ఏ ప్రేమికుల గుర్తో,
ఎక్కడి ప్రయాణికుల కలనో,
విరిగిపోయిన పడవ
సముద్రం ఒడ్డున పడి ఉన్నది
అతడు నేను కవిని అని చెప్పుకోలేదు
బ్యాండేజీ మీద నెత్తురు కనిపించినట్టు,
అందరు అతని కళ్ళల్లో కవిత్వం చూశారు
యుద్ధాలు జరిగిన తర్వాత
అతడు కవిత్వం మానేసి,
మనుషులను ప్రేమించడం ముఖ్యమన్నాడు.
అతడు పుస్తకాలు ప్రచురించాడో
లేదో తెలియదు కానీ,
ఎవరూ పట్టించుకోని విరిగిన పడవను,
బాగుచేయడం మొదలుపెట్టాడు
ఖైదీలందరూ వాళ్ల వయసు మరిచిపోయి,
చాలా ఏండ్లు గడిచాయి.
వాళ్లు, జైలు గోడలు కూలడం కోసం,
చిన్నపిల్లల్లా, ఇప్పటికీ
కలలు గంటూ నిరీక్షిస్తున్నారు
ఎప్పుడో సూర్యుడు కిటికీ మీద,
పక్షులతో కలిసిపోతాడు
అతడు కవిత్వం రాస్తానని,
ఎప్పుడూ అనలేదు
చీకట్లో, తుఫానుకు ఎదురుగా వెళ్లి,
దీపాలు పెట్టడానికి
కొట్టుకుపోతుంటే తెలిసింది,
వెలుతురే అతడు రాసే కవిత్వమని!
ప్రయత్నమే దాని సౌందర్యమని!!
– ఆశారాజు 93923 02245