ఒక్కరు చేస్తే
ఇందరు తింటారు
పొయ్యిలోని జ్వాలను చూస్తూ
ఉడికి పోతుందామె.
రొట్టెలు చెయ్యడం నేర్చుకోమ్మా
అంటారు కుటుంబ సభ్యులు
చందమామలా
గుండ్రంగా ఉండాలంది అమ్మ.
అమ్మాయి చేసింది గాని
అది సుదర్శన చక్రంలా
నొక్కులు నొక్కులుగా మారి
ఆయుధంగా కుదిరింది
అదొక ధిక్కారం!
ఎక్కడా మాడ్చగూడదు
రొట్టె సాంతం సమంగా కాలాలి
రొట్టేమో గాని
ఆమె ముఖం మాత్రం
నల్లగా మాడిపోయింది
అదిక తిరస్కారం!
రొట్టె తినే వారికి
చక్కటి పరిమళం రావాలి
మనసు పెట్టి చేస్తే
మంచి రుచి వస్తుంది.
ఎన్నిసార్లు చేసినా
రొట్టె కుదరటం లేదు
పెంక మీద సరాతంతో
దేన్నో కెలుకుతుంది
అదొక తృణీకారం.
మొత్తానికి
రొట్టెలు తయారై
బేసెన్లో పోగుపడ్డాయి
తినే వాళ్లందరూ
ఇష్టంగా భుజించి తృప్తి పడ్డారు
ఆమె లోపల ఏదో వెలిగింది
అది మమకారం!
డాక్టర్ ఎన్. గోపి
93910 28496