అమ్మ మీద కోపం వస్తోంది
అమ్మకు నిజంగానే
సరిగ్గా బ్రతకటం రాదు
కాలంతో పాటు మారలేదు
అక్కడే పాతకాలంలోనే
ఆగిపోయింది
వస్తువులపై వ్యామోహం
వీడలేదు…
రూపాయి విలువ
ఎలా పతనమయ్యిందో
తనకు ఇప్పటికీ తెలియదు
ఈ వ్యవస్థ ఎంత
దోపిడీదారో ఇప్పటికీ
గ్రహించలేదు
స్వార్థం లేని అలనాటి రోజులే
ఇంకా బ్రతికున్నాయి అనుకుంటుంది
త్యాగాలతో బ్రతికి
తనువెల్లా పుండైపోయి
అదే జీవితం అనుకునే పిచ్చి తల్లి
అమ్మకు నిజంగానే
హాయిగా బ్రతికెయ్యటం రాదు
కష్టాలన్నీ కుప్పేసుకొని
బ్రతుకు బండిని లాగేస్తుంటది
త్యాగాల వృత్తంలో దాక్కొని
చావుకు, బ్రతుక్కీ మధ్య
ఊగిసలాడుతూనే
అసౌకర్యాలను ప్రేమిస్తూ ఉంటది
మార్పును ఆహ్వానించలేని
ఉత్త అమాయకురాలు అమ్మ
తనో చాదస్తం అనాలో
చాకిరి యంత్రం అనాలో అర్థం కాదు
అమ్మ మీద కోపం వస్తోంది
ఇలా ఉండమంటే ససేమిరా అంటుంది
పాతింట్లో ఒంటరి బ్రతుకే
తనకు స్వేచ్ఛగా ఉందంటుంది
పనికిరాని పాత సామాన్లను దాచుకొని
అదే సంతృప్తి అంటుంది
మమ్మల్ని దుబారా అని తిట్టేస్తోంది
కాలంతో పాటు మారలేదు
కొందరు తల్లులు ఇంతేనేమో…
చెవులు వినిపించక
కళ్లు సరిగా కనిపించక
రోజూ ఓ పోరాటమే చేస్తోంది
అయినా తన మాటే వినాలనే
మొండితనం ప్రదర్శిస్తోంది
ఎనిమిది పదులు దాటిన వయసులో
ఇంత పట్టుదలా…
పట పట రాలుతున్న
నా కన్నీళ్ల సాక్షిగా అమ్మ మీద జాలేస్తుంది
పోయేటప్పుడు వెంటరాని
ఈ వస్తువులపై మమకారానికి
నిజంగానే అమ్మ మీద కోపం వస్తోంది..!
– డాక్టర్ రమేష్ కటుకోఝ్వల 99490 83327