నా దేహంలో శక్తి ఎక్కడికో ఎగిరి అదృశ్యమైపోయింది
తిరిగి పుంజుకోవడానికి
మరికొంత విరామం అవసరమేమో!
జీవితంలో చిట్లిన ఈ శూన్యరోదనల్ని
నిశ్శబ్దంలో విషాద స్మృతులుగా నెమరేసుకుంటూ
ఒంటరిగా కూర్చొని నిట్టూరుస్తున్న మనసు
గతాన్ని వర్తమానంలో తవ్వుకుంటోంది
పక్షులు రెక్కలాడించడం ఆపేశాయి
మా పిట్టగోడపై నిత్యం ప్రత్యక్షమయ్యే కాకి
ఎందుకో వాలడం మానేసింది
మా ఇంటి ముందు
వీధి లైటు కింద
మూడు రోజుల్నుండి
కుక్క అన్నం తినడం మానేసింది
నా కలల అడుగుల్ని కట్టడి చేస్తూ
మంచానికే నన్నిలా పరిమితం చేస్తుంటే,
కంటి చెమ్మతో తుడిచే మాటలు
నా పక్కనే వాలుతూ విషాదంతో జోకొడుతున్నాయి
నిజం చెప్పాలంటే నేనిప్పుడు
నా శరీరంతో యుద్ధం చేస్తున్నాను
నా దేహపు వాకిలిని
చీపురుతో శుభ్రం చేసే లేపనాన్ని పూయాలి
ఈ క్షణంలో నా స్నేహితులే నా గది గోడలు
సుదూర తీరంలో ఉన్నా
‘నువ్వెలా ఉన్నావంటూ’ అమ్మ చేసే
ఆత్మీయ పలకరింపు కన్నా
నాకిప్పుడేం కావాలి
కష్టకాలంలో మనుషుల్ని
ప్రేమించే మనసులుంటే
ఓదార్పును మించిన
ఆత్మీయబంధం ఇంకేముంటుంది
వీలైనంత తొందర్లో
ఈ నేలతో మళ్లీ యుద్ధం చేస్తాను
ప్రకృతి గాలి ఔషధమై
నాలో కొత్త ఊపిరిని నింపుతుంటే,
బతుకు రెక్కల్తో స్వేచ్ఛగా
మళ్లీ ఎగిరిపోయే రోజులొస్తాయ్
ప్రస్తుతానికి ఇదొక విరామం మాత్రమే
కొన ఊపిరి మిగిలినంత వరకూ
నా అడుగుల చప్పుడు
యుద్ధం రూపంలో మొదలవుతుందేమో!
-ఎన్.లహరి
98855 35506