మా ఊరి మూలవాగు
ఇసుక దేహంపై నీటి కొంగు సుట్టుకొని
కస్కెలు, శంఖులతో అలుగు దుంకితే
పట్టగొలుసులు పెట్టుకున్న ఆడబిడ్డ లెక్క ఉంటది.
అది సుడులు సుట్టుకొని సప్పుడు చేసే నీటి రాగానికి
కోటి కొంగలైన ఒంటికాలి
జపంతో ఎదురుసూడాల్సిందే…
దాని లెక్కల
పొర్కనీ, గడ్డిని తనతో కొంచవోయిందంటే
ముసలోళ్ల మంచి చెడ్డలర్సుకునే
పెద్ద మనిషైనట్టే…
అలిగి కూసున్నదంటే ఎండకాలం వచ్చినట్టే..
చలాకి ఉన్నదని
గవర్నమెంటోళ్లు చెక్‌డ్యామ్ కట్టి ఏడాదైనా కాలె
ఏ పాపపు దళారోడి కన్ను పడ్డదో ఏమో
నీటి కొంగు తొలచి వివస్త్రను చేసిండ్రు
ఇసుక దేహాన్ని అమ్ముకొని
రాక్షసానందం పొందిన్రు
పాపం వాగు ఇప్పుడు మిగిలిన దుబ్బతో
నోరి తెర్సి ఎదురుచూసే పొలం
లెక్క బీటలు వారి చూస్తున్నది
ఎవరైనా చెరువు నీళ్లతోనైనా
గొంతు తడుపుతారని
ఒక నీటి బట్టను మళ్లీ సుట్టి పోతారని.
సందీప్ , వొటారికారి
93902 80093