనబడే బొమ్మలు గా రూపొందించుకున్నాడు. అనువాదాలను తెలుగు భాషా దీప పరంగా-పూల బుట్టగా అందించాడు. ఉపన్యాసాలలో సాహిత్యశక్తిని ప్రదర్శించాడు. జానపదు ల నుంచి జ్ఞాన పదుల వరకు ఉండే జనావళికి శుభం పూచే భవితవ్యాన్ని మనసుకెక్కించాడు. కవి సమ్మేళనా లలో స్వరాపౌరుషాన్ని మలగని అఖండ దీపంగా నిరూ పించాడు. ముషాయిరాలలో తాను అలరి శ్రోతలను అలరింపజేశాడు. సహ సమ ఉజ్జీ కవుల అభినందనలూ కరతాళ ధ్వనులూ విన్నాడు.
ఒక్కమాటలో: దాశరథి – కవితా శరధి వాగ్బాణాల అమ్ముల పొది.
ప్రజాపక్ష రథి-సారథి. ధీ-మేధావి.
దాశరథి తన కాలంలో విలక్షణ సామాజిక కవి. రస హృదయాన్నీ – విజ్ఞాన దృక్పథాన్నీ ముడివేసిన కవి. దాశరథి ఏ రోజూ స్వార్థ ప్రయోజనాల కవి కాలేదు. అల్పసంతోషి. అనల్ప మానవతా వాది. ‘తెలంగాణము రైతుదే’ అని గర్జించిన సామ్యవాది దాశరథి. అవసరం వచ్చినపుడు పంజా విప్పిన పెద్దపులిలా గాండ్రించాడు. తన గుండెలను ఎదురొడ్డి ఉద్యమించాడు. కష్టాల పాలయ్యాడు. కారాగారాల్లో కృశించాడు. అయినా చెక్కు చెదరని గుండెబలంతో తన గుండెను అగ్నిగుండం చేసు కున్నాడు. జ్ఞాపకానికి నిలిచే తెలుగు పద్యం ఛందస్సును ఎంచుకొని అగ్నిజ్వాలలకు సరి తూగే భావాలకు ఆక్సిజన్ అం దించాడు. ప్రజా ప్రయోజనం కోసం కవిత్వ కళను ఆరాధించిన కవి దాశరథి. శబ్దశక్తి తెలిసి తన శతాబ్దాన్ని వెలిగించిన కవి దాశ రథి.
అభిప్రాయాలు సరే-భావా లు మరే- ఆవేశపు పొంగులూ సరే-తగిన భాష సాధించు కోవ టం ఇంకాసరే: అయినా పద్యం -కవిత్వం: శ్రోతలను మురిపించ టమో, మెరి పించటమో చేయ లేక పోతే కవిత్వ మల్లడం ఎందు కు కొరగాని పనే అవుతుంది. రంగులు చేతుల్లో ఉండి ఊహాలు లేకుంటే బొమ్మలు ఎలా వేయ టం? ఇన్ని అంశాలు దాశరథిని మహాకవిని చేశాయి.
దాశరథి కవి హృదయానికి వ్యక్తిగత రస పిపాస ఎక్కువే. సమంజసమే. ప్రజాపక్ష సంక్షేమ కాంక్ష కూడా ఎక్కువే. తానే చెప్పు కున్నాడు. ‘శృంగారం, అంగారం తనకు రెండు కండ్లు అని. ఏ కవైనా ప్రపంచంలో ముందు సౌందర్యవాది. సకల జీవిత సౌందర్యారాధకుడు. సౌందర్యం జీవిత శోభా వీచిక. ప్రపంచ జనావళికి ప్రేమే ఆక్సిజన్. సౌందర్యం స్త్రీ – పురుష ఉభయకుశల చరిత్ర రసద్రవ్యం. సృష్టి వికాసోన్ముఖం.
ఎప్పుడు ప్రజలంతా తమ ఫ్రీవిల్ పరిమితులతో సుఖశాంతులను అనుభవించగలుగుతారో అప్పుడే ఆ సమాజం వాస్తవంగా జీవించినట్టు! బతకలేని రోజులే బతుకైతే బతుకు ఎలా ఉంటుందో దాశరథి ప్రత్యక్షంగా చూశాడు. తల్లడిల్లి పోయాడు. ఉడికి పోయాడు. ఏడ్చా డు. తన బాధకు, ఆవేశానికి కవితా రూపమిస్తూ ఏమన్నాడో గమనించండి.
‘వెన్నెలలు లేవు-పున్నమ కన్నె లేదు
పైడి వన్నెల నెలవంక జాడలేదు
చుక్కలే లేవు ఆకాశ శోక వీధి
ధూమధామమ్ము దుఃఖ సంగ్రామ భూమి
జనం మనం మనం జనం’ అన్న కవి పద్యమిది.
ఇలాంటి కవి ఊరుకుంటాడా? కలం చేతపట్టి ఇలా రాయక మానుకుంటాడా?
‘మూగవోయిన కోటి తమ్ముల గళాల
పాట పలికించి కవితాజవమ్ము కూర్చి
నా కలానకు బలమిచ్చి నడిపినట్టి
నా తెలంగాణ కోటి రత్నాల వీణ’
అంటూ కదం తొక్కాడు. గెలిచాడు. గెలిపిం చాడు. గెలుపు ఫలితాన్ని కండ్లరా చూశాడు. దాశరథి ధన్యకవి? సౌందర్యదృక్కోణంలో దాశరథి పరిపూర్ణతకు ఒక ఊదాహరణ.
‘అంత చల్లని నీ గుండె మందిదేల?
కోపమగ్ని కీలా మాలికోపమమ్ము
ఇంత చల్లని ఈ పూల చెంత ఏల
పెకలివచ్చునొ వక్షాన వెచ్చదనము ?’
భరతముని దగ్గర నుంచి తెలంగాణకు చెందిన చమత్కార చంద్రికాకర్త విశ్వేశ్వరుని వరకూ సాహిత్య గోష్ఠిలో చర్చించదగిన పద్యమిది-20 వ శతాబ్దికవి మన దాశరథి కవి రచన. తెలంగాణ ప్రజాజీవిత చారిత్రక క్రమంలో రూపొందిన కవి దాశరథి. అయినా తన విశా లహృదయంతో తన మనో ఔన్నత్యంతో సందర్భాను గుణంగా తేజరిల్లిన కవి.
శారీరక అనారోగ్యంతో బాధ పడ్డాడంతే కాని మాన సిక దారుఢ్యాన్ని కోల్పోలేదు. శాంతియుతంగా ప్రపం చం ముందుకు వెళ్లాలని కలగన్నాడే కాని నాకేం ఒరిగిం దని నిరుత్సాహ పడని కవి దాశరథి.
దాశరథి, సినారెలు తెలంగాణ నుంచి ప్రపంచాన్ని వెలిగించి చూపిన సూర్యచంద్రులు. దాశరథి కవిగా సీనియర్. రెండు ప్రపంచయుద్ధాల తర్వాత సామాన్యుని పక్షాన తెలుగు కవిత్వం నిలిచిన మాట నిజం. కాలానుగుణంగా సామాన్యుల కోసం వచనకవిత్వం తప్పనిసరి అని గ్రహించిన కవులలో వీరిద్దరూ తక్కిన వారితో పేర్కొనక తప్పనివారే.
అయితే ఈ మన కవులిద్దరూ భాషా సంప్రదాయాన్నీ చెడగొట్టకుండా వచన కవిత్వాన్ని రచించారు. దాశరథి తిమిరంతో ఘనసమరం జరిపిన బతుకే అమరం అని యుద్ధభేరి మోగించినట్టు మేల్కొల్పినారు. కావలసిన సమస్త రీతుల్లో వచన కవిత్వం రచించారు.
మస్తిష్కంలో లాబొరేటరీ మలుపు గెలుపు కవిత. ఒక్కమాటలో వచన కవిత్వాన్ని సాహిత్యపద బంధురం చేసి చూపిన కవి దాశరథి. ఎక్కడో గెలిచిన ‘నీగ్రో’ విజ యాన్నీ అభినందించారు. సందర్భోచితంగా జీవితాం తం కవిత్వంతో జీవించిన కవి దాశరథి.
తెలుగు సాహిత్యానికి అదనపు ప్రక్రియలను జత చేసిన కవి దాశరథి. పాత ప్రక్రియయైన శతకాన్ని ఆధునిక చైతన్య ప్రక్రియ’గా మలిచిన కవి. తెలంగాణ జాతి దాశరథిని విస్మరించకుండా తెలంగాణ ఉద్యమ నాయకుడు, ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ సాహిత్య పరిజ్ఞానంతో ప్రతి సంవత్సరం దాశరథి పుర స్కారంతో ఒక కవిని సత్కరించటం కవి లోకానికి ఉత్తేజకరమైన ప్రభు త్వ కానుక.
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు (నవంబర్ 5 దాశరథి వర్ధంతి)
దాశరథి చదువగలిగినంత కాదు, చదువవలసినంత చదివాడు. రాయవలసినవన్నీ రాశాడు. తనకు అంగార-శృంగారాలు కుడి,ఎడమ భుజాలు కాగా, కాగినాడు,వేగినాడు అక్షరాల్లో తేరినాడు. దాశరథి నిక్కమైన మంచి నీలం. మనసు ప్రవాళం. దాశరథి పద్యం కోహినూర్ వజ్రం.
– గురిజాల రామశేషయ్య 70326 79471