నలుదిక్కుల నుంచి నలుగురొస్తే
ఒక గుంపు తోడైతది
తోడైన నాలుగు
ఆలోచనలకు తొవ్వైతది
ఇది చౌరస్తా!
ఎక్కడ మొదలైందో
బాల్యం మొదలైనట్టు…
బుడిబుడి అడుగులు ఏసి ఏసి
ఇప్పుడు ఇక్కడ నిటారుగా
నిలబడ్డాయి కాళ్ళు
ఎన్ని కుటుంబాల నిలయమిది
ఎన్ని స్నేహాల కలయిక
తీసివేత ఎరుగదు
అంతా కూడికనే…
నలుగురు మాట్లాడిన
మాటలు మూటలే
వెయ్యి ఏనుగుల బలమైతది
నాలుగు చేతులే
బోలెడన్ని చప్పట్లు!
నలుగురి ఆలోచనతోనే.
నాణ్యమైన ధర నిర్ణయమైతది!
ఇక్కడ అన్నీ అమ్ముకోవచ్చు
అన్నీ కొనుక్కోవచ్చు
నడుస్తూ నడుస్తూ చౌరస్తా దొరికిందనుకో
అప్పుడు నీ రస్తా నీకు దొరుకుతది!
ఒంటరిగా ఉన్నవాడికి
జంట దొరుకుతది
అది బతుకైతది!
ఎవరిదైనా ఆ బతుకు బాగైతది!
– కందుకూరి శ్రీరాములు 94401 19245