సంస్కృత సాహిత్య ప్రపంచంలో చాణక్యుడి ‘చాణక్య శతకమ్’ భర్తృహరి విరచిత ‘సుభాషిత త్రిశతి’ (నీతి, శృంగార, వైరాగ్య శతకాలు), బాణభట్టు రచించిన ‘చండీశతకమ్’ ప్రసిద్ధాలు. అయితే మరో గొప్ప శతక కవీ ఉన్నాడు. ఆతడే మయూరభట్టు. తాను రచించిన ఒక్క ‘సూర్యశతకమ్’తోనే విశిష్టకవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినాడు.
‘బిభ్రాణా వామనత్వం ప్రథమమథ తథై వాంశవః ప్రాంశవోవః.. కృచ్ఛాణ్యుచ్ఛ్రాయ హేలోపహసిత హరయే హారిదశ్వా హరన్తు’ (సూ.శ.శ్లో.7)- విష్ణువు వలెనే తొలుత వామనత్వాన్ని ధరించి (చిన్నవిగా ఉండి), తర్వాత దీర్ఘమైనవై దేవతల శత్రువైన బలి చక్రవర్తి సామ్రాజ్యాన్ని లాగివేసుకున్నట్టుగా -చీకటి నుంచి విశ్వాన్ని విడిపిస్తూ వ్యాపిస్తున్న సూర్య కిరణాలు మీ (అంటే లోకుల) కష్టాలను హరించుగాక – అని కోరుతున్న ఈ శ్లోకం మయూరభట్టు రచించిన ‘సూర్య శతకమ్’ లోనిది.
ఇటువంటి అద్భుత భావనలతో నూరు శ్లోకాలున్న ఈ శతకమ్లోని సగం శ్లోకాలను వేర్వేరు కాలాల్లోని ప్రసిద్ధ ఆలంకారికులు, వైయాకరణులూ, నిఘంటు కర్తలూ, వివిధ కవుల శ్లోకాల సంకలనకర్తలూ తమ తమ గ్రంథాల్లో ఉదహరించినారంటే- మయూరభట్టు ‘సూర్య శతకమ్’ ఎంతటి గొప్ప గౌరవమున్న రచనో తెలుస్తున్నది. ఈ ‘సూర్యశతకమ్’తో పాటు ‘సూర్యదండకమ్’, ‘మయూరాష్టకమ్’, ‘మయూర ముక్తకాలు’ మయూరభట్టు రచనలేనని పండిత పరిశోధకులు తేల్చిచెప్పినారు.
గుప్తవంశరాజుల తర్వాత- దక్షిణాన నర్మదానది వరకూ విస్తరించిన పుష్యభూతి (వర్ధన) వంశ విశాల సామ్రాజ్యంలో ‘ప్రీతికూట’ (ఇప్పుడిది బీహార్లో గంగా, సోన్ నదుల సంగమస్థలంలో, దేవ్ పట్టణానికి 55 కి.మీ.దూరంలో ఉంది) అనే గ్రామంలో కవి మయూరుడు జన్మించినాడని అంటుంటారు. అక్కడి శాకలద్వీపీయ బ్రాహ్మణులు తాము మయూరభట్టు వంశస్థులమని చెప్పుకొంటుంటారు. ఇంతేకాకుండా గౌరవసూచకంగా ఆ గ్రామం పేరు ‘మయూర్’గా మారింది. ఇప్పుడు ‘పీరూ’గా పిలవబడుతున్న ఈ గ్రామంలో మయూరకవి పేరుతో సూర్యపూజల పరంపర కొనసాగుతూ ఉంది. క్రీ.శ.14వ శతాబ్దివాడైన బహుముఖ ప్రజ్ఞావంత విద్వాంసుడూ, వైద్యుడూ అయిన శారంగధరుడు పూర్వకవులు రాసిన 4,689 శ్లోకాలను ఒక సంకలనంగా మార్చిన ‘శారంగపద్ధతి’ గ్రంథంలో 10వ శతాబ్దికి చెందిన నాటకకర్తా, ఆలంకారికుడు రాజశేఖరుడిదిగా చెప్పబడుతున్న- ‘అహో! ప్రభావో వాగ్దేవ్యాః యన్మాతంగా దివాకరః శ్రీహర్ష స్వాభవత్సభః సమో బాణ మయూరయోః’ – ఆహా! వాగ్దేవి ప్రభావమెంత గొప్పనైనది, మాతంగుడు (తక్కువ కులంవాడు) అయినట్టి దివాకరుడు- బాణ మయూర కవులతో సమంగా హర్షవర్ధనుడి ఆస్థానంలో సభ్యుడైనాడు – అనే శ్లోకం ప్రకారం మయూరభట్టు సమ్రాట్ హర్షవర్ధనుడి- ఆస్థానకవి అనీ, బాణుడికి సమకాలికుడనీ తెలుస్తున్నది.
బాణుడు తాను రాసిన ‘హర్ష చరితమ్’ గ్రంథంలో తనకున్న 44 మంది బాల్యమిత్రుల్లో మయూరుడు ఒకడనీ, ‘జాంగులికో మయూరచ్చ’ మయూరుడు వృత్తి చేత సర్పవైద్యుడనీ పేర్కొన్నాడు. హర్షవర్ధన మహారాజు పరిపాలనాకాలం (క్రీ.శ.606-647) కనుక మయూరకవి కాలం క్రీ.శ.7వ శతాబ్ది.
మయూరుడు సర్పవైద్యుడిగా ఉంటూనే ‘చాటుశ్లోకా’లను అద్భుతంగా, ఆశువుగా అవలీలగా చెప్పేకవిగా పండితుల దృష్టిలో పడి హర్షవర్ధన మహారాజు మన్ననలు పొంది ఆస్థానంలో బాణుడి సరసన చేరాడు. మయూరుడి సోదరిని బాణభట్టు పరిణయమాడగా అతడికి శ్వశురు(బావమరిది)డై దగ్గర బంధువైనాడు.
‘సూర్యశతకమ్’ రచన వెనుక: విధివశాత్తుగానో, శాపవశాత్తుగానో మయూరుడు కుష్ఠువ్యాధిగ్రస్థుడైనప్పుడు ఆత్మీయులెవరో – సూర్యదేవారాధనతోనే నీవు వ్యాధిముక్తుడివవుతావని చెప్పగా మయూరుడు ‘సూర్యశతకమ్’ రచనను ప్రారంభించి, పూర్తిచేసి కుష్ఠువ్యాధి విముక్తుడైనాడని ఒక కథనం. తన అంధత్వం పోగొట్టుకోవడానికి మయూరుడు ఈ శతకరచన చేసినాడని మరో కథనం. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాల్లో ఉన్న ‘దేవ్’ పట్టణంలో ఉన్న సూర్యదేవాలయంలో మయూరుడు ఆ కాలంలో తపస్సు చేస్తూ ఈ శతక రచన చేసి మళ్లీ ఆరోగ్యవంతుడైనాడనీ ఇంకో కథనం.
‘శీర్ణఘ్రాణాంఘ్రిపాణీ… (సూ.శ.శ్లో.6) (శిథిలమై విడిపోయిన ముక్కులు, పాదాలూ, హస్తాలూ కలవరూ, వ్రణాలున్న అవయవాలో, ఘరఘరల కంఠస్వరాల పలుకులతో – అనేక పాపాల ఫలితంగా ఈ రోగాలతో బాధపడేవారిని ఏ సూర్యుడు మళ్లీ ఎప్పటిలాగే ఆరోగ్యావయవాలను కూరుస్తాడో, ఆ సూర్యుడి కిరణాలు పాపవినాశ మొనరించుగా-) అనే ఈ శ్లోకాన్ని మయూరుడు కుష్ఠువ్యాధి నుంచి విముక్తికే రచన చేసినాడనే కథనానికి బలం చేకూరుస్తున్నది.
‘సూర్యశతకమ్’ ప్రశస్తి: మయూరుని ‘సూర్యశతకమ్’లోని శ్లోకాలను రాళ్లపై చెక్కించిన కీర్తిగౌరవాలు తమిళనాడు రాష్ర్టానికి చెందుతాయి. కాంచీపురంలో 11వ శతాబ్దంలో నిర్మించిన ‘కచ్చలే(పే)శ్వరస్వామి’ గుడిలో ఒక స్తంభంపై ‘సూర్యశతక’ శ్లోకాలు మయూర విరచితమైనవి ఆరు కన్పిస్తున్నాయి. మొత్తం నూరు శ్లోకాలను చెక్కిస్తే చోళ, చాళుక్యరాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలలో చెరిగిపోయి ఈ ఆరు శ్లోకాలే మిగిలినాయని పురావస్తు శాఖాధికారులు చెప్తున్నారు. ఇంతేకాకుండా శ్రీనాథాది మహాకవులు ఈ మయూర శతకంలోని నచ్చిన శ్లోకాలను అనువదించి తమ కావ్యాల్లో చేర్చుకున్నారు. ఈ ‘సూర్యశతక-ప్రేరణతో జగన్నాథ పండితుడు, ఏనుగు లక్ష్మణకవి మున్నగువారు ఆరుగురు సంస్కృతంలో సూర్య శతకాలు రచించారు.
మయూరభట్టు ‘సూర్యశతకమ్’: మయూరభట్టు రచించిన ఈ ‘సూర్యశతకమ్’ గొప్ప స్తోత్రకావ్యమై శాశ్వత గౌరవకావ్యంగా (Classicగా) కావ్య ప్రపంచంలో తనదైన చోటు సంపాదించుకున్నది. ఇందులో ఆరు విభాగాలున్నాయి. 1.‘ప్రభా’ (సూర్యకాంతి)లో 43 శ్లోకాలు; 2.‘అశ్వాలు’లో 6 శ్లోకాలు; 3.‘అరుణుడు’ (సారథి)లో 12 శ్లోకాలు; 4.‘రథం’లో 11 శ్లోకాలు; 5.‘సూర్యమండలం’లో 8 శ్లోకాలు; 6.‘రవి’లో 20 శ్లోకాలు- ఇట్లా ఆరు విభాగాల్లో మొత్తం నూరు శ్లోకాలున్నాయి. ‘శ్లోకా లోకస్యభూతై.. ’ అనే శ్లోకం నూటా ఒక్క శ్లోకంగా కనిపిస్తుంది. కానీ, ఇందులో మయూరభట్టు కవితా ముద్రలేదనీ, ఇది- ప్రక్లిప్త శ్లోకమనీ పండితవర్గాలు తేల్చేసినాయి.
కవి మయూరుడు – గంభీరమైన నడకతో సాగే స్రగ్ధరావృత్త ఛందస్సును ఎన్నుకొని, ఓజో గుణంతో క్లిష్ట పదగుంఫనతో, దీర్ఘసమాసభూయిష్ఠంగా, ఆవేశవేగంగా నడిచే గౌడీరీతి రచనా పద్ధతిలో ‘బమ్భారాతీభకుమోద్భమివ దధతః సాన్ద్రసిందూరేణుం’ అంటూ తన ‘సూర్యశతకమ్’ రచనను ప్రారంభించాడు.
‘విస్తీర్ణం వ్యోమదీర్ఘాః’ (శ్లో. 17) అనే శ్లోకంలో సూర్యోదయం కాగానే ఆకాశాదుల వైశాల్యం కనబడుతుందని అంటాడు. సూర్యదేవుడు తన దీప్తితో అన్ని ద్వీపాలకు దీపం వంటివాడనీ ఇంకో శ్లోకంలో చెప్తాడు. ఒక శ్లోకంలో ప్రాతః సూర్యకాంతిని చిత్రకారుని కుంచెతో పోలుస్తాడు. ‘మీలచ్ఛక్షుర్విజిహ్మశ్రుతి’ (శ్లో.31) అనీ లోకంలో కాలసర్పం కరిచి పడిపోయినవాళ్లను సర్పవైద్యుడు తన వైద్యంతో బాగుచేసి లేపినట్టుగా- నిద్రలో మైమరిచి ఉన్న ప్రాణులను సూర్యతేజస్సు లేపుతుందని చెప్తూ తన సర్పవైద్య స్వభావాన్ని చెప్పకనే చెప్తాడు. ఇంకో శ్లోకంలో సూర్యకాంతి లోకోత్తర సిద్ధాంజనమనీ, అది నేత్ర రోగాదికాన్ని తొలగిస్తుందని ప్రకటిస్తూ తనకు వచ్చిన అంధత్వాన్ని పోగొట్టుకోవడానికే ఈ రచన చేశాడేమోనన్న అనుమానాన్ని కలిగిస్తున్నాడు.
‘ప్రాతః శైలాగ్రరంగే (శ్లో.50) అనే శ్లోకంలో ఉదయాచలాగ్రమనే నాటకరంగంపై సూర్యసారథి అరుణుడిని- నాటక ప్రారంభంలో కనిపించి దిన నాటకాన్ని పరిచయం చేసే సూత్రధారుడితో పోలుస్తాడు. మరో శ్లోకంలో సూర్యరథాన్ని – సముద్ర మథన మందర పర్వతంతో పోలుస్తూ విష్ణువుకు లక్ష్మీదేవిని ఇచ్చినట్టుగా – లోకులకు మరో లక్ష్మిని (సంపదను) ఇచ్చుగాక – అని కోరుతాడు.
ఇక ‘దేవః కిం బంధవః స్యాత్ప్రియ సుహృద..’ (శ్లో.100) సూర్యదేవుడు జగత్తులను బంధువా? ప్రియమిత్రుడా? మార్గనిర్దేశక ఆచార్యుడా? మహాప్రభువా? కాపాడే రక్షయా? నేత్రమా? దీపమా? గురువా? తండ్రియా? జీవితమా? బీజ కారణమా? తేజో శక్తియా? ఇంతకూ ఎవరీతడు? అని ఆలోచించినప్పుడు ఒక్క నిర్ణయానికి అందడో అటువంటి సూర్యదేవుడు జగత్తులకు అన్ని ఆకారాలలోనూ ఉపకారం చేస్తూ మీకు (లోకులకు) కోరినవాటిని ప్రసాదించుగాక – అంటూ మయూరుడు నూరవ శ్లోకంతో ఈ ‘సూర్య శతకమ్’ను సమాప్తం చేశాడు.
మయూరుడు ఇందులో సూర్యప్రభను అశ్వాలనూ, సారథినీ, రథాన్నీ, సూర్య మండలాన్నీ, సూర్యుడినీ సర్వ కోణాల్లోనూ వర్ణిస్తూ, ‘నా’, ‘మా’ అని స్వార్థానికి ఏమి కోరుకోకుండా – లోకుల సంక్షేమాన్ని ఇందులోని ప్రతి శ్లోకమకుటంగా నిలిపి, సూర్యప్రభ, సప్తాశ్వాలూ, సూర్యసారథీ, రథమూ, సూర్యమండలమూ, సూర్యుడు లోకులకు సదా క్షేమాన్ని కలిగిస్తూ పాపాలను పోగొడుతూ, సౌఖ్య సంపదలను, ఆరోగ్యాన్నీ కలిగించుగాక- అంటూ లోకుల సంక్షేమాన్నే మయూర కవి అభిలషించాడు.
కాశ్మీరదేశీయ ఆలంకారుడు అయిన మమ్మటుడు (10వ శతాబ్ది) తన ‘కావ్య ప్రకాశః’ గ్రంథంలో కావ్యరచన పఠనాదుల వల్ల కలిగే ప్రయోజనాలు చెప్తూ ‘ఆదిత్యాదేః మయూరాదీన మివ అనర్థ నివారణమ్’ (మయూరాది కవులకు ఆదిత్యాది దేవతల వల్ల అనర్థనివారణం’ జరిగినట్టు చెప్పినాడు.
మయూరభట్టు విరచిత ‘సూర్యశతకమ్’ దివ్యశక్తి గలదనే విశ్వాసం బలపడిపోయి లోకులు దీనిని మహిమాన్విత స్తోత్రకావ్యంగా తలచుకోవడం ప్రారంభించారు. భారతదేశంలోని భక్తులు నేటికీ సూర్యపూజలో ఈ శతకాన్ని పారాయణ గ్రంథంగా పఠిస్తుంటారు.
– రఘువర్మ (టీయల్యన్) 92900 93933