సముద్రం అన్నాక
అలలూ ఆటుపోట్లు సహజమే
ఇప్పుడు, మనిషీ మనసుకు కూడా
నిత్య సంఘర్షణ యుద్దమే
ఋతువులు మారి
కాలం కునుకును మరచి
కదులుతుంది
శబ్దాల మధ్య నిశ్శబ్దం కూడా
తరలి వెళుతుంది
నిట్టూర్పుల మధ్య నీడలు కొన్ని
అబద్ధాలు వల్లె వేస్తాయి
నీకూ, నాకూ పోరు,
ఆధిపత్యం కొత్తదేం కాదు
రోజులన్నీ మాటల మర్మంతో నడుస్తాయి
ఊసరవెల్లి లెక్కన రంగులు కూడా
కొత్త పొద్దును సృష్టిస్తాయి
హద్దులు లేని ఆశలు అలల్లా నిలిచి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
మళ్ళీ కొత్తగా ఆశయాన్ని సరికొత్తగా తిరగతోడాలి
పడిన చోటునే
పరిచయాన్ని ఆవిష్కరించాలి
నవ్విన దిక్కులు మళ్లీ సిగ్గుపడేలా
నువ్వే ఒక కెరటమై లేవాలి
కాలం గమనంపై నువ్వొక
రోల్ మాడల్‌గా నిలవాలి…!
మహబూబ్ బాషా చిల్లెం
95020 00415