పొగడ్తను మించిన తిట్టు లేదు
తిట్టును మించిన పొగడ్త లేదు
పొగడ్తనే కవచంగా పెట్టుకున్నవాడికి
ఎన్నితిట్లు తిట్టినా ఏం లాభం?
ప్రభువు వాస్తుతో శోభిల్లున్
పస్తులతో ప్రజలు శోషిల్లున్
కాసుల్లేక పొలముల్ అంగలార్చున్
పాలాభిషేకాలతో దేవుడికి జలుబు పట్టున్
అధముల డొక్కలు అగాధములగున్
కొందరు తమ పిక్కలతో ఎవరెస్టును మించిపోవున్
వేళ్లే ఆధారమైన ఆకాశానికి నిచ్చెనవేస్తున్న
కోటానుకోట్ల మెదళ్లను
ట్రంపాము రంపంతో సిద్ధంగా ఉన్నది
కీబోర్డును మౌస్ ఎత్తుకెళ్లి ఏ కన్నంలో దాచిందో
ఇప్పుడా ఇండియన్ వేళ్లకు
వేరేపని అలవాటయ్యేదాకా
కొంతకాలం అరచేతిని బొచ్చెగా మార్చుకోమనండి
ఆమె ఎందుకో మౌనంగా ఉన్నది
సుత్తెను కూరాడు కుండలా భుజాన పెట్టుకొని
నాగలిని వడ్డాణంగా చుట్టుకొని
చక్రాన్ని చాపలా చుట్టుకొని
ఉలిని సిగలో తురుముకొని
కొడవలిని చంద్రవంకలా చేసుకొని
అరుగుమీంచి లేచింది
పెద్దర్వాజ దాటింది… వాడను దాటింది
ఊరి కొసకచ్చింది
వెనక్కి తిరిగి చూసింది
కండ్ల నుంచి జలపాతం మౌనంగా దుంకుతున్నది
నోరు తెరచి డప్పంత అరవాలనుకుంది
తనకన్నా ముందే ఉరుకుతున్న నెత్తురు చుక్కలు
ఆ చుక్కల వెనక తను కొంతదూరం
తన నడికట్టు మూట ముడివిప్పి
పిడికెడు విత్తనాలు తీసి..
భూమ్మీద చల్లింది
విత్తనాలు అనేక భాషల్లో తర్జుమా అవుతూ
ఆమెకు గొడుగుపట్టాయి
-నూర శ్రీనివాస్