ఆ పాట విన్నవారెవరైనా కంటి నుంచి నీళ్లు తీయకుండా ఉండలేరు. ఆ వాగ్గేయకారుడు రాసి, పాడిన పాటలు విన్న విద్యాశాఖాధికారులు రాష్ట్రంలోని రెండు లక్షల బాల కార్మికులను బడిలో చేర్పించారు. అంతెందుకు ఆ పాట విన్న ప్రభుత్వం సైతం రాష్ట్రంలో అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు కృషిచేసింది. ఆ రచయితే చింతల యాదగిరి. ఆయన పాడిన పాటే ‘నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో/ నా సంకల మేడితో సాలిరువాలు దున్నినానయ్యో’. చింతల యాదగిరి నల్లగొండ జిల్లా, మేళ్ల దుప్పలపల్లి అనే పల్లెటూరుకు చెందినవాడు.
7వ తరగతిలోనే డ్రాపౌట్ అయి ఎడ్లగాసి, నాగలి దున్ని తన బాల్యాన్ని వ్యవసాయానికి ఎరువుగా మార్చా డు. బహుశా ప్రజానాట్య మండలిలో పని చేసినందుకేనే మో ‘నా చిట్టీ చేతులు’ పాట చింతల యాదగిరి రాశాడని ఎక్కువగా తెలియదు. ఆయన తెలియకున్నా ఈ సమా జం ఆయన పాటలను విన్నది, పాడుకున్నది. ఆయన రాసి పాడిన మచ్చుకు కొన్ని పాటలను పరిశీలిద్దాం.
‘గుండెలోన రగిలిన బాధ కన్నీరై కారుతుంది/ కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది’ అంటూ యాదగిరి కంటికి కనిపించని బాధకు రూపంగా, కన్నీటిని వస్తుగతంగా మనకు చూపెడుతున్నాడు. అందుకే యూట్యూబ్లో ఉన్న ఈ పాటకు పది మిలియన్లకు పైగా వ్యూస్ కనిపిస్తున్నాయి. మొదటి లైన్లలోనే పదునైన పద ప్రయోగం, పాట మొత్తం భావాన్ని ఒక్క పల్లవిలో కూర్చి శ్రోతలను తనవైపునకు తిప్పుకోవడంలో యాదగిరి దిట్ట.
‘ఉన్న ఊరు కన్న తల్లిని వదిలి పోలేనే/ నేల తల్లి పొదుగును కాదని చెదిరీ పోలేనే’ అని సరళంగా, సూటి గా, ఒక బలమైన స్టేట్మెంట్తో పాటను ప్రారంభించిన యాదగిరి మనల్ని ఆ పాటలోకి ఆకర్షిస్తాడు. మనకు తెలియకుండానే మనల్ని సమరానికి సన్నద్ధం చేస్తాడు. అంతెందుకు ‘అన్నదాత ఆగమవుతుండే/ పురుగుమందుతో ప్రాణాలొదిలిండే/ మట్టిబిడ్డడు మాయమవుతుండే/ మనలనిడిసీ వెళ్లిపోతుండే/ కనికరించని కాలం తోడు/ కాటువేసిన పాలన చూడు’ అని యాదగిరి విలపిస్తూ రైతు ఆత్మహత్యలపై పాడిన పాట విన్నవారెవ్వరైనా సరే ఏడవకుండా ఉండలేరు. నిజానికి చాలామంది కవులు కరువుకు కాలాన్ని, ప్రకృతిని కారణంగా చూపిస్తారు. కానీ యాదగిరి మాత్రం రైతులను ప్రభుత్వం కాటు వేసిందని, లేదంటే లోకానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకోడని చెప్తాడు. అంటే సమస్య పట్ల లోతైన అవగాహన ఒక ప్రజా, ఉద్యమ కవికి మాత్రమే ఉంటుందనే విషయం గమనార్హం. ఇలా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన మార్క్సిస్టు దృక్పథాన్ని యాదగిరికి అందించింది ప్రజానాట్యమండలియే.
‘అమ్మ రొమ్ము పాలలోన ఫ్లోరీను జాడ/ అన్నమిచ్చె పంట మీద విషపు నీళ్ల నీడ/ పాకులాడే ప్రాయమందు పట్టుకుంది వెన్ను/ కీలు కీలు అరగదీసి సంపుతుంది నన్ను’ అంటూ నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య మీద పాట రాసిన మొట్టమొదటి వాగ్గేయకారుడు చింతల యాదగిరి. దీని విష ప్రభావం నల్లగొండ జిల్లా నీళ్లలో ఎంత దారుణంగా ఉన్నదో పై చరణంలో మనకు తెలుస్తుంది. ఇలా చింతల యాదగిరి వందల పాటలు రాశాడు. ఆయన రాసిన కొన్ని పాటలతో ‘తీగో నాగో ఎన్నియ్యలో’ అనే పుస్తకాన్ని మట్టిముద్రణలు, అలగడప వారు ముద్రించారు.
మూడు దశాబ్దాలుగా పాటల వ్యవసాయం చేస్తున్న చింతల యాదగిరికి నడుస్తున్న తెలంగాణ వాగ్గేయ చరితలో ప్రామాణికమైన పాటకవిగా, ప్రజాకవిగా, వాగ్గేయకారుడిగా కావాల్సిన ప్రచారం, గుర్తింపు దక్కలేదు. తెలంగాణ నేల గర్వించదగిన గొప్ప కవిగాయకుడు చింతల యాదగిరి. నిజానికి చింతల యాదగిరి పాటంటే ఆనందం కాదు, ఆవేదనల మూట. తన్మయత్వం కాదు, తనువు అణువణువులో చెలరేగే ఆవేశం. తన స్వరం నిప్పురవ్వలను వెదజల్లే ఎర్రని కొలిమి. ఆ మండే గొంతులోంచి తన్నుకొచ్చే జీర సముద్రపు అలల హోరును, తుఫాను గాలి జోరును గుర్తుచేస్తూ పాడుతుంది. ఆయన కలంతో పొడిచే పొద్దుపై సంతకం చేస్తూ.. కాలం నుదుటన మరిన్ని పదునైన పాటలు రాయాలని ఆశిద్దాం.
(వాగ్గేయకారుడు చింతల యాదగిరి 2024, డిసెంబర్ 15న ఢిల్లీ వేదికగా బహుజన సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సందర్భంగా..)
– ఎం.విప్లవ కుమార్ 95152 25658