మహాభారత అనువాద విశ్వరూపం
మహాభారతం భారతీయ జన జీవన సంఘర్షణకు నిలువుటద్దం.భారతీయ సాంస్కృతిక వైవిధ్యతకు సామూహిక ప్రతిబింబం. సా
మహాభారతం భారతీయ జన జీవన సంఘర్షణకు నిలువుటద్దం.భారతీయ సాంస్కృతిక వైవిధ్యతకు సామూహిక ప్రతిబింబం. సాహిత్య రూపంగానే కాక సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ,చారిత్రక, పాలనాపరమైన, భక్తి తాదాత్మ్యతతో కూడిన ఒక సంపూర్ణ, సమగ్ర జీవన చిత్రం. భారతీయ జీవన విలువల విశిష్టతను ఒకేచోట అందిస్తున్న జ్ఞాన సంచయం – మహాభారతం!
అందుకే మహాభారతం భారతీయ ప్రజా జీవన స్రవంతిలో అంతర్భాగంగా, భారతంలోని కథలు, పాత్రలన్నీ మన జీవితానికి ప్రతిరూపాలుగా చేతనంగా, అచేతనంగా, సుప్తచేతనంగా
మనందరిలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ప్రపంచ దేశాల్లో భారతీయ అస్తిత్వ పతాకంగా, సామూహిక మానసిక బంధంగా ఇతిహాసమై సాగుతున్నది. మహాభారతం వేదవ్యాసుని రచనగా సంస్కృతంలో మొదలైనప్పటికీ ఆ తర్వాత వేర్వేరు భాషల్లోకి అనువాదమై, భారతదేశంలోని వైవిధ్యత, విభిన్నత, విస్తృతికి అనుకూలంగా తనను తాను మార్చుకుంటూ గంగా నదిలా ప్రవహిస్తూ వస్తున్నది.
9వ శతాబ్దంలోనే మహాభారత గాథను ‘విక్రమార్జున విజయం‘ అనే పేరుతో కన్నడ భాషలో ఒక తెలంగాణ కవి తొలిసారిగా అనువదించాడు. ఆయనే మహాకవి పంపన! వేములవాడ ప్రాంతం నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి రెండవ అరికేసరి చక్రవర్తి సమకాలికుడుగా కొనసాగి, ‘తెలుగన్నడ బంధాని’కి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పంపన రాసిన ‘పంప భారతం’ 1,100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగులో ఇటీవలే అనువాదమైంది. ప్రముఖ కవయిత్రి, ‘అక్షర్ యాన్’ వ్యవస్థాపకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి పూనికతో, డాక్టర్ జోస్యుల సదానంద శాస్త్రి అనువాద రచనలో, పద్మభూషణ్ వరప్రసాద్‌రెడ్డి ప్రచురణలో వచ్చిన ఈ 1,800 పేజీల బృహత్ అనువాద గ్రంథం, ఇప్పుడు తెలుగు సాహితీ లోకంలో చర్చను లేవనెత్తింది. తెలంగాణ సాహితీ చరిత్రకు కొత్త చేర్పును అందించింది. ఈ నేపథ్యంలో సంస్కృత మూల మహాభారత గాథ వివిధ భారతీయ, ప్రపంచ భాషలలో అనువాదమైన తీరుతెన్నులపై అవలోకనం చేయాల్సిన అవసరాన్ని సృష్టించింది.
మహాభారత అనువాదాలు:
వేద వ్యాసుడు రచించిన మహాభారతాన్ని వివిధ భాషల్లో పలువురు సాహితీవేత్తలు అనుసృజనను, అనువాదాలను చేశారు. వీటన్నింటి సమగ్ర విశ్లేషణను అనుసరించి, మహాభారత అనువాదాలు/అనుసృజనలను స్థూలంగా నాలుగు రకాలుగా నేను వర్గీకరించాను.
- మహాభారత యథాతథ అనువాదాలు
- మహాభారత ప్రధాన పాత్రల ఆధారిత కథనాలు
- మహాభారతంలోని విస్మృత పాత్రల ఆధారిత కథనాలు
- మహాభారతంలోని ఉపాఖ్యానాల ఆధారిత రచనలు.
ఇందులో కవిత్రయ విరచితమైన ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ కొంతవరకు మహాభారత యథాతథ అనువాదం కోవలోకి వస్తే, పంపన కవి రాసిన ‘విక్రమార్జున విజయం’ మహాభారత ప్రధాన పాత్రల ఆ ధారిత అనువాదాల కోవలోకి వస్తుందని చెప్పవచ్చు.
భారతం ఒక మహావృక్షం:-
నన్నయ మహాభారతాన్ని అనువదిస్తూ దాని విస్తృతిని మహావృక్షంతో పోల్చాడు. మహాభారత గాథ స్ఫూర్తితో, ఉపాఖ్యానాల స్ఫూర్తితో ఎన్నో రచనలు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో వచ్చాయి. వాటిలో క్రీ.శ. రెండు, మూడు శతాబ్దాల నాటి కాలంలో సంస్కృత పండితుడు భాసుడు ‘ఊరు భంగం’ అనే పేరిట ఒక అత్యంత అద్భుతమైన కావ్యాన్ని రాశారు. మహాభారతంలో చిట్టచివరిదైన దుర్యోధనుడు-భీముడు మధ్య జరిగే సంగ్రామాన్ని కథాంశంగా తీసుకొని ఆయన ఈ సంస్కృత కావ్యాన్ని రాశారు. ‘మధ్యమ వ్యాయోగం’ అనే పేరిట మరొక కావ్యాన్ని భీమునికి-ఘటోత్కచుడి మధ్య జరిగే సంవాదం కథాంశంగా భాసుడు సంస్కృతంలో రాశాడు.
సంస్కృత సాహిత్యానికి మహోన్నత స్థానాన్ని తీసుకొచ్చిన కాళిదాసు రాసిన మహా కావ్యాలలో ‘అభిజ్ఞాన శాకుంతలం’ కూడా ఒకటి. ఈ కావ్యం 4వ శతాబ్దంలో రాసినా దీనికి మూలం మహాభారతంలోని శకుంతలా – దుష్యంతుల ప్రేమ కథ స్ఫూర్తిగా నిలవడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయనే రాసిన ‘విక్రమోర్వశీయం’ కావ్యం! (మహారాజైన పురూరవునికి, దేవకన్య ఊర్వశికి మధ్య జరిగే ప్రేమ వృత్తాం తం) ఇది కూడా మహాభారత ఉపాఖ్యానం నుంచి తీసుకున్నదే!
ఇక వ్యాసుడి శిష్యుడైన జైమిని మహర్షి కూడా ‘జైమిని భారతం’ పేరిట
సంస్కృతంలో మహాభారతాన్ని రాశాడు. ఇందులో మొత్తం భారతాన్ని కాకుండా, అశ్వమేధ పర్వంలోని గాథనే ప్రధాన కథగా రాశారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు చేసిన ‘అశ్వమేధయాగం’ ఈ కావ్య ఇతివృత్తం.
భారతీయ భాషల్లో భారత గాథ:-
భారత గాథ ఇతర భారతీయ భాషల్లోకి రెండు రూపాలుగా వెళ్లిందని చెప్పవచ్చు.
- యథాతథ అనువాదం.
- మార్పులు చేర్పులతో తమదైన కథా రచన.
ఇక ఆధారాలు లభించిన మేరకు మహాభారత గాథ వివిధభారతీయ భాషలలో తొలి రూపాలు ఇలా ఉన్నాయి:-మొదట 9వ శతాబ్దంలో తమిళంలోకి ‘పెరుందేవనార్’ రాసిన ‘భారత వెణ్బ’ పేరుతోనూ, కన్నడలో పంపన ‘విక్రమార్జున విజయం’ పేరుతోనూ, తెలుగులో కవిత్రయం (నన్నయ్య 11వ శతాబ్దం నుంచి మొదలుకొని తిక్కన 13వ శతాబ్దం, ఎర్రన 14వ శతాబ్దం) రాసిన ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ పేరుతోనూ, అనువాదాలు వచ్చాయి. 15వ శతాబ్దంలోనే ఒడియాలో ‘సరళాదాస్’, మలయాళంలో ఎళుతచ్చన్ రాసిన (‘మహాభారతం కిళిప్పాట్టు’) బెంగాలీలో కవీంద్ర పరమేశ్వర తొలిసారిగా అనువదాలు చేశారని తె లుస్తున్నది.
బెంగాలీలో ఈ మహాభారతాన్నిమొదటిసారిగా 16వ శతాబ్దంలో అనువాదం చేశారు. హుబ్లీ ప్రాంతానికి చెందిన కవీంద్ర పరమేశ్వర్, సిల్హట్ ప్రాంతానికి చెందిన శ్రీసంజయ –
ఈ ఇద్దరిలో ఎవరు రాశారు అనేది స్పష్టంగా తెలియనప్పటికీ బెంగాలీలో రాసిన తొలి మహాభారతంగా ఇది తనదైన ముద్రను వేసింది.
హిందీలో రామ్‌ధారి సింహ్ ‘దినకర్’ (1908-1974) ‘రష్మీ రథి’ పేరుతో 1952లో రాసిన నవలను ఇప్పటికీ గొప్ప నవలగా పేర్కొంటారు. మహాభారతంలోని కర్ణుడిని ప్రధానపాత్ర చేసుకుని ఈ నవలను ఆయన రాశారు. ఈయన రాసిన ‘కురుక్షేత్ర’ కవిత కూడా భారతంలోని శాంతి పర్వం నుంచి స్ఫూర్తి పొందిన రచనే!
(సశేషం)
-డాక్టర్ మామిడి హరికృష్ణ
8008005231
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

